Narendra modi – Xi Jinping | పరస్పర విశ్వాసం, గౌరవాల ఆధారంగా భారత్‌, చైనా సంబంధాలు : చైనాలో మోదీ

షాంఘై సహకార సంఘం సదస్సులో రష్యా అధ్యక్షుడు వ్లదీమిర్‌ పుతిన్‌తోనూ మోదీ భేటీ కానున్నారు. భారత ఎగుమతులపై సుంకాలను పెంచిన తర్వాత పుతిన్‌, మోదీ సమావేశం కావడం ఇదే తొలిసారి. భారత్‌పై సుంకాలు విధించడానికి రష్యా నుంచి చమురును కొనుగోలు చేయడం కారణంగా అమెరికా పేర్కొన్న నేపథ్యంలో వీరిద్దరి సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది.

Narendra modi – Xi Jinping | భారత్‌, చైనా సంబంధాలు పరస్పర విశ్వాసం, గౌరవాల ఆధారంగా ముందుకు సాగాలని ప్రధాని మోదీ అన్నారు. చైనాలోని టియాంజిన్‌లో షాంఘై సహకార సంఘం (ఎస్‌సీవో) సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ ఆదివారం సమావేశమయ్యారు. అటు చైనా, ఇటు భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సుంకాల యుద్ధం ప్రకటించిన నేపథ్యంలో రెండు దేశాల నాయకత్వం సమావేశం ప్రాధాన్యం సంతరించుకున్నది. రెండు దేశాల మధ్య సంబంధాల్లో నూతన పురోగతికి ఈ ద్వైపాక్షిక చర్చలు పునాదులు వేశాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వీరిద్దరి మధ్య దాదాపు గంటపాటు చర్చలు సాగాయి. సరిహద్దు ఉద్రిక్తతలపై ప్రత్యేక ప్రతినిధులకు సంబంధించి ఒప్పందంతోపాటు.. కైలాస్‌ మానస సరోవర యాత్ర పునరుద్ధరణ, ఇరు దేశాల మధ్య నేరుగా నడిచే విమాన సర్వీసుల పునరుద్ధరణ వంటి పరిణామాలను మోదీ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ‘భారత్‌–చైనా దేశాల్లోని సుమారు 280 కోట్ల మంది ప్రజల ప్రయోజనాలు మన సహకారంతో ముడిపడి ఉన్నాయి. ఇది మానవాళి సంక్షేమానికి మార్గం చూపుతుంది’ అని మోదీ చెప్పారు. రెండు దేశాలూ వ్యూహాత్మక స్వాతంత్య్రాన్ని అనుసరిస్తున్నాయని, మూడో దేశం దృష్టిలోనుంచి వీటిని చూడరాదని మోదీ చెప్పినట్టు భారత విదేశాంగ శాఖ తన ప్రకటనలో తెలిపింది. బీజింగ్‌కు అత్యంత విలువైన మిత్రుడిగా ప్రధాని మోదీని చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ అభివర్ణించారు. సరిహద్దు సమస్య అనేది మొత్తం సంబంధాలను నిర్వచించకూడని వ్యాఖ్యానించారు. వ్యూహాత్మక, దీర్ఘకాలిక దృక్కోణంతో రెండు దేశాలు పరస్పర సంబంధాలను కొనసాగించాలని అన్నారు. డ్రాగన్‌ (చైనా అధికార జంతువు), ఏనుగు (భారతదేశం అధికార జంతువు) కలిసి నడవటం అత్యవసరమని ఆయన పిలుపునిచ్చారు.

ఏడేళ్ల సుదీర్ఘ విరామం అనంతరం మోదీ తొలిసారి చైనాలో అడుగు పెట్టారు. చివరిసారిగా వూహాన్‌లో వీరిద్దరు సమావేశమయ్యారు. ఆర్థిక, వ్యూహాత్మక అనుసంధానంపై ఈసారి ఇరువురు నేతలు దృష్టి కేంద్రీకరించారు. భారతీయ ఎగుమతులపై అమెరికా 50 శాతం సుంకం విధించిన సమయంలో దానిని చైనా తీవ్రంగా ఖండించింది. అంతేకాదు.. ఈ విషయంలో తాము భారతదేశం పక్షాన నిలుస్తామని ప్రకటించింది. అమెరికా చర్యలను దౌర్జన్యంగా అభివర్ణించింది. అమెరికా – చైనా మధ్య సుంకాల విషయంలో తాత్కాలిక విరామం ఉన్నప్పటికీ.. ట్రంప్‌ ఇటీవల 200 శాతం అదనపు సుంకం విధిస్తామని ప్రకటించడంపై చైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది.

షాంఘై సహకార సంఘం సదస్సులో రష్యా అధ్యక్షుడు వ్లదీమిర్‌ పుతిన్‌తోనూ మోదీ భేటీ కానున్నారు. భారత ఎగుమతులపై సుంకాలను పెంచిన తర్వాత పుతిన్‌, మోదీ సమావేశం కావడం ఇదే తొలిసారి. భారత్‌పై సుంకాలు విధించడానికి రష్యా నుంచి చమురును కొనుగోలు చేయడం కారణంగా అమెరికా పేర్కొన్న నేపథ్యంలో వీరిద్దరి సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది.