భ‌గ‌త్‌సింగ్ కేసును తిరిగి ప‌రిశీలించాలి.. పాకిస్థాన్ న్యాయ‌వాదుల డిమాండ్‌

పాకిస్థాన్ సుప్రీం ఇచ్చిన ఈ తీర్పు స్వాతంత్ర స‌మ‌ర‌యోధుడు భ‌గ‌త్ సింగ్ కేసు విష‌యంలో కొత్త ఆశ‌లు నెల‌కొల్పుతున్న‌ది

  • Publish Date - April 8, 2024 / 11:39 AM IST

లాహోర్ : శ‌నివారం పాకిస్థాన్ సుప్రీం కోర్టు చారిత్రాత్మకమైన తీర్పు వెల్ల‌డించింది. 1979లో అప్ప‌టి పాక్ ప్ర‌ధాని జుల్ఫికర్ అలీ బుట్టోను తొంద‌రప‌డి ఉరి తీశార‌ని తీర్పునిచ్చింది. 12 ఏళ్ల క్రితం పాకిస్థాన్ అధ్య‌క్షుడు బుట్టో కేసును తిరిగి స‌మీక్షించాల‌ని సుప్రీంను కోరారు. దీంతో పాకిస్థాన్ అత్యున్న‌త న్యాయ‌స్థానం పై వ్యాఖ్య‌లు చేసింది. పాకిస్థాన్ సుప్రీం ఇచ్చిన ఈ తీర్పు స్వాతంత్ర స‌మ‌ర‌యోధుడు భ‌గ‌త్ సింగ్ కేసు విష‌యంలో కొత్త ఆశ‌లు నెల‌కొల్పుతున్న‌ది. 1931లో షాహీద్‌ భగత్ సింగ్ అతని సహచరులైన సుఖ్ దేవ్ థాపర్, శివరాం రాజ్ గురులను ఉరితీసిన సంఘ‌ట‌న‌పై స‌రైన విచార‌ణ జ‌ర‌గ‌లేద‌ని 2013లో లాహోర్ హైకోర్టులో సీనియ‌ర్ వ‌కీళ్లుగా ప‌ని చేస్తున్న అబ్దుల్ రషీద్ ఖురైషీ అతని కొడుకు ఇంతియాజ్ పిటిష‌న్ వేశారు. భగత్ సింగ్, సుఖ్ దేవ్ థాపర్, శివరాం రాజ్ గురు లను ఉరితీసిన లాహోర్ కుట్ర కేసును లాహోర్ హైకోర్టు తిరిగి పరిశీలించాలని కోరారు. ఇంతియాజ్ తన అనుభవాలను మీడియా తో పంచుకుంటూ లాహోర్ కుట్ర కేసులో హై కోర్టు ప్రొసీడింగ్స్ ను సరైన‌ విధంగా పాటించి న్యాయాన్ని అందించలేక పోయిందని ఆరోపించారు.

పోలీస్ రిపోర్టులో భగత్ సింగ్ పేరు కేవలం ఆ కేసు పరిస్థితిని బట్టే అందులో చేర్చారన్నారు. ఈ కేసు క్రింది కోర్టులో నడవ లేదన్నారు. లాహోర్ హైకోర్టులో ముగ్గురితో కూడిన ధర్మాసనం లాహోరు కుట్ర కేసును చూసింది. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు పరిశీలించకుండానే, ఆ కేసులో గల 450 మంది సాక్ష్యులను పరీక్షించకుండానే ఉరి శిక్ష తీర్పును వెలువరించారని వకీల్ ఇంతియాజ్ ఆరోపించారు. దోషులకు పై కోర్టులో అప్పీల్‌ చేసుకునే అవకాశం కూడా ఇవ్వలేదని తెలిపారు. మొత్తానికి లాహోర్ కుట్ర కేసులో సాక్ష్యులను పరిశీలించడంలోనూ, తీర్పును నిర్ణయించడంలోనూ, లోపభూయిష్టంగా అమలు జరిగిందని సీనియర్ వకీళ్లు విచారాన్ని వ్యక్తం చేశారు . ఈ విషయంపై సీనియర్ వయోవృద్ధ న్యాయకోవిదుడైన‌ ఏజీ నూరాణి స్పందిస్తూ భ‌గ‌త్ సింగ్ కేసును జ్యూడిషియల్ మర్డర్ గా పేర్కొన్నాడు. భగత్ సింగ్ లాహోర్ కుట్ర కేసును తిరిగి సమీక్షించాలనే పిటిషన్‌ను లాహోర్ హైకోర్టు పోయిన ఏడాది కొట్టివేసింది. అయితే తాజాగా బుట్టో కేసుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఉత్సాహం పొందిన ఇంతియాజ్ తిరిగి భ‌గ‌త్ సింగ్ కేసును సుప్రీంకోర్టులో రంజాన్ పండుగ త‌రువాత అప్పీల్ చేస్తామ‌ని పేర్కొన్నారు. పాకిస్థాన్ న్యాయ‌వాదులైన‌ ఖురైషి, ఇంతియాజ్‌లు భ‌గ‌త్‌సింగ్‌పై అభిమానంతో 2010లో భగత్ సింగ్ మెమోరియల్ ఫౌండేషన్‌ స్థాపించారు. ఈ ఫౌండేషన్ పాకిస్థాన్‌లోని భ‌గ‌త్ సింగ్ జ‌న్మ‌స్థ‌ల‌మైన బంగా అనే ప్రాంతంలో నెల‌కొల్పారు. భ‌గ‌త్‌సింగ్ జ్ఞాపకాలను ముందుకు తీసుకవెళ్లడమే ఈ పౌండేషన్ లక్ష్యమ‌ని తెలిపారు.

Latest News