గాజాకు నిత్యావ‌స‌రాల స‌ర‌ఫ‌రాకు ఇజ్రాయెల్ అనుమతి

  • Publish Date - October 19, 2023 / 08:41 AM IST

  • హ‌మాస్‌కు అంద‌కూడ‌ద‌ని ష‌ర‌తు
  • ఇజ్రాయెల్‌లో ప‌ర్య‌టిస్తున్న బ్రిట‌న్ ప్ర‌ధాని రుషి సునాక్‌


విధాత‌: ఇజ్రాయెల్‌ (Israel Hamas Conflict) తో అమెరికా చ‌ర్చ‌లు ఫ‌లించాయి. అధ్య‌క్షుడు జో బైడెన్‌, విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింక‌న్‌లు చ‌ర్చ‌లు జ‌రిపిన అనంత‌రం.. ఈజిప్ట్ నుంచి ర‌ఫా కారిడార్ మీదుగా గాజాలోకి నిత్యావ‌స‌రాల స‌ర‌ఫ‌రాను అనుమ‌తించ‌డానికి ఇజ్రాయెల్ ప్ర‌ధాని బెంజిమ‌న్ నెత‌న్యాహు అంగీకారం తెలిపారు. అవి హ‌మాస్ చేతికి చిక్క‌కూడ‌ద‌ని ష‌ర‌తు విధించారు.


అయితే ఈ ప్రాంతంలో పూర్తి శాంతియుత ప‌రిస్థితుల‌ను నెల‌కొల్ప‌డానికి బైడెన్ చేసిన ప‌ర్య‌ట‌న పూర్తి ఫ‌లితాల‌ను ఇవ్వ‌లేదు. గాజాలోని ఆసుప‌త్రిపై భీక‌ర దాడి జ‌రిగి సుమారు 500 మంది చ‌నిపోవ‌డంతో అమెరికా అధ్య‌క్షుడితో స‌మావేశాన్ని జోర్డాన్ ప్ర‌భుత్వం నిలిపివేసింది. మ‌రోవైపు హ‌మాస్ ఉగ్ర‌వాదుల వ‌ద్ద 200 మంది ఇజ్రాయెల్ పౌరులు బందీలుగా ఉండటంతో.. ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల నుంచి తీవ్ర ఒత్తిడి వ‌స్తోంది. బాధితుల కుటుంబ‌స‌భ్యులు తొలిసారిగా వీధుల్లోకి వ‌చ్చి త‌మ వారిని విడిపించాల‌ని ప్ల‌కార్డులు ప్ర‌ద‌ర్శిస్తున్నారు.


లెబ‌నాన్ – ఇజ్రాయెల్ స‌రిహ‌ద్దుల్లోనూ ఉద్రిక్త‌త‌లు కొన‌సాగుతున్నాయి. గురువారం త‌మ వైపు అగ్నిప్ర‌మాదం చోటుచేసుకుంద‌ని ఇది చొర‌బాటుదారుల ప‌నేన‌ని ఇజ్రాయెల్ సైన్యం ప్ర‌క‌టించింది. ఇక్క‌డ కూడా పోరు తార స్థాయికి చేరుతుంద‌ని అంచనాలున్న నేప‌థ్యంలో లెబ‌నాన్‌లో ఉంటున్న త‌మ పౌరులు స్వ‌దేశానికి వ‌చ్చేయాల‌ని సౌదీఅరేబియా హెచ్చ‌రిక‌లు జారీ చేసింది.


ప్ర‌పంచ‌దేశాల భిన్నాభిప్రాయాలు


హ‌మాస్‌- ఇజ్రాయెల్ దాడి నేప‌థ్యంలో ప్ర‌పంచ దేశాలు రెండు వ‌ర్గాలుగా విడిపోతున్నాయి. ఇప్ప‌టికే అమెరికా అధ్య‌క్షుడు ఇజ్రాయెల్‌లో ప‌ర్య‌టించ‌గా.. తాజాగా బ్రిట‌న్ ప్ర‌ధాని రుషీ సునాక్ కూడా టెల్ అవీవ్ చేరుకున్నారు. ఏది ఏమైనా ఇజ్రాయెల్ పౌరుల‌కు మ‌ద్ద‌తుగా ఉంటామ‌ని మాట ఇస్తున్నా. చెప్ప‌లేని, వ‌ర్ణించ‌డానికి వీలులేని ఉగ్ర‌వాద భూతం వ‌ల్ల మీరు చాలా బాధ‌ప‌డ్డారు అని ఇజ్రాయెల్ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి సునాక్ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. మ‌రోవైపు చైనా, ర‌ష్యాలు ఇజ్రాయెల్‌కు ప్ర‌తికూల‌, పాల‌స్తీనా ప్ర‌జ‌ల‌కు అనుకూలంగా ప్ర‌క‌ట‌న‌లు ఇస్తున్నాయి.


ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల నేప‌థ్యంలో త‌మ స్నేహితుడు ఈజిప్ట్‌తో క‌లిసి ప‌నిచేస్తామ‌ని చైనా అధ్య‌క్షుడు షీ జిన్‌పింగ్ పేర్కొన్నారు. ర‌ష్యా సైతం గాజాలోని సామ‌న్యుల‌కు 27 ట‌న్నుల ఆహార‌ధాన్యాల‌ను మాన‌వతాసాయం కింద పంపించింది. ఈ స‌ర‌కును ర‌ఫా స‌రిహ‌ద్దు ద్వారా గాజాలోకి పంప‌నున్నారు. హ‌మాస్‌కు తొలి నుంచీ మ‌ద్ద‌తుగా ఉంటున్న ఇరాన్.. ఇజ్రాయెల్‌కు తాజాగా హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. గాజాలోని ఆసుప్ర‌తిపై దాడి అనంత‌రం ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ఈ ఘ‌ట‌న‌తో ఇజ్రాయెల్‌కు స‌మ‌యం ముగిసిన‌ట్టేన‌ని తీవ్రంగా వ్యాఖ్యానించింది.


ఇజ్రాయెల్ దాడుల్లో హ‌మాస్ కీల‌క నేత హ‌తం

ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో గురువారం హ‌మాస్‌ నాయ‌క‌త్వంలోని పాల‌స్తీనియ‌న్‌ నేష‌న‌ల్ సెక్యూరిటీ ఫోర్సెస్‌కు చెందిన కీల‌క నేత జెహాద్ ఎంహెయిసెన్ చ‌నిపోయారు. ఆయ‌న‌తోపాటు ప‌లువురు ఆయ‌న కుటుంబ స‌భ్యులు కూడా చ‌నిపోయార‌ని హ‌మాస్ అనుబంధ వార్తా సంస్థ జెరూస‌లెం న్యూస్‌నెట్‌వ‌ర్క్ తెలిపింది.


గాజాలోని షేక్ ర‌ద్వాన్ ప్రాంతంలోని ఆయ‌న ఇంటిపై ఇజ్రాయెల్ ద‌ళాలు బాంబులు కురిపించాయ‌ని పేర్కొన్న‌ది. హ‌మాస్‌, ఇజ్రాయెల్ ద‌ళాల మ‌ధ్య జ‌రుగుతున్న యుద్ధం 13వ రోజుకు చేరుకున్న‌ది. ఈ దాడుల్లో ఇప్ప‌టి వ‌ర‌కూ చ‌నిపోయిన వారి సంఖ్య 5వేల‌కు పెరిగింది.

Latest News