ఆఫ్ఘనిస్థాన్‌పై పాకిస్థాన్ వైమానిక దాడులు.. 13 మంది మృతి

ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దు ప్రాంతాలపై పాకిస్థాన్ వైమానిక దాడులు జరపడంతో 11 మంది చిన్నారులు సహా 13 మంది పౌరులు మృతి చెందారు. ఘటనపై తాలిబన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

పాకిస్తాన్ దేశం ఓ వైపు బలుచిస్తాన్ వేర్పాటువాదులతో పాటు ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లో కొనసాగుతున్న అంతర్గత సంఘర్షణలతో సతమతమవ్వడం చాలదన్నట్లుగా సరిహద్దు దేశాలతో యుద్దాలకు దిగుతుండటం ఆ దేశ ఉన్మాదానికి నిదర్శనంగా కనిపిస్తుంది. తాజాగా ఆఫ్ఘనిస్థాన్‌పై పాకిస్థాన్ వైమానిక దాడులతో బాంబుల వర్షం కురిపించింది. అర్ధరాత్రి వేళ.. అఫ్గాన్‌ సరిహద్దుల్లోని నివాస ప్రాంతాలపై పాక్‌ బాంబులతో విరుచుకుపడింది. బాధితులు నిద్రిస్తున్న సమయంలో ఈ దాడులు జరగడంతో..వారు తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది. ఈ దాడి ఘటనలో మొత్తం 11 మంది చిన్నారులతో సహా ఓ మహిళ, ఓ వృద్ధుడు నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారు.

పౌర ప్రాంతాలపై పాక్ సైన్యం బాంబుల దాడి కారణంగా 11 మంది పిల్లలతో సహా 13 మంది పౌరులు మృతి చెందారని, దాడుల్లో మరో 14 మందికి తీవ్ర గాయాలైనట్లు వెల్లడించిన తాలిబన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ వెల్లడించారు. ఖోస్ట్‌, కునార్‌, పక్తికా ప్రావిన్స్‌లలోని పౌర నివాసాలే లక్ష్యంగా ఈ దాడులు జరిగినట్లు ఆయన తెలిపారు. సెర్పా జిల్లాలోని ఓ ఇంటిపై జరిగిన దాడిలోనే 9 మంది చనిపోయారని, మరో 10 మంది గాయపడ్డారని ఖోస్ట్‌ ప్రావిన్స్‌కు చెందిన అధికారి తెలిపారు. పక్తికా ప్రావిన్స్‌లోని బర్మల్‌ జిల్లాలో జరిగిన మరో దాడిలో ముగ్గురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా చిన్నారులేనని స్థానికులు తెలిపారు.

కాగా పాకిస్తాన్ మాత్రం తమ దేశంలో దాడులు చేస్తున్న టీటీపీ(TTP) ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్నారంటూ ఆఫ్ఘనిస్తాన్ పై ఆరోపణలు చేసింది. అయితే తాలిబన్ ప్రభుత్వం మాత్రం పాక్ ఆరోపణలను కొట్టిపారేసింది. అఫ్గాన్‌ సరిహద్దుల్లోని ఖైబర్‌ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని ఓ సెక్యూరిటీ పోస్టుపై ఇటీవల దాడి జరిగింది. తాలిబన్‌ మిలిటెంట్లు ఈ దాడి చేసినట్లు పాక్‌ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు గాయపడ్డారని పాక్‌ అంతర్గత వ్యవహారాల శాఖ తెలిపింది. ఈ ఘటనకు ప్రతీకారంగానే అఫ్గాన్‌పై పాక్ వైమానిక దాడులు పాల్పడినట్లుగా భావిస్తున్నారు.

మరోవైపు… ఆఫ్ఘన్ సార్వభౌమత్వాన్ని దెబ్బతీస్తూ పాకిస్తాన్ చేసిన వైమానిక దాడులను, అమయాక పౌరులపై బాంబులను వేయడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది.

Latest News