అగ్రరాజ్యం అమెరికా (USA)లో అక్రమ వలసలపై డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సర్కారు కఠినంగా వ్యవహరిస్తోంది. యూఎస్‌లో అక్రమంగా నివసిస్తున్న విదేశీయులను గుర్తించి వారిని వారి దేశాలకు వెళ్లగొడుతోంది. వలసల పట్ల ట్రంప్ సర్కార్ వ్యవహరిస్తున్న తీరుపై ప్రపంచ వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో వలస దారుల వేటలో ఓ అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. ఐదేళ్ల బాలుడిని ఇమ్రిగ్రేషన్ అధికారులు (ICE officers) అదుపులోకి తీసుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
మిన్నెసోటా (Minnesota)లోని కొలంబియా హైట్స్ సబర్బ్‌లో ప్రీ-స్కూల్ ముగించుకుని ఇంటికి వెళుతున్న ఐదేళ్ల బాలుడు లియామ్ కోనెజో రామోస్‌ను ఫెడరల్ ఏజెంట్లు అదుపులోకి తీసుకున్నారు. చిన్న పిల్లాడిని పట్టుకోవడమే కాకుండా అతని తండ్రిని బయటకు రప్పించేందుకు ఆ పసివాడిని ఎరగా వాడుకున్నారని పాఠశాల అధికారులు, కుటుంబ న్యాయవాది సంచలన ఆరోపణలు చేశారు. చిన్నారిని, అతని తండ్రిని అదుపులోకి తీసుకున్న అధికారులు వారిని టెక్సాస్‌లోని ఓ నిర్బంధ కేంద్రానికి తరలించినట్లు వారు పేర్కొన్నారు.
చిన్నారిని ఎరగా వాడుకున్నారు..
స్థానిక కాలమానం ప్రకారం.. మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. ‘ఇంటి ముందు కారులో ఉన్న లియామ్, అతని తండ్రిని ఏజెంట్లు చుట్టుముట్టారు. లోపల ఎవరైనా ఉన్నారో లేదో చూడటానికి ఆ పసివాడిని ఇంటి తలుపు తట్టమని అధికారులు చెప్పారు. అంటే ఒక ఐదేళ్ల బాబును ‘ఐస్’ (ICE) అధికారులు ఎరగా వాడుకున్నారు’ అని కొలంబియా హైట్స్ పబ్లిక్ స్కూల్స్ సూపర్ టెండెంట్ జెనా స్టెన్విక్ మీడియాకు వివరించారు.
పలు నివేదికల ప్రకారం.. 2024లో చిన్నారి కుటుంబం అమెరికాకు వలస వచ్చింది. అమెరికాలో ఆశ్రయం పొందేందుకు చిన్నారి కుటుంబం దరఖాస్తు చేసుకుంది. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది. మరోవైపు బహిష్కరణకు సంబంధించిన వీరికి ఇప్పటి వరకూ ఎలాంటి ఆదేశాలు కూడా అందలేదు. ఇంతలోనే ఐస్ అధికారులు ఇలా బాలుడిని ఎరగా వేసి తండ్రిని నిర్బంధించడం స్థానికంగా కలకలం రేపుతోంది.
కమలా హారిస్ ఆగ్రహం..
చిన్నారి పట్ల అమెరికా అధికారులు ప్రవర్తించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. తాజా ఘటనపై అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరును ఖండించారు. ‘లియామ్ రామోస్ ఇంకా పసివాడు. అతడిని ఐస్ ఏజెంట్లు ఎరగా వాడటం దారుణం. ఇది నన్ను తీవ్ర ఆవేదనకు గురిచేసింది’ అని ఆమె అన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. మరోవైపు ఈ ఆపరేషన్‌ను ప్రస్తుత ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సమర్థించారు. అధికారులు చిన్నారి తండ్రిని మాత్రమే లక్ష్యంగా చేసుకున్నారని చెప్పారు. చట్టాన్ని అమలు చేస్తున్న అధికారులకు తాము అండగా ఉంటామని ఈ సందర్భంగా వాన్స్ స్పష్టం చేశారు.
చిన్నారిని లక్ష్యంగా చేసుకోలేదు..
ఇక విమర్శలపై హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ ప్రతినిధి ట్రిసియా మెక్‌లాఫ్లిన్ స్పందించారు. చిన్నారి తండ్రి ఈక్వెడార్ జాతీయుడని తెలిపారు. అతను యూఎస్‌లో చట్టవిరుద్ధంగా ఉంటున్నట్లు చెప్పారు. అతడిని పట్టుకునేందుకు ఐస్ ఏజెంట్లు ఆపరేషన్ నిర్వహించినట్లు చెప్పారు. పిల్లాడిని లక్ష్యంగా చేసుకోలేదని వివరణ ఇచ్చారు. పట్టుకునే క్రమంలో బాలుడిని వదిలేసి అతని తండ్రి పారిపోవడానికి ప్రయత్నించినట్లు చెప్పారు. అందుకే చిన్నారి భద్రత కోసమే ఒక అధికారి అతని వద్ద ఉండిపోయినట్లు వివరించారు.
ఇవి కూడా చదవండి :
Delhi Rains | ఢిల్లీలో వర్షం.. కశ్మీర్‌లో మంచు.. ఉత్తరాదిలో అకస్మాత్తిగా మారిన వాతావరణం
