- అమెరికాలో కోటి ప్యాకేజీ.. ఇండియాలో పాతిక లక్షలకు దిగదుడుపే!
- అక్కడి భారతీయుడు చెప్పిన చిట్టాపద్దుల లెక్క
- చదువుల కోసమో, కెరీర్ కోసమో అమెరికా పంపొద్దంటున్న అన్షుల్ సోదరి
అమెరికా కలల రాజ్యం. నాలుగు రాళ్లు సంపాదించుకోవడానికి భారతదేశంలో హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలు ఎలానో… ప్రపంచ దేశాల ప్రజలకు అమెరికా అలా! అక్కడికెళితే ఏదో విధంగా బతికేయొచ్చన్న ఆశ. తమ జీవితాల్లో కొత్త మెరుపు వస్తుందనే ధీమా! కానీ.. మెరుపు మెరిసిన కాసేపటికే పిడుగూ పడుతుంది. ఆ పిడుగు అన్ని చోట్లా పడకపోవచ్చు! కానీ.. పడిన చోట ఆశల సౌధాన్ని నిట్టనిలువునా కాల్చేస్తుంది. ఆ పిడుగు అందమైన జీవితాన్ని సమాధి చేస్తుంది.. అది కన్నవారి కలలను ఛిద్రం చేసే పిడుగు. ఆ పిడుగు పడిన వేళ.. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊరిలో తల్లి పేగు కీడును శంకిస్తుంది.
ఇప్పుడు అన్షుల్ కుంచా కుటుంబంపై పడిన పిడుగు అలాంటిదే. ఆర్డర్ చేసిన పిజాను డెలివర్ చేయడానికి వెళ్లి అన్షుల్ తలలో బుల్లెట్లు దింపారు కర్కశులు. ‘చలనం లేకుండా పడి ఉన్నాడు.. బుల్లెట్ గాయాల తీవ్రతతో తల నుంచి తీవ్ర రక్తస్రావమైంది’ అని ఫిలడెల్ఫియా పీఏ చీఫ్ ఇన్స్‌పెక్టర్ స్కాట్ స్మాల్ పెద్ద పిడుగు పడేశారు. నిజానికి ఈ పిడుగు ఇదే కొత్త కాదు. పోలే చంద్రశేఖర్… ఎన్ దేవాశిష్.. జాహ్నవి కందుల.. వరుణ్ తేజ్ పుచ్చా.. జెట్టి హారిక, నూకారపు సాయితేజ.. ఆర్యన్ రెడ్డి.. రాజ్యలక్ష్మి యార్లగడ్డ. వీరే కాదు.. మరో వందకుపైగా కుటుంబాలు ఈ ఐదేళ్లలో కడుపుకోత అనుభవించాయి. ఇక రోడ్డు ప్రమాదాలు, వ్యాహాళికి వెళ్లిన సమయంలో అనుకోకుండా చోటు చేసుకున్న దుర్ఘటనలు ఈ సంఖ్యను పెంచుతాయి. దీపావళి తుపాకుల్లా గన్స్ పట్టుకొన్న రాక్షసులు.. అక్కడ పట్టపగలే యథేచ్ఛగా సంచరిస్తూ ఉంటారు. కోపం వస్తేనో.. మైండ్ దొబ్బితేనో.. మోహించిన అమ్మాయి కాదంటేనో.. చేతిలోకి లోడెడ్ గన్! కట్ చేస్తే.. ఏ స్కూల్లోనో, ఏ రద్దీ మార్కెట్‌లోనో పటాకుల్లా పేలిపోయే బుల్లెట్లు. అందులో దేశీ ఎవడో.. విదేశీ ఎవడో! పాపుడెవడో.. పుణ్యుడెవడో! ఎవరో చేసే నేరం.. శిక్ష పడేది మాత్రం కన్నవారికే!
ఇప్పుడా కుటుంబం అన్షుల్ ఆఖరి చూపుకోసం పరితపిస్తున్నది. తన సోదరుడి మరణానికి న్యాయం చేయాలని అన్షుల్ సోదరి భారత ప్రభుత్వాన్ని కోరుతున్నది. అంతేకాదు.. తల్లిదండ్రులు వారి పిల్లలను చదువుల కోసమో, కెరీర్ కోసమో అమెరికాకు పంపవద్దని వేడుకుంటున్నది.
ఇంత చేసీ అమెరికాలో సంపాదించే డాలర్ల విలువెంత? ఆకాశాన్నంటే హర్మ్యాల నడుమ కనీస జీవితానికి ఖర్చెంత? సంపాదించేదెంత? దానిలో కట్టే పన్నులెంత? ఇంటి అద్దె ఎంత? కాలికొచ్చినా.. కంటికొచ్చినా.. వైద్యం ఖర్చెంత? తిండికెంత? చివరకు మిగిలేదెంత? పంచపాండవులు మొదలు.. మంచం కోళ్లలా నాలుగా? చూపిద్దామనుకున్న మూడు వేళ్లా.. వేయబోయిన రెండా? వేయాలనుకున్న ఒకటా? వేసిన సున్నానా..
యాదృచ్ఛికమో మరొకటో గానీ.. అమెరికాలో సంపాదించే కోటి రూపాయల లెక్క వెనుక అసలుకథ చెప్పాడో అమెరికాలో నివసిస్తున్న భారతీయడు. కలల రాజ్యంలో కనిపించని దోపిడీని కండ్లకు కట్టాడు. అతడి పేరు యశ్ శర్మ! అతడు ఉండేది న్యూయార్క్ సిటీలో! ఏటా సంపాదించేది భారతీయ కరెన్సీ ప్రకారం అక్షరాలా కోటి! చెల్లించాల్సిన పన్నులు.. అద్దె.. ఆరోగ్యం… జీవన వ్యయం.. ఇవన్నీ పూసగుచ్చాడు. వచ్చే మొత్తంలో పన్నులు కడితే చేతిలో మిగిలేది పరిగలేనన్నాడు. కచ్చితంగా చెప్పాలంటే.. భారతదేశంలో ఇరవై నుంచి 30 లక్షల వార్షిక ప్యాకేజీ కలిగిన వ్యక్తి అమెరికాలో కోటి సంపాదించేవాడికంటే ఎంతో సంతోషకరమైన జీవితం గడపొచ్చని లెక్కగట్టాడు.
‘అసలు నిజం వేరే ఉంది. ఎందుకంటే.. ఇక్కడ ఫెడరల్ ట్యాక్స్, స్టేట్ ట్యాక్స్, న్యూయార్క్ సిటీ ట్యాక్స్, సోషల్ సెక్యూరిటీ, మెడికేర్ అన్నీ కలుపుకొంటే.. మీ కోటి రూపాయల వార్షిక పే లో 35 శాతం నుంచి 40 శాతం కేవలం ట్యాక్స్ రూపంలో ఆవిరి అయిపోతాయి’ అని తన సోషల్ మీడియా అకౌంట్‌లో పెట్టిన వీడియోలో చెప్పాడు. అంతేకాదు.. వీటికి ఒక్కో పద్దున విడదీసి వివరించాడు. న్యూయార్క్ సిటీలో ఎవరైనా సరై అద్దెకు ఉండాల్సిందే. ఆ అద్దె కూడా మామూలుగా ఉండదట. నెలకు రెండు నుంచి మూడు లక్షలు అద్దెకే పోయాల్సి వస్తుందని చెప్పాడు. ‘సో ఐ థింక్.. ఇండియాలో 20 నుంచి 25 లక్షల ప్యాకేజీ ఉన్న వాడు న్యూయార్క్‌లో కోటి రూపాయల ప్యాకేజీ ఉన్నవాడికంటే చాలా సంతోషంగా జీవించగలడు’ అంటూ ముగించాడు. ఈ వీడియోకు “The Dark Side of a Rs 1 Crore package in New York (USA),” అని క్యాప్షన్ పెట్టాడు. దీనికి సామాజిక మాధ్యమాల్లో విశేష స్పందన లభించింది. 494,000 వ్యూస్ దాటిపోగా.. 22,500 మంది లైక్ కొట్టారు.
