-
కుదించుకుపోయిన చెరువులు.. కబ్జాకు గురైన నాలాలు
-
వరద నీటికి దారి లేని వైనం.. వస్తే వరద.. లేదంటే కరువు
nature’s anger । వర్షాకాలం సీజన్ (Rainy season) జూన్ నుంచి మొదలవుతుంది. రైతులు జూన్‌లో ఏపాటి వర్షం వచ్చినా దుక్కి దున్ని విత్తనం నాటుతాడు. మనది ప్రధానంగా వ్యవసాయ దేశం (agricultural country) . పంటలపైనే మన జీవనం కొనసాగుతున్నది. ఎంత పట్టణీకరణ (urbanization) జరిగినా వ్యవసాయం ప్రధాన ఆధారంగానే ఉన్నది. అందుకే తెలంగాణ, ఏపీలతో సహా యావత్ దేశం అంతా రుతుపవనాల (monsoons) వైపే చూస్తుంది. జూన్‌లో వర్షాకాల సీజన్ ప్రారంభం కాగానే యావత్ రైతాంగం చినుకు కోసం ఆకాశం వైపు చూస్తుంది. అయితే వాతావరణంలో జరిగిన మార్పుల (changes in the climate) కారణం కావచ్చు… ఈ మార్పులకు మనుషులే కారణమన్న చర్చ బలంగా ఉంది. ఫలితంగా సకాలంలో వర్షాలు కురువడం లేదన్నది జగమెరిగిన సత్యం. అందు వల్లనే కావచ్చు రైతులు సీజన్‌లో ఏపాటి వర్షం వచ్చినా విత్తనం విత్తుతాడు. కానీ ఆతరువాత వర్షం చుక్క కురువక వేసిన విత్తనం మొలిచి (germinates) ఎండిపోయి రైతు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితిని మనం చూస్తూనే ఉన్నాం. అలాగే ఈ ఏడాది తొలకరిలో వర్షాలు సరిగ్గా కరువలేదు. దీంతో కరువు ఛాయలు (drought) కనిపిస్తున్నాయన్న చర్చ జరిగింది. మొదట్లో చాలా మంది రైతులు వేసిన విత్తనం మొలక దశలోనే ఎండిపోయింది. అలా చాలా మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు కూడా. అయితే వాతావరణ శాఖ అధికారులతో (meteorological department) మాట్లాడితే సీజన్ ఇంకా చాలా ఉంది.. ముందు ముందు భారీ వర్షాలు (heavy rains) కురిసే అవకాశం ఉందన్నారు. వాతావరణ శాఖ అధికారులు చెప్పినట్లుగానే ఆగస్ట్ మధ్యలో వర్షాలు మొదలయ్యాయి. అతి కొద్ది రోజుల్లోనే శ్రీశైలం (Srisailam), నాగార్జున సాగర్ (Nagarjuna Sagar) డ్యామ్ లు నిండాయి. దీంతో రైతులు వ్యవసాయ పనులు మొదలుపెట్టారు. అంతా బాగానే ఉంది కానీ సెప్టెంబర్ నెల మొదటి రోజునే వరుణుడు తన ప్రకోపాన్ని చూపించాడు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు అతలా కుతలం అయ్యాయి.
భారీ వర్షాలకు ఖమ్మం (Khammam), విజయవాడ (Vijayawada) నగరాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మహబూబాబాద్, సూర్యాపేట, భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలు వరద దాటికి విలవిల లాడాయి. గత ఏడాది వరంగల్ నగరం పూర్తిగా నీటిలో మునిగింది. జయశంకర్ భూపాల్ పల్లి జిల్లాలో ఒక ఊరు మొత్తం కొట్టుకుపోయిన విషయం మనందరికి తెలిసిందే. హైదరాబాద్ (Hyderabad) నగరంలో చిన్న చినుకు పడితే చాలు రహదారులన్నీ వరద కాలువలను తలపిస్తాయి. సెల్లార్‌లలోకి నీళ్లు వస్తాయి. ఇలా నగరాలు వరద తాకిడికి విల విల లాడుతున్నాయి. పాలకులు ఇది ప్రకృతి వైఫరీత్యంగా కొట్టి పారేస్తున్నారు కానీ వస్తవంగా మానవ తప్పిదమేనని పర్యావరణ ప్రేమికులు (environmentalists) అంటున్నారు.
ఖమ్మం పట్టణం జలదిగ్భదానికి గురి కావడానికి ప్రధానంగా మున్నేరు వాగు ఉగ్ర రూపం దాల్చడంతో పాటు ఖమ్మం పట్టణంలోనే ఉన్న లకారం చెరువు (Lakaram pond) కబ్జాకు గురి కావడమేనన్న చర్చ జరుగుతోంది. ఖమ్మం పట్టణంలో ఉన్న లకారం చెరువు 300 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉండేదని, దీనిని కబ్జా చేయడంతో ప్రస్తుతం కేవలం 40 ఎకరాలకే పరిమితం అయిందని స్థానికులు చెపుతున్నారు. 40 ఎకరాలకు చుట్టూ నీళ్లు చెరువులోకి వెళ్లడానికి, చెరువు నుంచి బయటకు పోవడానికి దారి లేని పరిస్థితి ఉందని ఖమ్మం నివాసి భాస్కర్ చెప్పారు. దీంతో ఖమ్మంపైన ఉన్న రెండు చెరువులు తెగి వచ్చిన వరద నీరు లకారం చెరువులోకి వచ్చే అవకాశం లేక ఖమ్మం పట్టణంలోకి వచ్చిందని, దీంతో ఖమ్మం తీవ్ర స్థాయిలో వరద ముంపుకు గురి కావడానికి కారణమైందన్న చర్చ కూడా జరుగుతోంది.
విజయవాడ నగరాన్ని బుడమేరు (Budameru) వాగు పుట్టి ముంచింది. ఖమ్మం జిల్లా నుంచి విజయవాడ నగరం మీదుగా కృష్ణా నదిలో (Krishna river) కలిసే బుడమేరు వాగు విజయవాడ లో కబ్జాకు గురై కుచించుకు పోయింది. బుడమేరు వాగులోనే అనేక ఇండ్లు వెలిశాయన్నఆరోపణలు ఉంటాయి. బుడమేరు వాగు కబ్జాలకు గురి కాకుండా విజయవాడ నగరం (Vijayawada city) ఇంత స్థాయిలో వరద ముంపుకు గురయ్యేది కాదన్న చర్చ జరుగుతోంది. బుడమేరు వాగు కబ్జాకు గురి కావడంతో వచ్చిన వరదతో అజిత్ సింగ్ నగర్, వైఎస్ ఆర్ కాలనీ, జక్కంపూడి కాలనీ, అంబాపురం ముంపునకు గురయ్యాయని స్థానికులు అంటున్నారు.
హైదరాబాద్‌లో సహజసిద్ధంగా ఏర్పాటైన చెరువులు చాలా వరకూ కబ్జాలకు గురయ్యాయి. చెరువు ఎఫ్‌టీఎల్ (FTL) పరిధిలోనే భారీ నిర్మాణాలు వచ్చాయి. జీహెచ్ఎంసీ (GHMC) పరిధిలో 185 చెరువులు ఉండగా పూర్తిస్థాయి ఎఫ్ టీఎల్ కేవలం 28 చెరువులకు మాత్రమే ఉన్నదని, మిగతావన్నీ కబ్జాకు గురై కుచించుకుపోయాయని అధికారులు గుర్తించారు. హైటెక్ సిటీ (hi-tech city) మధ్యలో ఉన్న దుర్గం చెరువును పరిశీలిస్తే ఏ విధంగా చెరువులు కబ్జా అయ్యాయో ఇట్టే అర్థమవుతుంది. ఇలా చెరువులు, వరద నీరు ప్రవహించే నాలాలు కబ్జాకు గురి కావడంతో ఏమాత్రం వర్షం వచ్చినా వరద నీరు అంతా ఇళ్లలోకి చేరుతోంది. ఇలా వర్షాలు వచ్చినప్పుడు వరదనీటితో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
ఇలా ప్రకృతి ఆగ్రహానికి (nature’s anger) మానవుడే కారణం అవుతున్నాడని పర్యావరణ వేత్తలు అంటున్నారు. అడవులు తగ్గిపోవడంతో వాతావరణంలో మార్పులు వచ్చి వర్షాలు తగ్గాయి. సరైన సమాయానికి వర్షాలు కురువడం లేదు. మరో వైపు పడిన వర్షం పడినట్లుగా భూమిలోకి నీరు ఇంకకుండా వాగుల ద్వారా నదుల్లోకి వెళ్లి సముద్రం పాలవుతున్నది. దీనికి ప్రధాన కారణం అడవులు లేకపోవడమేనని పర్యావరణ వేత్తలు అంటున్నారు. మరోవైపు నగరాలు కాంక్రీట్ జంగిల్‌గా మారిపోతున్నాయి. అడవులను మనమే నరికి పర్యావరణ విధ్వంసానికి కారణమవుతున్నామని అంటున్నారు. దీనికి తోడు పట్టణ ప్రాంతాల్లో చెరువులు, నాలాలు, వాగులు కబ్జాలు చేయడంతో వాన నీరు పోయే దారి లేక ముంపుకు గురవుతున్నాయని అంటున్నారు. పాలకులు ఇప్పటికైనా మేలు కొని కబ్జాలను తొలగించాలని, అడవులు పెంచాలని అంటున్నారు. ఇవి నినాదాలకు కాకుండా పాలకులు చిత్తశుద్దితో చేస్తేనే మనుగడ ఉంటుందని పర్యావరణ వేత్తలు చెపుతున్నారు.
read also
హైదరాబాద్ ఇక నివాస యోగ్యం కాదా? పట్టని పాలకులు.. అడ్డగోలుగా అనుమతులు
జాతీయ విపత్తుగా ప్రకటించండి.. ప్రధాని మోదీకి సీఎం రేవంత్‌రెడ్డి వినతి