విధాత: ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలు (Fee reimbursement dues) చెల్లించాలంటూ ప్రైవేటు కాలేజీలు సోమవారం నుంచి బంద్ పాటిస్తుండగా..ఇప్పుడు వారి బాటలోనే ఆరోగ్య శ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు(Telangana Aarogyasri hospitals strike)కూడా చేరాయి. బుధవారం నుంచి ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేయాలని నిర్ణయించిన ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు నిర్ణయించాయి. పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో…ఆరోగ్య శ్రీ సేవల నిలిపివేత నిర్ణయం తీసుకున్నామని ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యం ప్రకటించింది.
గత 12నెలలుగా రూ.1400 కోట్ల బకాయిలు ఉన్నాయని చెబుతున్న హాస్పిటల్స్ యాజమాన్యాలు వెల్లడించాయి. మంగళవారం అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. గత 20 రోజులుగా ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో ఆరోగ్యశ్రీ సేవలను నిలిపితకు నిర్ణయించామని తెలిపాయి. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా 330 ఆసుపత్రులలో ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోనున్నాయి. ప్రైవేటు ఆసుపత్రుల నిర్ణయంతో ఆరోగ్య శ్రీ వైద్య సేవలపై ఆధారపడిన పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో పడే పరిస్థితి నెలకొంది.
ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న రూ.8వేల కోట్లకు పైగా ఫీజు రీయింబర్స్‌మెంట్ బిల్లులు ఇవ్వనందుకు ప్రైవేట్ కాలేజీలు బంద్ పాటిస్తున్నాయి. కాలేజీల బంద్ కారణంగా తెలంగాణ వ్యాప్తంగా 13 లక్షల విద్యార్థుల భవిష్యత్తు గందరగోళంలో పడింది. ఈ సమస్య పరిష్కారానికి సీఎం రేవంత్ రెడ్డితో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి డి.శ్రీధర్ బాబులు చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిల కోసం ప్రైవేటు కళాశాలల బంద్ తో ఇబ్బందిపడుతున్న తెలంగాణ ప్రభుత్వానికి..ఆరోగ్యశ్రీ పెండింగ్ బకాయిల కోసం ప్రైవేటు ఆసుపత్రుల ఆరోగ్య శ్రీ సేవల నిలిపివేత నిర్ణయం మరింత సమస్యాత్మకంగా తయారైంది.