విధాత: తెలంగాణ(Telangana)లో శనివారం ఉదయం జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల(Road Accidents)లో నలుగురు దుర్మరణం(Four People Died) చెందగా…మరో ఇద్దరు తీవ్ర గాయాలతో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. హైదరాబాద్ -విజయవాడపై చౌటుప్పల్( Choutuppal) మండలం ఖైతాపురం వద్ధ వేగంగా వెలుతున్న లారీ ఏపీకి చెందిన పోలీస్ కారును ఢీ కొట్టింది. దీంతో కారులో ఉన్న డీఎస్పీ చక్రధరరావు, శాంతారావు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. అడిషనల్ ఎస్పీ ప్రసాద్ కు తీవ్రగాయాలు అయ్యాయి. అలాగే కారుడ్రైవర్ నర్సింగరావు పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఏపీకి చెందిన పోలీస్ అధికారులు విజయవాడ నుండి హైదరాబాద్ వస్తుండగా మార్గమధ్యంలో ఈ..ప్రమాదం చోటుచేసుకుంది. కేసునమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇక రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్(Shadnagar) చౌరస్తాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ట్యాంకర్ లారీ ఢీకొట్టడంతో ద్విచక్రవాహనంపై వెళ్తున్న తండ్రి, కుమార్తె మృతి చెందారు. సీఐ విజయ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. షాద్‌నగర్‌కు చెందిన మచ్చేందర్.. శంషాబాద్ వర్ధమాన్ కళాశాలలో బీటెక్ చదువుతున్న తన కుమార్తె మైత్రిని కాలేజీకి పంపించేందుకు బైక్‌పై బస్టాప్‌కు బయలుదేరారు. షాద్‌నగర్ చౌరస్తా వద్దకు రాగానే వీరి ద్విచక్రవాహనాన్ని ట్యాంకర్ లారీ ఢీకొట్టింది. మచ్చేందర్ ఘటనాస్థలిలోనే మృతి చెందగా, మైత్రికి తీవ్రగాయాలై లారీ టైర్ల మధ్యలో ఇరుక్కు పోయింది. కాపాడండి అంటూ మైత్రి చేసిన ఆర్తనాదాలు స్థానికులను కంటతడి పెట్టించాయి.
ప్రమాదం జరిగిన వెంటనే అతి కష్టమ్మీద తన మొబైల్‌ను సమీపంలో ఉన్న ఓ వ్యక్తికి ఇచ్చి కుటుంబ సభ్యులకు ఫోన్ చేయాలని మైత్రి ప్రాథేయపడటం అక్కడి వారిని కన్నీరు పెట్టించింది. అదే సమయంలో స్నేహితురాలి నుంచి మైత్రికి ఫోన్లు రావడంతో.. స్థానికులు ప్రమాదం విషయం చెప్పి ఆమె బంధువులకు సమాచారం అందేలా చేశారు. కాసేపటికి మైత్రి కూడా కన్నుమూసిందని సీఐ తెలిపారు. లారీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.