టెక్స్ టైల్ రాజధానిగా తెలంగాణ : సీఎం రేవంత్ రెడ్డి

టెక్స్‌టైల్ రంగంలో తెలంగాణను దక్షిణాసియాలో అగ్రస్థానంలో నిలపాలని సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా ప్రకటించారు పెట్టుబడిదారులకు పిలుపునిచ్చారు.

revanth reddy

విధాత, హైదరాబాద్ : వస్త్ర పరిశ్రమ రంగంలో 2047 నాటికి తెలంగాణను దక్షిణాసియాలోనే గొప్ప టెక్స్‌టైల్ రాజధానిగా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. టెక్స్‌టైల్ రంగ అభివృద్ధి కోసం ప్రభుత్వం నిర్దేశించుకున్న విజన్‌కు అనుగుణంగా ప్రపంచాన్ని మార్చగల వాతావరణాన్ని సృష్టించడంలో మాతో భాగస్వామ్యం కావాలని పారిశ్రామిక వేత్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ టెక్స్‌టైల్ ఇండస్ట్రీ (CITI) తో కలిసి నిర్వహించిన 13వ ఏషియా టెక్స్‌టైల్ సదస్సు (ATEXCON 2026) సదస్సును సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించి అటెక్స్‌కాన్-2026 నివేదికను విడుదల చేశారు. ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలోని ప్రతి దేశం తెలంగాణలో తయారైన దుస్తులను ధరించేలా చేయాలన్నది మా సంకల్పం అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు తెలంగాణ ఒక రాష్ట్రం మాత్రమే కాదు అని, అందరం కలిసి సరికొత్త విజయవంతమైన భవిష్యత్తును నిర్మిద్దాం అని, తెలంగాణ రైజింగ్ ప్రయాణంలో భాగస్వాములు కావాలి అని పెట్టుబడుదారులకు పిలుపునిచ్చారు.

గ్రీన్ టెక్స్‌టైల్ హబ్‌లను అభివృద్ధి

పర్యావరణ పరిరక్షణ మాకు అత్యున్నత ప్రాధాన్యం అని, రాష్ట్రంలో గ్రీన్ టెక్స్‌టైల్ హబ్‌లను అభివృద్ధి చేస్తాం అని రేవంత్ రెడ్డి పేర్కన్నారు. యువతకు ముఖ్యంగా మహిళలకు శిక్షణనిస్తాం అని, సంప్రదాయ ఆలోచనలతో పాటు ఆధునిక పరికరాలతో కలిపి డిజైన్, కట్టింగ్, స్టిచింగ్‌లో ఉపయోగించగలిగే నైపుణ్యం అభివృద్ది చేస్తామన్నారు. అత్యుత్తమ వస్త్రాలను తయారు చేసిన గొప్ప చరిత్ర భారతదేశానికి ఉంది. శతాబ్దాలుగా క‌ళలు, సంస్కృతి, సంప్రదాయాలు టెక్స్‌టైల్స్‌ రంగాన్ని పరిపూర్ణంగా తీర్చిదిద్దాయని గుర్తు చేశారు.

మా డీఎన్ఏలోనే టెక్స్ టైల్స్

నిజాం కాలంలో ప్రపంచ నలుమూలల నుంచి వ్యాపారులు హైదరాబాద్ నగరానికి వచ్చి వస్త్రాలు, ముత్యాలు కొనుగోలు చేసిన చరిత్ర ఉందని, తెలంగాణ రాష్ట్రం ఈ విషయాన్ని గర్వంగా చెప్పగలదని, టెక్స్‌టైల్స్ మా డీఎన్ఏలో ఉందని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.

వస్త్ర పరిశ్రమలో తెలంగాణ ముందంజలో ఉండటానికి చారిత్రక కారణాలున్నాయి. దేశంలో పత్తి ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్నాం. పత్తి నాణ్యతకు ప్రపంచవ్యాప్తంగా పేరుంది. టెక్స్ టైల్ తెలంగాణకు కేవలం పరిశ్రమ మాత్రమే కాదు. ప్రజల జీవనాధారం. ప్రసిద్ధి చెందిన పోచంపల్లి ఇక్కత్, గద్వాల చీరలు, వరంగల్ దుర్రీస్, నారాయణపేట చేనేత వరకు అనేకం ఇక్కడున్నాయన్నారు.

తెలంగాణలో నైపుణ్యం ఉంది. మంచి సంకల్పం కూడా ఉంది. డీప్‌టెక్, ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, డిఫెన్స్ మాన్యుఫాక్చరింగ్, ఎనర్జీ వంటి అనేక రంగాల్లో తెలంగాణ ముందంజలో ఉంది. వరంగల్‌లో కాకతీయ ప్ర‌పంచ స్థాయి మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌ను ఏర్పాటు చేశాం. అందులో అనేక అప్పరెల్‌ పార్కులున్నాయని తెలిపారు.

తెలంగాణ రైజింగ్ మా విజన్

మా విజన్ తెలంగాణ రైజింగ్ 2034 నాటికి ఒక ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలన్నది మా లక్ష్యం అని రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. వస్త్ర పరిశ్రమకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం భూమి, విద్యుత్, నీరు వంటి మౌలిక సదుపాయాలను కల్పిస్తూ ప్రోత్సహిస్తుంది. అవసరమైన అనుమతులను వేగంగా మంజూరు చేస్తుంది. ప్రపంచ పోటీకి అనుగుణంగా విధానాలు అనుసరిస్తున్నాం. అత్యుత్తమ మానవ వనరుల బలం ఉంది.

తెలంగాణ పత్తి పొలాల నుండి లండన్, న్యూయార్క్, పారిస్, మిలాన్, టోక్యో, దుబాయ్ ఫ్యాషన్ షోల వరకు అనేక అంశాల్లో మేం క‌లిసి ప‌నిచేస్తున్నాం. మీకు విజన్ ఉంటే, మేము మీకు సరైన భాగస్వాములం అవుతాం. అందరం కలిసి, ప్రపంచాన్ని మార్చగల పూర్తి టెక్స్‌టైల్ ఎకోసిస్టమ్‌ను నిర్మిద్దాం అన్నారు.

హైదరాబాద్ భారతదేశానికి కాకుండా, ప్రపంచానికి సినిమా నిర్మాణ కేంద్రంగా ఎదుగుతోందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు ఇటీవల నెట్ ఫ్లిక్స్(Netflix) ఐలైన్ స్టూడియోలను ఇక్కడ ప్రారంభించామని తెలిపారు. టాలీవుడ్, బాలీవుడ్ ఇప్పటికే హైదరాబాద్‌ను తమ కేంద్రంగా ఉపయోగిస్తున్నాయి అని, ఇప్పుడు హాలీవుడ్ కూడా చేరిందన్నారు. సినిమా రంగం తమ ఫ్యాషన్‌ను కూడా తెలంగాణ నుంచే అభివృద్ధి చెందేలా ప్రోత్సహిస్తాం అని తెలిపారు.

ఇవి కూడా చదవండి :

బయటపడ్డ ఆప్‌ అంతర్గత పోరు.. రాఘవ్‌ ఛద్దాను అందుకే దూరం పెట్టారా?
ప్రజా సమస్యలను లేవనెత్తడం నేరమా? : ఎంపీ రాఘవ్ చద్దా

Latest News