cyber criminals । కేడీ జసిల్.. కిలాడీ ప్రీతి.. వరంగల్ పోలీసులకు పట్టుబడిన సైబర్ నేరాల జంట!
తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు అందిస్తామని మోసానికి పాల్పడుతూ అన్‌లైన్‌లో దేశవ్యాప్తంగా ప్రజల నుండి కోట్ల రూపాయలను కొల్లగొట్టిన తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఒక మహిళతో సహా ఇద్దరు సైబర్ నేరగాళ్ళను సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో పని చేస్తూన్న వరంగల్ పోలీస్ కమిషనరేట్ సైబర్ విభాగం పోలీసులు సొమవారం అరెస్టు చేసారు.
- దేశవ్యాప్తంగా కోట్లల్లో డబ్బు వసూళ్లు.. డ్రా చేసుకుని జల్సాలు
- తమిళనాడులో అరెస్టు చేసిన హన్మకొండ పోలీసులు
- వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా వెల్లడి
cyber criminals । విధాత, వరంగల్ ప్రతినిధి: తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు అందిస్తామని మోసానికి పాల్పడుతూ అన్‌లైన్‌లో దేశవ్యాప్తంగా ప్రజల నుండి కోట్ల రూపాయలను కొల్లగొట్టిన తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఒక మహిళతో సహా ఇద్దరు సైబర్ నేరగాళ్ళను (cyber criminals) సైబర్ సెక్యూరిటీ బ్యూరో (Cyber Security Bureau) ఆధ్వర్యంలో పని చేస్తూన్న వరంగల్ పోలీస్ కమిషనరేట్ సైబర్ విభాగం పోలీసులు సొమవారం అరెస్టు చేసారు. వీరి నుండి పోలీసులు చెక్కు బుక్కులు, క్రెడిట్, డెబిట్ కార్డులు, పెన్ డ్రైవ్‌లను, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
ఈ అరెస్టుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా (Amber Kishore Jha) వివరాలను వెల్లడించారు. తమిళనాడు రాష్ట్రం తాంబరం (Tambaram) పట్టణానికి చెందిన జసిల్ (38), ప్రీతి (32) సైబర్ నేరస్తులు. పెట్టిన పెట్టుబడికి ఎక్కువ డబ్బులు తిరిగి వస్తాయని తప్పుడు ప్రచారంతో కొద్దికాలంగా గోల్డ్‌మ్యాన్ సచ్, యాం బ్రాండింగ్స్ అనే తప్పుడు వెబ్‌సైట్లలో (bogus websites) ప్రజలతో భారీ మొత్తంలో డబ్బు పెట్టుబడి (lured people to invest) పెట్టించారు. ఇలాంటి పెట్టుబడుల కోసం నిందితులు రెండు ప్రైవేటు బ్యాంకుల్లో (private banks) ఖాతాలు తెరిచి, వీటిలో జమయిన డబ్బును విత్ డ్రా చేసి జల్సాలు చేసుకునేవారు. హనుమకొండకు చెందిన ఒక వ్యక్తి ఈ సైబర్ నేరగాళ్ళ తప్పుడు ప్రచారాన్ని నమ్మి వీరు సూచించిన నకిలీ వెబ్ సైట్లలో సూమారు 28 లక్షల రూపాయలను పెట్టుబడి పెట్టాడు. అయితే.. తాను మోసపోయినట్టు తర్వాత గుర్తించాడు. దీనితో వరంగల్ సైబర్ క్రైమ్ విభాగం పోలీసులను అశ్రయించడంతో సైబర్ క్రైం ఏసీపీ విజయ్‌కుమార్ అధ్వర్యంలో ఈ కిలాడీ జంటను చెన్నైయ్‌లోని సలయూరు పోలీస్ స్టేషన్ పరిధిలో అరెస్టు చేసి స్థానిక జిల్లాలో కోర్టులోహజరుపర్చి పోలీస్ కమిషనరేట్‌కు తీసుకువచ్చారు.
దేశవ్యాప్తంగా సూమారు 150కి పైగా సైబర్ నేరాలకు పాల్పడి ప్రజలను మోసం చేసి పెట్టుబడుల రూపంలో కోట్ల రూపాయల డబ్బులను వసూళ్లకు పాల్పడినట్టు ఈ జంట అంగీకరించింది. ఈ సైబర్ నేరస్థుల జంట తెలంగాణ రాష్ట్రంలో 15 నేరాల్లో మూడు కోట్లకు పైగా డబ్బు వసూళ్ళు చేశారు. వీరిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సైబర్ క్రైమ్స్ ఏసీపీ విజయ్ కుమార్, ఇన్‌స్పెక్టర్ రవికుమార్, ఎస్‌ఐలు చరణ్‌కుమార్, శివకుమార్, ఏఏవో సల్మాన్‌పాషా, కానిస్టేబుళ్ళు రాజు, ఆంజనేయులు, దినేశ్, అనూషలను పోలీస్ కమిషనర్ అభినందించారు. ఈ మీడియా సమావేశంలో అదనపు డీసీపీ రవి పాల్గొన్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram