Site icon vidhaatha

ఆప్‌ తరఫున రాజ్యసభకు స్వాతి మలివాల్‌



న్యూఢిల్లీ : జనవరి 19న జరిగే రాజ్యసభ ఎన్నికల్లో ఢిల్లీ నుంచి ఢిల్లీ మహిళా కమిషన్‌ (డీసీడబ్ల్యూ) చైర్‌పర్సన్‌ స్వాతి మలివాల్‌ను ఆమ్‌ ఆద్మీ పార్టీ నామినేట్‌ చేసింది. స్వాతితోపాటు.. ఢిల్లీ లిక్కర్‌ కేసులో జైల్లో ఉన్న రాజ్యసభ సభ్యుడు సంజయ్‌సింగ్‌ను, ఎన్డీ గుప్తాను మరోసారి ఎగువ సభకు పంపాలని నిర్ణయించింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అధ్యక్షతన జరిగిన పొలిటికల్‌ ఎఫైర్స్‌ కమిటీ సమావేశంలో స్వాతి మలివాల్‌ పేరు చర్చకు వచ్చింది. ఢిల్లీ నుంచి రాజ్యసభ ఎన్నికలకు ఆప్‌ తరఫున ఎవరిని పంపాలన్నది నిర్ణయించేందుకే ఈ సమావేశం నిర్వహించారు.


మహిళా హక్కుల ఉద్యమకారిణి


స్వాతి మలివాల్‌ యుక్త వయసు నుంచే మహిళా ఉద్యమ కార్యకర్తగా ఉన్నారు. మహిళల హక్కులు, సామాజిక సమస్యలపై ఆమె చురుకుగా పోరాటం చేస్తున్నారు. మహిళలపై జరిగే హింసకు వ్యతిరేకంగా, వారి రక్షణకు బలమైన చట్టాలు కావాలంటూ సాగిన అనేక ఉద్యమాల్లోనూ, కార్యక్రమాల్లోనూ ఆమె భాగస్వామిగా ఉన్నారు. ఢిల్లీ మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌గా స్వాతి మలివాల్‌ 2015లో నియమితులయ్యారు.


మహిళలపై యాసిడ్‌ దాడులు, లైంగికదాడులకు వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు తీసుకున్నారు. రాజ్యసభ పదవీకాలం ముగియనున్న సుశీల్‌కుమార్‌ గుప్తా.. తాను హర్యానా ఎన్నికలపై దృష్టిసారించాలని అనుకుంటున్నందున మరోసారి రాజ్యసభ ఎంపీగా కొనసాగేందుకు అయిష్టత వ్యక్తం చేశారని ఆప్‌ నేత ఒకరు తెలిపారు. ఆయన నిర్ణయాన్ని గౌరవించామని చెప్పారు.


జైలు నుంచే సంజయ్‌ నామినేషన్‌ పత్రాలు జైలు నుంచే రాజ్యసభ రీనామినేషన్‌ పత్రాలు సమర్పించేందుకు ఢిల్లీ కోర్టు అంతకు ముందు సంజయ్‌సింగ్‌కు అనుమతి ఇచ్చింది. గతేడాది అక్టోబర్‌ 4 నుంచి సంజయ్‌సింగ్‌ జైల్లో ఉన్నారు. సంజయ్‌సింగ్‌ పదవీకాలం జనవరి 27తో ముగియనున్నది.

Exit mobile version