అనంత్‌ అంబానీ, రాధిక ప్రీవెడ్డింగ్‌ విందు భోజనాల్లో 2500 రకాల వంటలు!

మార్చి 1వ తేదీ నుంచి మూడవ తేదీ వరకూ గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో జరిగే అనంత్‌ అంబానీ, రాధికా మర్చంట్‌ ప్రీ వెడ్డింగ్‌ ఉత్సవాలకు హాజరయ్యే అతిథులు ఏం తినాలో తెలియక తికమకపడే పరిస్థితులు ఉన్నాయట!

  • By: Somu    latest    Feb 27, 2024 12:09 PM IST
అనంత్‌ అంబానీ, రాధిక ప్రీవెడ్డింగ్‌ విందు భోజనాల్లో 2500 రకాల వంటలు!
  • 70కి పైగా వెరైటీల అల్పాహారాలు.. రాత్రి పూట మిడ్‌నైట్‌ స్నాక్స్‌
  • రోజుకో డ్రెస్‌ కోడ్‌… రేయింబవళ్లు గానా బజానా.. అతిథుల లిస్టు ఇదే..



ముంబై: మార్చి 1వ తేదీ నుంచి మూడవ తేదీ వరకూ గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో జరిగే అనంత్‌ అంబానీ, రాధికా మర్చంట్‌ ప్రీ వెడ్డింగ్‌ ఉత్సవాలకు హాజరయ్యే అతిథులు ఏం తినాలో తెలియక తికమకపడే పరిస్థితులు ఉన్నాయట! ఎందుకంటే.. ఆ విందులో ఏకంగా 2500కుపై వంటకాలు అతిథుల నోరు ఊరించనున్నాయట! వీటిని తయారు చేసేందుకు దాదాపు 25 మంది ‘గరిటె’ తిరిగిన చెఫ్‌లు ఇండోర్‌ నుంచి జామ్‌నగర్‌ చేరుకున్నారని సమాచారం.


పార్సీ, థాయ్‌, మెక్సికన్‌, జపనీస్‌ వంటకాలతోపాటు.. ఇండోరీ క్యూసిన్‌ ఈ వంటకాల్లో హైలైట్‌గా నిలుస్తాయని చెబుతున్నారు. వీటితోపాటే పాన్‌ -ఏసియన్‌ రుచులు కూడా నోరూరించనున్నాయని జార్డిన్‌ హోటల్‌ డైరెక్టర్‌ చెప్పారు. మూడు రోజుల కార్యక్రమం సందర్భంగా అల్పాహారానికే 70 వెరయిటీలు ఉంటాయని సమాచారం. ఒక రోజు చేసిన వంటకం మరుసటి రోజు కనిపించదని చెబుతున్నారు.


ఇక లంచ్‌, డిన్నర్‌ విషయానికి వస్తే.. రోజూ 250 ఆప్షన్లకు తగ్గకుండా ఉంటాయని సమాచారం. అందులోనూ శాకాహారులకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. మిడ్‌నైట్‌ స్నాక్స్‌ కూడా అందుబాటులో ఉంచుతున్నారు. వాటిలోనూ 85 రకాల అర్థరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజాము 4 గంటల వరకూ అందిస్తారు. మూడు రోజుల ప్రీవెడ్డింగ్ వేడుకలకు వేయి మందికిపైగా అతిథులు రానున్నారు.


దేశంలోనే అత్యంత సంపన్నుల్లో ఒకరైన ముకేశ్‌ అంబానీ, నీతా అంబానీల కుమారుడు అనంత్‌ అంబానీ, ప్రముఖ వ్యాపార వేత్త వీరేన్‌ ఏ మర్చంట్‌, షాలియా వీరేన్‌ మర్చంట్‌ కుమార్తె రాధికల ప్రీవెడ్డింగ్‌ ఈవెంట్‌ జామ్‌నగర్‌లో జరుగనున్నది. మూడు రోజుల పాటు సాగే కార్యక్రమాల్లో ప్రతి రోజూ ఒక డ్రెస్‌ కోడ్‌ ఉంటుంది. వివిధ ఇతివృత్తాలతో వేడుకలు కొనసాగుతాయి. ఏ రోజు ఏ డ్రస్‌ కోడ్‌ అనేది అతిథులకు ముందుగానే పంపిన ఆహ్వాన పత్రికలో పొందుపర్చారు. ఇక తుది ఘట్టంగా జూలై 12న ముంబైలో అనంత్‌, రాధిక వివాహం జరుగనున్నది.


ప్రీవెడ్డింగ్‌ కార్యక్రమాలకు ప్రముఖులు, ప్రఖ్యాత వ్యాపారవేత్తలు, ప్రముఖ కళాకారులు, సినీ నటులు, క్రీడాకారులు వస్తారని అంచనా. గౌతం అదానీ, సునీల్‌ భారతి మిట్టల్‌, అమితాబ్‌బచ్చన్‌, షారుఖ్‌ఖాన్‌, సచిన్‌ టెండూల్కర్‌, ఎంఎస్‌ ధోనీ, అంతర్జాతీయ వ్యాపార దిగ్గజాలైన మెటా సీఈవో బార్క్‌ జుకర్‌బర్గ్‌, మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌, అల్ఫాబెట్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ తదితరులు ప్రీవెడ్డింగ్‌ కార్యక్రమాల అతిథుల జాబితాలో ఉన్నారు. హాలీవుడ్‌ పాప్‌ ఐకాన్‌ రిహన్నాతోపాటు దల్జీత్‌ దొసాన్జ్‌ తదితరులు అతిథులను తమ గానామృతంతో అలరించనున్నారు.