Anni Manchi Sakunamule Review | ‘అన్నీ మంచి శకునములే’ కాదు.. కొన్నే!

Anni Manchi Sakunamule Review మూవీ పేరు: ‘అన్నీ మంచి శకునములే’ విడుదల తేదీ: 18 మే, 2023 నటీనటులు: సంతోష్ శోభన్, మాళవిక నాయర్, గౌతమి, రాజేంద్రప్రసాద్, షావుకారు జానకి, రావు రమేష్, నరేష్, వాసుకి తదితరులు సినిమాటోగ్రఫీ: సన్నీ కూరపాటి, రిచర్డ్ ప్రసాద్ ఎడిటింగ్: జునైద్ సిద్ధఖీ మ్యూజిక్: మిక్కీ జే మేయర్ మాటలు: లక్ష్మీ భూపాల నిర్మాత: ప్రియాంక దత్ దర్శకత్వం: బి.వి. నందినీరెడ్డి విధాత‌: కరోనా టైమ్‌లో కానీ, ఆ తర్వాత […]

  • Publish Date - May 19, 2023 / 01:37 AM IST

Anni Manchi Sakunamule Review

మూవీ పేరు: ‘అన్నీ మంచి శకునములే’
విడుదల తేదీ: 18 మే, 2023
నటీనటులు: సంతోష్ శోభన్, మాళవిక నాయర్, గౌతమి, రాజేంద్రప్రసాద్, షావుకారు జానకి, రావు రమేష్, నరేష్, వాసుకి తదితరులు
సినిమాటోగ్రఫీ: సన్నీ కూరపాటి, రిచర్డ్ ప్రసాద్
ఎడిటింగ్: జునైద్ సిద్ధఖీ
మ్యూజిక్: మిక్కీ జే మేయర్
మాటలు: లక్ష్మీ భూపాల
నిర్మాత: ప్రియాంక దత్
దర్శకత్వం: బి.వి. నందినీరెడ్డి

విధాత‌: కరోనా టైమ్‌లో కానీ, ఆ తర్వాత కానీ.. ప్రేక్షకులకు గ్యాప్ లేకుండా సినిమాలు అందించిన హీరోలలో సంతోష్ శోభన్ ఒకరు. కరోనా టైమ్‌లో ఓటీటీలలో విడుదలైతే.. ఆ తర్వాత థియేటర్లలో ఆయన చిత్రాలు వస్తున్నాయి.. పోతున్నాయి. సరైన విజయం అయితే ఆయనకు పడటం లేదు కానీ.. వినోదం పరంగా ప్రేక్షకులకు లోటులేకుండా ఉండేలా ఆయన చిత్రాలు ఉంటూ వస్తున్నాయి.

ఇక ఇండస్ట్రీలో ఉన్న అతి తక్కువ మంది లేడీ డైరెక్టర్స్‌లో నందినీ రెడ్డి ఒకరు. ఆమె గతంలో చేసిన కొన్ని సినిమాలు మంచి విజయం సాధించాయి. కొన్ని పత్తా లేకుండా పోయాయి. అయినా కూడా ఆమె దర్శకురాలిగా మంచి పేరునే గడించింది. చాలా గ్యాప్ తర్వాత ఆమె దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కడం.. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే ప్రముఖ బ్యానర్‌గా పేరున్న వైజయంతీ మూవీస్ అనుబంధ సంస్థగా పేరున్న స్వప్న సినిమాస్‌పై ఈ సినిమా రూపుదిద్దుకోవడం వెరసీ.. సినిమాపై మంచి క్రేజే నెలకొంది.

అలాగే ప్రమోషన్స్‌లో ఇది క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అనేలా చెప్పడం, విడుదలైన టీజర్.. ట్రైలర్ కూడా అదే తెలియజేయడంతో.. టాలీవుడ్‌లో మరో ఫీల్ గుడ్ చిత్రం వస్తుందనేలా ఈ సినిమా టాక్‌ని సొంతం చేసుకుంది. మరి అలాంటి ఇమేజ్‌తో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని నమోదు చేసిందనే విషయాన్ని మన రివ్యూలో తెలుసుకుందాం.

కథ:

విక్టోరియాపురం అనే ఊరిలో రెండు కుటుంబాల మధ్య జరిగే కథ ఇది. ఆ రెండు కుటుంబాలకు ఎప్పటి నుంచో కాఫీ ఎస్టేట్ వ్యవహారంలో కోర్టు కేసులు నడుస్తుంటాయి. అందులో ఒక కుటుంబం ప్రసాద్ (రాజేంద్ర ప్రసాద్)ది కాగా, రెండోది దివాకర్ (రావు రమేష్)ది. రాజీ పడే సందర్భాలు వచ్చినా కూడా.. ఎప్పటిదో ఈ పగ అనేలా వారు.. ఆ కేసుని పొడిగించుకుంటూనే ఉంటారు.

ఇదే సమయంలో ప్రసాద్‌కు ఆర్య (మాళవిక నాయర్) అనే పాప, దివాకర్ సోదరుడు సుధాకర్ (నరేష్)కు రిషి (సంతోష్ శోభన్) అనే బాబు పుడతారు. అయితే వీరిద్దరూ పుట్టినప్పుడే మారిపోతారు. అంటే రాజేంద్ర ప్రసాద్‌కి పుట్టింది బాబు అయితే.. నరేష్‌కి పుట్టింది పాప. కానీ చిన్న తప్పిదంతో వారు మారిపోతారు.

చిన్నప్పటి నుంచి ఆర్యని రిషి ఇష్టపడుతుంటాడు. ఆ విషయం ఎన్నో సార్లు చెప్పాలని అనుకుంటాడు కానీ కుదరదు. వీరిద్దరూ వారి కాఫీ బిజినెస్ నిమిత్తం ఓసారి ఫారిన్ వెళతారు. అక్కడ రిషి తన ప్రేమను చెప్పాలని అనుకుంటాడు కానీ.. వారిద్దరి మధ్య కూడా గొడవ జరుగుతుంది.

ఈ నేపథ్యంలో తరతరాలుగా ఆ రెండు ఫ్యామిలీల మధ్య రగులుతున్న సమస్యని వారు ఎలా పరిష్కించారు? వారి జన్మ రహస్యం వారికి ఎలా తెలిసింది? తెలిసిన తర్వాత ఏమైంది? చివరికి వారిద్దరూ ఒక్కటవుతారా? వంటి ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే.. థియేటర్లలోకి వచ్చిన ఈ ‘అన్నీ మంచి శకునములే’ సినిమా చూడాల్సిందే.

నటీనటుల, సాంకేతిక నిపుణుల పనితీరు:

హీరోగా చేసిన సంతోష్ శోభన్, హీరోయిన్‌గా చేసిన మాళవిక ది బెస్ట్ నటనని కనబరిచారు. సంతోష్ శోభన్ నటుడిగా ఓ మెట్టు ఎక్కితే.. మాళవిక తన స్క్రీన్ ప్రెజన్స్‌తో ఆకట్టుకుంది. ఇద్దరికీ మంచి పేరు తెచ్చే సినిమా ఇది. వారిద్దరి తర్వాత చెప్పాలంటే రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్‌లు తమ అనుభవాన్ని ప్రదర్శించారు. పరిణితి చెందిన పాత్రలలో వారు జీవించేశారు. ఇంకా సినిమాలో అడుగడుగునా పదుల కొద్దీ నటులు కనబడుతూనే ఉంటారు. వారిలో గౌతమి పాత్ర, హీరో సోదరిగా చేసిన వాసుకి (తొలిప్రేమ ఫేమ్) పాత్రని చక్కగా తీర్చిదిద్దారు. అంతే చక్కగా వారు కూడా అభినయించారు.

ఇంకా షావుకారు జానకి, నరేష్, వెన్నెల కిషోర్.. ఇలా ప్రతి ఒక్కరూ తమ పాత్రల పరిధిమేర నటించి సినిమాకు హెల్ప్ అయ్యారు. నటన పరంగా ప్రతి ఒక్కరూ ఈ సినిమాకు ప్లస్సే అని చెప్పుకోవాలి. సాంకేతికంగా కూడా సినిమా చాలా ఉన్నతంగా ఉంది. మిక్కీ జె మేయర్ పాటలు, నేపథ్య సంగీతం అన్నీ వినసొంపుగా ఉన్నాయి. ఇద్దరు కెమెరామ్యాన్‌లు ఈ సినిమాకి పని చేశారు. వారి పనితనం కనబరిచారు. సంభాషణలు చాలా బాగున్నాయి. క్లైమాక్స్‌లో మంచి డైలాగ్స్ పడ్డాయి.

ఎడిటింగ్ పరంగా మాత్రం చాలా వరకు కత్తెర పడాల్సిన సన్నివేశాలు ఉన్నాయి. సాగదీత సన్నివేశాలను కట్ చేస్తే.. ఇంకాస్త స్పీడ్ అందుకునేది. నిర్మాణం పరంగా ఎక్కడా వెనక్కి తగ్గలేదని అనిపిస్తుంది. క్యాస్టింగ్‌కు చాలా వరకు మనీ ఖర్చు అయ్యి ఉంటుంది. అంత మంది ఈ సినిమాలో కనిపిస్తారు. ఇక మెయిన్ ఈ సినిమాకు మైనస్ అంటూ ఉందీ అంటే.. అది ఖచ్చితంగా నందనీరెడ్డి పనితనమే.

కథలో అస్సలు కొత్తదనం లేదు. అయినా సరే.. స్క్రీన్‌ప్లేతోనే, లేదంటే ఇంకా వేరే విధంగా మ్యాజిక్ చేసే ఛాన్స్ ఉండి కూడా.. నందినీ రెడ్డి రొటీన్‌గా సినిమాని నడిపించేసింది. దీంతో కలర్‌ఫుల్‌గా కనిపిస్తున్న ఈ సినిమా.. కంటెంట్ లెస్‌గా మారిపోయింది.

విశ్లేషణ:

సినిమా స్టార్టింగ్ కాఫీ ఎస్టేట్‌లు, కోర్టు గొడవలు వంటి సన్నివేశాలతో డైరెక్ట్‌గా పాయింట్‌లోకి తీసుకెళ్లిన నందినీ రెడ్డి.. ఆ తర్వాత కథను అంత ఆసక్తికరంగా నడపటంలో ఫెయిలైంది. ముఖ్యంగా రిషి, ఆర్యల ప్రేమపై పెట్టిన శ్రద్ధ‌ని.. ఇంకాస్త ఎమోషనల్‌గా కథను నడిపించే అంశంపై పెడితే మాత్రం ఈ కథ వేరేలా ఉండేది. అలాగే స్టార్టింగే ఈ సినిమా ద్వారా ఏం చెప్పబోతున్నారనే విషయం తెలిసిపోతుంది.

దీంతో ఎటువంటి ఆసక్తి చూస్తున్న ప్రేక్షకుడికి కలగదు. కాకపోతే ఇందులో నటించిన నటీనటులందరూ మంచి నటనని కనబరచడం ఒక్కటే కాస్త ఉపశమనం కలిగించే అంశం. అలాగే కొన్ని కామెడీ సీన్లు కూడా బాగా పండాయి.

ఫీల్ గుడ్ మూవీస్‌ని తెరకెక్కించడంలో స్పెషలిస్ట్ అయిన నందినీ రెడ్డి క్యాస్ట్‌ని చక్కగానే ఎన్నుకుంది. ప్రతి పాత్ర అవసరమే అనేలా ఆ పాత్రలకు ఇంపార్టెన్స్ ఇచ్చింది కానీ.. నేటి తరానికి కావాల్సిన స్పీడ్, కొత్తదనం తీసుకురావడంలో మాత్రం సక్సెస్ కాలేకపోయింది. కొన్ని ట్విస్ట్‌లు జత చేసి ఈ కథని నడిపినట్లు అయితే బాక్సాఫీస్ వద్ద రిజల్ట్ వేరేలా ఉండేది.

దీంతో అన్నీ మంచి శకునములే అనుకుని థియేటర్‌లోకి అడుగుపెట్టిన ప్రేక్షకులకు కొన్ని మాత్రమే అంటే యాక్టర్స్ నటన, కొన్ని కామెడీ సీన్లు మాత్రమే మంచి శకునాలుగా అనిపిస్తాయి. మిగతా అన్ని అపశకునాలే అనిపిస్తాయి. దీంతో బాక్సాఫీస్ వద్ద మంచి సినిమాగా నిలబడాల్సిన ఈ సినిమా.. ఓకే అని మాత్రమే అనిపించుకుంటుంది.

యాక్టర్స్ నటన కోసం మాత్రం ఒకసారి ఈ సినిమాని చూడొచ్చు. అంతకు మించి భారీగా ఊహించుకుని వెళితే మాత్రం.. అంతే భారీగా నిరాశకు లోనవుతారు. మొత్తంగా అయితే.. ఇంకో సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులని రంజింపజేయడంలో ఫెయిల్ అయిందని చెప్పుకోవచ్చు.

ట్యాగ్‌లైన్: అన్నీ కాదు.. కొన్నే!
రేటింగ్: 2.25/5

Latest News