Bank Deposit | డిపాజిట్ల కోసం బ్యాంకుల వేట!

  • Publish Date - April 11, 2024 / 03:35 PM IST

  • ఈక్విటీ ఫండ్లవైపు చూస్తున్న మదుపరులు

న్యూఢిల్లీ: 2023-24 ఆర్థిక సంవత్సరంలో డిపాజిట్లను ఆకర్షించేందుకు భారతదేశంలోని బ్యాంకులు కష్టపడుతున్నాయి. ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ వెల్లడించిన వివరాల ప్రకారం భారతీయ బ్యాంకుల క్రెడిట్-డిపాజిట్ల నిష్పత్తి 80 శాతంగా ఉంది.

నోట్ల రద్దు తరువాత బ్యాంకు లావాదేవీలపై భారతీయుల్లో తీవ్ర అసంతృప్తి మొదలైంది. వేల కోట్ల రుణాలు బడాబాబులు, కార్పొరేట్లు ఎగవేయడం, ఆ భారాన్నంతా బ్యాంకులు రకరకాల ఛార్జీలు, నిబంధనల పేరుతో వినియోగదారులపై మోపడంతో బ్యాంకు వ్యవహారాలపై కస్టమర్లకు ఆసక్తి తగ్గుతోంది. దీంతో వారంతా తమ డబ్బును డిపాజిట్లు చేయడం కంటే అధిక రాబడినిచ్చే ఈక్విటీ లింక్డ్ ప్రొడక్టులపై పెడుతున్నారు.

దీంతో బ్యాంకుల్లో తక్కువ డబ్బును మాత్రమే డిపాజిట్ చేస్తున్నారు. దీంతో బ్యాంకు డిపాజిట్లు తగ్గిపోయే రుణాలు ఇవ్వడం బ్యాంకులకు సమస్యగా మారుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో, బ్యాంకులు ఎక్కువ డిపాజిట్లను ఆకర్షించడానికి డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచాయి. కానీ ఖాతాదారులు దీనికి పెద్దగా ప్రభావితం కాలేదన్నది స్పష్టమవుతోంది.

2024 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు క్రెడిట్ వృద్ధిరేటు, డిపాజిట్ వృద్ధిరేటును అధిగమించింది. 13.5 శాతం వృద్ధితో బ్యాంకు డిపాజిట్లు రూ. 204.8 ట్రిలియన్లకు చేరుకోగా, మార్చి 2022 నాటికి ఆహారేతర క్రెడిట్ 20.2 శాతం పెరిగి రూ. 164.1 ట్రిలియన్లకు చేరుకుంది. 2023 ఆర్థిక సంవత్సరంలో, డిపాజిట్లు 9.6శాతం పెరగ్గా, క్రెడిట్ రేటు 15.4 శాతం పెరిగింది.

Latest News