మానకొండూర్‌లో ఎలుగుబంటి హల్ చల్

కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గ కేంద్రంలో జనావాసాల్లోకి వచ్చిన ఓ ఎలుగుబంటి సుమారు 9 గంటల పాటు ప్రజలను భయాందోళనకు గురిచేసింది

  • Publish Date - February 6, 2024 / 12:16 PM IST
  • చెట్టు ఎక్కి.. ఎట్టకేలకు చిక్కి
  • బంధించిన అధికారులు


విధాత బ్యూరో, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గ కేంద్రంలో జనావాసాల్లోకి వచ్చిన ఓ ఎలుగుబంటి సుమారు 9 గంటల పాటు ప్రజలను భయాందోళనకు గురిచేసింది. మానకొండూర్ చెరువు కట్ట సమీపంలో కరీంనగర్-వరంగల్ హైవే పక్కన ఎలుగుబంటి ఓ ఇంట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా కుక్కలు వెంట పడడంతో ఇంటి సమీపంలో ఉన్న చెట్టు ఎక్కింది. మంగళవారం తెల్లవారుజామున నాలుగు గంటల నుండి ఈ భల్లూకం జాతీయ రహదారి పక్కనే ఉన్న చెట్టు పైనే మకాం వేయడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.


ఎలుగుబంటిని చూసేందుకు రోడ్డుపై వెళ్లే ప్రయాణీకులతో పాటు స్థానికులు భారీగా తరలి వచ్చారు. విషయాన్ని స్థానికులు పోలీసులు,అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. డిఎఫ్ఓ బాలమణి,స్థానిక సిఐ ఎం.రాజ్ కుమార్,ఎల్ఎండి ఎస్ఐ చేరాలు,అటవీ శాఖ అధికారులు,సిబ్బంది మానకొండూర్ లో ఎలుగుబంటి ఉన్న ప్రాంతానికి చేరుకున్నారు. వన్యప్రాణి రక్షణ వాహనాన్ని రప్పించారు.కరీంనగర్-వరంగల్ రహదారిపై ఇరువైపులా వాహనాలను నిలిపివేశారు.


ఎలుగుబంటికి మత్తు ఇంజక్షన్ ఇచ్చే సమయంలో అది చెట్టు దిగి చెట్ల పొదల్లోకి పరుగులు తీయగా, పోలీసులు,అటవీ శాఖ అధికారులు, సిబ్బంది దాని వెంట పడ్డారు. చెరువు పక్కన ఉన్న చెట్ల పొదల్లో దాక్కున్న ఎలుగుబంటిని బయటకు రప్పించడం కోసం బాణాసంచా పేల్చగా భయంతో అది పొదల్లో నుంచి బయటకు పరుగులు పెట్టే క్రమంలో మత్తు ఇంజక్షన్ ఇచ్చారు.


మత్తు ఇంజక్షన్ ఇచ్చినప్పటికీ ఎలుగుబంటి ముంజంపల్లి వైపు కిలోమీటర్ దూరం పొలాల్లో నుంచి పరుగులు తీసింది. ఆ తర్వాత మత్తు ఇంజక్షన్ ప్రభావంతో పొలంలో కుప్ప కూలడంతో పోలీసులు,అటవీ శాఖ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అటవీ శాఖ సిబ్బంది ఎలుగుబంటిని వలలో బంధించి పొలాల్లో నుంచి బయటకు మోసుకువచ్చి వన్యప్రాణిసంరక్షణ వాహనంలో వరంగల్ కు తరలించారు.