60 శాతం క‌న్న‌డ‌.. ఆంగ్లంలో ఉన్న బోర్డుల‌పై దాడులు

క‌న్న‌డ భాష‌ను ప‌రిర‌క్షించేందుకు క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకునేందుకు సిద్ధ‌మ‌వుతోంది

  • Publish Date - December 27, 2023 / 12:25 PM IST

బెంగ‌ళూరు : క‌న్న‌డ భాష‌ను ప‌రిర‌క్షించేందుకు క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకునేందుకు సిద్ధ‌మ‌వుతోంది. ఆ రాష్ట్రంలోని వ్యాపార వాణిజ్య సంస్థ‌లు, కంపెనీలు, హోట‌ల్స్, షాపింగ్ మాల్స్, క‌మ‌ర్షియ‌ల్ బిల్డింగ్స్‌పై ఇక నుంచి క‌న్న‌డ భాష‌లోనే బోర్డుల‌ను ఏర్పాటు చేయాల‌ని, ఇందులో కచ్చితంగా 60 శాతం క‌న్న‌డ అక్ష‌రాలే ఉండాల‌న్న నిబంధ‌న‌ను అమ‌లు చేసేందుకు క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం సిద్ధ‌మ‌వుతోంది. ఇందుకు సంబంధించి ప్ర‌భుత్వం ఆదేశాలు కూడా జారీ చేసింది.


ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వ నిర్ణ‌యానికి మ‌ద్ద‌తుగా క‌ర్ణాట‌క ర‌క్ష‌ణ వేదిక ఆ రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు చేప‌ట్టింది. క‌న్న‌డ బోర్డుల‌కు సంబంధించిన ఆదేశాల‌ను త‌క్ష‌ణ‌మే అమ‌లు చేయాల‌ని డిమాండ్ చేసింది. హోటల్స్, దుకాణాల‌పై ఆంగ్లంలో ఉన్న బోర్డుల‌ను ధ్వంసం చేశారు. కొన్నిచోట్ల ఆ బోర్డుల‌పై న‌ల్ల ఇంకు పూసి నిర‌స‌న తెలిపారు. దీంతో ఆయా ప్రాంతాల్లో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఆందోళ‌న‌కారుల‌ను నిలువ‌రించేందుకు పోలీసులు లాఠీలు ఝులిపించారు. కొంత‌మందిని త‌మ క‌స్ట‌డీలోకి తీసుకున్నారు.


ఈ వివాదంపై బృహ‌త్ బెంగ‌ళూరు మహాన‌గ‌ర సంస్థ చీఫ్ క‌మిష‌న‌ర్ తుషార్ గిరినాథ్ స్పందించారు. ఈ ఆదేశాలు వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రి 28 నుంచి అమ‌ల్లోకి వ‌స్తాయ‌న్నారు. ఆదేశాల‌ను ఉల్లంఘించే వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు.


వివిధ వాణిజ్య సంస్థ‌లు క‌న్న‌డ భాష‌లోనే బోర్డుల‌ను ఏర్పాటు చేసేలా చ‌ర్య‌లు తీసుకోవాలంటూ క‌ర్ణాట‌క ర‌క్ష‌ణ వేదిక విజ్ఞ‌ప్తి చేసిన నేప‌థ్యంలో ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం చ‌ర్య‌లు చేప‌ట్టింది. దీంతో క‌న్న‌డ భాష‌కు ప్రాధాన్యం ఇవ్వాల‌ని నిర్ణ‌యించింది. వాణిజ్య సంస్థ‌లు, దుకాణాల వ‌ద్ద ఏర్పాటు చేసే బోర్డుల్లో 60 శాతం క‌న్న‌డ అక్ష‌రాలే ఉండాల‌ని ఆదేశించింది. నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘిస్తే దుకాణాలు, హోటల్స్, మాల్స్‌కు లైసెన్స్‌ల‌ను ర‌ద్దు చేస్తామ‌ని ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది.

Latest News