Site icon vidhaatha

నిరసనల భయంతోనే పొలాలకు రాని మంత్రులు

విధాత : రైతులు నుంచి నిరసనలు ఎదురవుతాయని, తరిమి కొడతారన్న భయంతోనే మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పొలాల సందర్శనకు రావడం లేదని మాజీ మంత్రి జి. జగదీశ్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన పోచంపల్లి మండలం దోతి గూడెం, అంతమ్మ గుడెం, అనుముల మండలం,కొట్టాల, చలమారెడ్డిగూడెం గ్రామాలలో ఎండిన పంట పొలాలను పరిశీలించి వారి సమస్యలు తెలుసుకునే భరోసానిచ్చారు.


ఈ సందర్భంగా జగదీశ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గ్రామాల్లో ఎండిన పంట పొలాలను, అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను, మద్దతు ధర కరువైన ధాన్యం కొనుగోలు సమస్యలతో రైతాంగం సతమతమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ చేతగానితనం వల్ల రైతులు రోడ్డు మీద పడ్డారన్నారు. పార్టీలో చేరికల కోసం గేట్లు ఎత్తడం కాదు, ముందు నాగార్జునసాగర్ గేట్లెత్తి రైతులకు నీళ్లు ఇవ్వండని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ 100 రోజుల పాలనలో అంతా క్షామం, కరువు అలుముకుందన్నారు.


తెలంగాణ ను దోచుకొని ఢిల్లీకి ముడుపులు చెల్లిస్తున్నారని ఆరోపించారు. రైతులు నీళ్లు లేక ఇబ్బందులు పడుతుంటే సీఎంగా కేసీఆర్ ఉంటే భూమి ఆకాశాన్ని ఒకటి చేసైనా సరే రైతులకు నీళ్లు అందించే వారన్నారు. పంట పొలాలు ఎండిపోతుంటే ఏ ఒక్క మంత్రిగాని ,ఎమ్మెల్యే గాని రైతులను కన్నెత్తి చూడటం లేదన్నారు. నాగార్జునసాగర్ క్రింద టెయిల్ ఎండ్ పదమే వినపడకుండా చివరి భూములకు నీళ్లు అందించిన ఘనత బీఅరెస్ ప్రభుత్వందన్నారు. .


కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం చుక్క నీటిని కూడా అందించలేదన్నారు.. మేజర్ల వద్ద పోలీసులను కాపలా పెట్టి పాలేరు జలాశయానికి నీళ్లు ఇచ్చారని, కానీ ఇక్కడ ఎండిపోతున్న పొలాలకు మాత్రం నీరు ఇవ్వలేదన్నారు . ఒక్కతడి నిళ్లిస్తే పంటలు గట్టిక్కేవని… ఒక్క సాగర్ ఆయకట్టు కిందనే రెండు లక్షల ఎకరాల్లో ఎక్కడికి అక్కడ పంటలు ఎండిపోయాయని తెలిపారు.


రైతులు కోట్ల రూపాయల నష్టపోయారని.. ఇప్పటికైనా ప్రభుత్వం నష్టపరిహారం అందించి ఆదుకోవాలని కోరారు. త్రీఫేస్ కరెంటు లేక మోటార్లు కూడా కాలిపోతున్నాయని.. జిల్లా మంత్రులు మాత్రం కల్లు తాగిన కోతుల వలే ఎగిరెగిరి పడుతున్నారని విమర్శించారు. మిల్లర్లతో కుమ్మక్కై రైతుల నోట్లో మట్టి కొడుతున్నారని ఆరోపించారు.ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు నోముల భగత్, రమావత్ రవీంద్ర కుమార్. తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version