సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుద‌ల‌

దేశంలో సార్వత్రిక ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాలు సిక్కిం, ఒడిస్సా, అరుణాచల్ ప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలకు ఎన్నికలు

  • Publish Date - March 16, 2024 / 10:07 AM IST

  • పార్ల‌మెంటుతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీకి ఎన్నికలు
  • ఏడు దశల్లో పోలింగ్‌..జూన్ 4న కౌంటింగ్‌
  • ఏపీ, తెలంగాణలో మే 13న పోలింగ్‌
  • ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్‌కుమార్ వెల్ల‌డి
  • జూన్ 16వ తేదీలోపు ఎన్నికల ప్రకియ పూర్తి
  • 96.88కోట్ల మంది ఓటర్లు..
  • 10.05లక్షల పోలింగ్ కేంద్రాలు
  • 55లక్షల ఈవీఎంల వినియోగం
  • దేశ వ్యాప్తంగా అమల్లోకి ఎన్నికల కోడ్‌

విధాత : సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు షెడ్యూల్ విడుద‌లైంది. పార్ల‌మెంటుతో పాటు సిక్కిం, ఒడిస్సా, అరుణాచల్ ప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లుగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్‌కుమార్ ప్రకటించారు. శనివారం మధ్యాహ్నం న్యూఢిల్లీలో నిర్వ‌హించిన మీడియా సమావేశంలో ఆయన ఎన్నికల షెడ్యూల్ వెల్లడించారు. ఏడు దశల్లో పార్లమెంటు ఎన్నికలు నిర్వహించనున్నారు. 

ఏప్రిల్ 18న నోటిఫికేషన్ జారీ కానుండగా, జూన్ 4న కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఏడు దశల్లో పార్లమెంటు ఎన్నికలు నిర్వహించనుండగా మొదటి దశ ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 19న, రెండో దశ ఏప్రిల్ 26న, మూడో దశ మే 7న, నాల్గవ దశ మే 13న(ఏపీ అసెంబ్లీ,లోక్‌సభ, తెలంగాణ లోక్‌సభ ఎన్నికలు), ఐదవ దశ మే 20న, ఆరవ దశ మే 25న, ఏడోదశ పోలింగ్‌ జూన్ 1న నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా 26 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు కూడా నిర్వహించనున్నారు. వాటిలో తెలంగాణలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నిక కూడా జరుగనుంది. 


మే 13న ఏపీ, తెలంగాణలో ఎన్నికలు

ఏపీ, తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ వివరాలను ఎన్నికల సంఘం వెల్లడించింది. ఏపీ, తెలంగాణలో నాలుగవ దశలో మే 13న ఎన్నికలు నిర్వహించనున్నారు. నోటిఫికేషన్ ఏప్రిల్ 18న విడుదల చేస్తారు. ఏప్రిల్ 25న వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన తిరస్కరణ, ఏప్రిల్ 29న ఉపసంహరణ ప్రక్రియ నిర్వహించనున్నారు. మే 13న పోలింగ్, జూన్ 4న కౌంటింగ్ నిర్వహిస్తారు.

ఈ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా 96.88కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారని తెలిపారు. ఇందులో 18 నుంచి 19 ఏళ్ల వ‌య‌సున్న 1 కోటి 84లక్షల మంది కొత్త ఓట్ల‌ర్లు తొలిసారిగా త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకోనున్నారు. దేశంలో 49.72 కోట్ల పురుష ఓటర్లు, 47.15 కోట్ల మహిళా ఓటర్లు, థ‌ర్డ్ జండ‌ర్ 48,044 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. దేశంలో 83.35 ల‌క్ష‌ల మంది దివ్యాంగ ఓట్ల‌ర్లు, 1.85 కోట్ల మంది 80 సంవ‌త్స‌రాలు పైబ‌డిన ఓట‌ర్లు, 2.38 కోట్ల మంది వ‌తిధిక వృద్ద ఓట‌ర్లు. 19.74 కోట్ల‌ మంది 20 -29 సంవ‌త్స‌రాల మ‌ధ్య వ‌య‌సున్న ఓట‌ర్లున్నారు. జండ‌ర్ రేషియో 948గా ఉన్న‌ట్లు ఎన్నిక‌ల ప్ర‌ధాన క‌మిష‌న‌ర్ తెలిపారు.

ప్రస్తుత 17వ లోక్‌సభ గడువు జూన్ 16వ తేదీతో ముగియనుందని సీఈసీ ప్ర‌ధాన క‌మిష‌న‌ర్ తెలిపారు. జూన్ 16లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందన్నారు. దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ వెంటనే అమల్లోకి వచ్చినట్లుగా ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఎన్నికల నిర్వాహణకు 10.05 లక్షల పోలింగ్ కేంద్రాలు, 55లక్షల ఈవీఎంలు సిద్ధం చేశామని, 1.05కోట్ల మంది మంది ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొంటారని తెలిపారు. 80ఏండ్లు దాటిన వారికి ఓట్ ఫ్రమ్ హోమ్ వసతి కల్పించనున్నట్లుగా తెలిపారు. 12రాష్ట్రాల్లో మహిళా ఓటర్ల సంఖ్యనే అధికంగా ఉందన్నారు. జమ్మూకాశ్మీర్‌లో కూడా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉందన్నారు.

2019 లోక్ సభ ఎన్నిక‌ల కంటే 2024 నాటికి దాదాపు 8 కోట్లు పెరిగింద‌ని సీఈసీ తెలిపింది. 2019లో 89.6 కోట్ల ఓట‌ర్లు ఉండ‌గా 2024 నాటికి 96.88 కోట్ల‌కు ఓట‌ర్ల సంఖ్య పెరిగింది. అలాగే పురుష ఓట‌ర్ల సంఖ్య 46.5 కోట్ల నుంచి 49.7 కోట్ల‌కు, మ‌హిళా ఓట‌ర్ల సంఖ్య 43.1 కోట్ల నుంచి 47.1 కోట్లకు, థ‌ర్డ్ జండ‌ర్ 39,683 నుంచి 48.044కు , దివ్యాంగులు 45.64 ల‌క్ష‌ల నుంచి 88.35 ల‌క్ష‌ల‌కు, 18 నుంచి 19 ఏళ్ల వ‌య‌స్సు మ‌ధ్య ఓట‌ర్లు 1.5 కోట్ల నుంచి 1.85 కోట్ల‌కు, జండ‌ర్ రేషియో కూడా ఓట్ల సంఖ్య మాదిరిగానే 928 నుంచి 948కి  పెరిగింది.

Latest News