వేం నరేందర్‌రెడ్డి ప్రమాణ కార్యక్రమానికి ఆ మంత్రి ఎందుకు రాలేదు?

ఎంపీగా వేం నరేందర్‌రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఉమ్మడి వరంగల్‌కు చెందిన మంత్రి హాజరుకాకపోవడంపై జిల్లా రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చలు సాగుతున్నాయి.

విధాత, ప్రత్యేక ప్రతినిధి:

ఇటీవలే రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైన వేం నరేందర్‌ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమం వరంగల్‌ జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపింది. కార్యక్రమానికి ఒక మహిళా మంత్రి తప్ప.. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ముఖ్య ప్రజాప్రతినిధులంతా గురువారం ఢిల్లీకి తరలివెళ్లడం ఈ చర్చకు కేంద్ర బిందువుగా నిలిచింది. ఒక ఎంపీ ప్రమాణం చేసే కార్యక్రమానికి జిల్లా మంత్రి కచ్చితంగా హాజరుకావాలనే రూలేమీ లేకపోయినా.. చర్చ మాత్రం రకరకాలుగా సాగుతున్నది. వేం నరేందర్‌తో సదరు మహిళా మంత్రికి విభేదాలున్నందునే వెళ్ళలేదని ఆ పార్టీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి.

వేం నరేందర్‌రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు వివేక్ వెంకటస్వామి, వాకిటి శ్రీహరితోపాటు పార్టీ నేతలు మధు యాష్కీగౌడ్, వేణుగోపాల్, షబ్బీర్ అలీ, కవ్వంపల్లితో తదితరులతో పాటు.. ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంచార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జిల్లాకు చెందిన మంత్రి సీతక్క, విప్ రామచందర్నాయక్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు దొంతి మాధవరెడ్డి, గండ్ర సత్యనారాయణరావు, డాక్టర్ మురళీకృష్ణ, కడియం శ్రీహరి, నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, మరికొంత మంది నాయకులు హాజరయ్యారు. లోక్‌సభ సమావేశాల నేపథ్యంలో జిల్లాకు చెందిన ఎంపీలు బలరామ్ నాయక్, కడియం కావ్య ఢిల్లీలోనే ఉన్నారు.

సీఎం రేవంత్‌కు అత్యంత సన్నిహితుడిగా వేం నరేందర్ రెడ్డికి గుర్తింపు ఉంది. ఇద్దరూ టీడీపీలో చాలా కాలం కలిసి పనిచేశారు. అప్పట్లో నరేందర్ రెడ్డిని ఎమ్మెల్సీగా చేసే క్రమంలోనే రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో చిక్కుకున్నారు. ఆ తర్వాత కూడా వారి రాజకీయ ప్రయాణం కలిసే సాగింది. ఇద్దరు కలిసి కాంగ్రెస్‌లో చేరారు. కాలక్రమంలో రేవంత్ సీఎం కాగా, ఆయన సలహాదారుగా మొన్నటి వరకు నరేందర్ రెడ్డి ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా కేసముద్రం ప్రాంతానికి చెందిన వేం నరేందర్ రెడ్డికి ఉమ్మడి జిల్లా రాజకీయ వ్యవహారాలపై పూర్తి అవగాహన ఉంది. ఈ నేపథ్యంలోనే జిల్లా రాజకీయాల్లో సీఎం తీసుకునే నిర్ణయాలలో వేం పాత్ర ఉందనే అభిప్రాయం సర్వత్రా ఉంది. ఈ క్రమంలో సదరు మంత్రి ఇతర ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులను పట్టించుకోకుండా ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నించారనే విమర్శల నేపథ్యంలో వేం వారికి వ్యతిరేకంగా ఉన్నారనే చర్చ సాగింది. ఈ మేరకు ఆ మంత్రి కూడా బహిరంగంగా వేం పై కూడా ఆరోపణలు చేశారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య పెరిగి దూరం ఇంకా కొనసాగుతున్నట్లు తాజా పరిణామాలను బట్టి భావిస్తున్నారు.

Read Also |

పార్లమెంట్ సాక్షిగా తెలంగాణకు మరోసారి అవమానం! మళ్లీ రగలిన సెంటి‘మంటలు’
సింగర్‌ మంగ్లీ కేసులో రోజుకో ట్విస్ట్
బీజీపీకి లాభం.. ప్రతిపక్షాలకు నష్టం.. : పెరిగే సీట్లపై యోగేంద్రయాదవ్‌ విశ్లేషణ

Latest News