కేసీఆర్ సభకు కేటీఆర్, హరీశ్.. సీఎం సభకు సురేఖ డుమ్మా వెనుక..
తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను ఒక్కసారిగా హీటెక్కించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ల కార్యక్రమాలకు ఇరువైపుల నుంచి పలువురు ముఖ్యనేతలు గైర్హాజరుకావడం ఇప్పుడు కాంగ్రెస్, బీఆర్ఎస్‌తోపాటు అన్ని రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. జగిత్యాలలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆరెస్ ఎల్పీ ఉప నేత హరీశ్‌రావు కనిపించకపోగా, సీఎం ప్రోగ్రామ్ సందర్భంగా కాళేశ్వరంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ జాడలేకపోవడం అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది.
విధాత, ప్రత్యేక ప్రతినిధి:
సోమవారం జగిత్యాలలో బీఆర్ఎస్ సభకు హాజరుకాకుండా హరీశ్ రావు ఢిల్లీకి వెళ్ళడంపై అనేక చర్చలు సాగాయి. హరీశ్ రావు, వినోద్ కుమార్, రవిచంద్ర ఢిల్లీకి వెళ్ళిన విషయంపై కాంగ్రెస్ నాయకులు అనుమానాలు వ్యక్తం చేశారు. జీవన్ రెడ్డి చేరిక ఇష్టంలేక సభకు రాలేదని విమర్శించారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణ ఆపించడంలో భాగంగా బీజేపీ నేతలను కలిసేందుకు వెళ్ళారని సీఎం రేవంత్ ఆరోపించారు. ఈ క్రమంలో కేటీఆర్ సైతం లేకపోవడంపై అసలు కారణాలేంటనే సందేహాలు తలెత్తాయి. కేటీఆర్ ఎక్కడికి వెళ్ళారంటూ జగిత్యాలలో మీడియా వర్గాలు ఆరా తీయడం కనిపించింది. అదే పరిస్థితి కాళేశ్వరంలోనూ నెలకొంది. మంత్రి కొండా సురేఖ ఈ కార్యక్రమానికి ఎందుకు హాజరుకాలేదంటూ పలువురు చర్చించుకున్నారు.
సీఎం కార్యక్రమానికి సురేఖ డుమ్మా
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనలో మంత్రి కొండా సురేఖ కనిపించలేదు. సీఎంతో పాటు మంత్రులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వర్ రావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, గడ్డం వివేక్ , అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మంత్రి కొండా సురేఖ మాత్రం సీఎం పర్యటనతో పాటు కాటారం మండలంలో నిర్వహించిన బహిరంగ సభలోనూ కనిపించకపోవడంతో మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. సోమవారం సీఎం రేవంత్ కాళేశ్వరంలో ఆలయ పునరుద్ధరణ, పుష్కరాలకు రూ.200 కోట్ల వ్యయంతో చేపట్టే పనులను ప్రారంభించారు. సీఎం పర్యటనలో తొలి కార్యక్రమం ఇదే అయినప్పటికీ సంబంధిత దేవాదాయ శాఖ మంత్రిగా కొండా సురేఖ హాజరుకాకపోవడం గమనార్హం. కాళేశ్వరం తర్వాత ఆయన మేడిగడ్డను సందర్శించారు. అక్కడికి కూడా సురేఖ వెళ్ళలేదు. ఆ తర్వాత నిర్వహించిన బహిరంగ సభలోనూ కనిపించలేదు.
గతంలో కూడా మేడారం అభివృద్ధి పనుల ప్రారంభ కార్యక్రమాలకు ఆమె హాజరుకాలేదు. సీఎం హనుమకొండకు వచ్చి ఎమ్మెల్యే దొంతిని పరామర్శించిన సందర్భంలో కూడా దూరంగా ఉన్నారు. తాజాగా ఇతర కార్యక్రమాల్లో ఆమె పాల్గొనకపోయినప్పటికీ సంబంధిత శాఖ మంత్రిగా సురేఖ కాళేశ్వరం కార్యక్రమానికి హాజరుకాకపోవడం చర్చకు దారితీసింది. మంత్రిగా తనకు సమాచారం లేకనా? ఏదైనా పని ఉండి రాలేకపోయారా? ఆమె అసంతృప్తితో ఉన్నారా? అంటూ అనేక ఊహాగానాలు సాగుతున్నాయి.
అన్నీ తానై… ఆఖరు నిమిషంలో గైర్హాజరు
కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి తమ పార్టీలో చేరికను తమ రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించుకునే ఎత్తుగడతో బీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన జగిత్యాల సభ, కార్యక్రమాల్లో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కనిపించకపోవడం ఆ పార్టీ వర్గాలతో పాటు మీడియా, ఇతర రాజకీయ వర్గాల్లో చర్చను లేవనెత్తింది. జగిత్యాల సభకు ముందు జీవన్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వనించేందుకు భారీ కాన్వాయ్‌తో జగిత్యాలకు కేటీఆర్ వెళ్లారు. ఆ తర్వాత జీవన్ రెడ్డిని ఎర్రవెల్లి ఫాంహౌస్‌కు తీసుకెళ్ళి కేసీఆర్‌తో చర్చలు జరిపిన సందర్భంగా కేటీఆర్ ముఖ్యపాత్ర పోషించారు. జగిత్యాల సభ నిర్వహణ, ప్రణాళికల్లో కేటీఆర్ ప్రధాన బాధ్యత చేపట్టారు. తర్వాత సభ ఏర్పాట్లను హరీశ్‌రావుతో కలిసి ఒక రోజు ముందు పరిశీలించారు. సభ ఏర్పాట్ల పరిశీలన తప్ప మిగిలిన కార్యక్రమాల్లో హరీశ్ లేకపోవడం ఒక విధమైన చర్చకు దారితీస్తే, అన్నింటా తానై వ్యవహరించిన కేటీఆర్ సభ రోజు ఎందుకు లేరనే అనుమానం వ్యక్తమైంది. సభలో కూడా ఆ పార్టీలో చేరిన జీవన్ రెడ్డితో పాటు ఎమ్మెల్సీ రమణ, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తదితరులు ప్రసంగించారు. దేశపతి, గంగుల, పల్లా, సుమన్, సంతోష్ రావు, మధుసూదనాచారి, సంజయ్ తదితరులు వేదికపై కూర్చున్నారు. కొన్ని సందర్భాల్లో వేదిక కింద ముందు వరుసలో కూర్చునే కేటీఆర్ అక్కడ కూడా లేకపోవడంతో ఆయన జగిత్యాల సభ కార్యక్రమానికి రాలేదని పార్టీవర్గాలు చెబుతున్నాయి. కారణం మాత్రం చెప్పడం లేదు. మరో నేత హరీశ్ రావు కాళేశ్వరం కోర్టు తీర్పు రానున్న నేపథ్యంలో న్యాయనిపుణులతో చర్చించేందుకు ఢిల్లీ వెళ్ళినట్లు చెబుతున్నారు. ఇదే పనిపై కేటీఆర్ కూడా ప్రత్యేకంగా మానిటరింగ్ చేసినట్లుగా భావిస్తున్నారు.
Read Also |
త్వరలో భూముల విలువలు పెంపు…రిజిస్ట్రేషన్ ఛార్జీల మోత తప్పదా
Tiwanese Watermelon | పుచ్చకాయల సాగు.. 3 నెలల్లోనే రూ. కోటికి పైగా సంపాదన..
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram