సింగర్‌ మంగ్లీ కేసులో రోజుకో ట్విస్ట్

సింగర్ మంగ్లీపై మైక్రోఫైనాన్స్ మోసం ఆరోపణలు ముదురుతున్నాయి. బాధితుల ఫిర్యాదులతో కేసులు నమోదు కాగా, 62 కేసులను సీఐడీకి బదిలీ చేశారు.

సింగర్‌ మంగ్లీ కేసులో రోజుకో ట్విస్ట్

విధాత, హైదరాబాద్ : ప్రముఖ గాయని మంగ్లీ చుట్టూ మైక్రో ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్ మోసం ఆరోపణలు ముదురుతున్నాయి. బాధితుల తరపున అడ్వకేట్ సుబ్బారావు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వివాదం వెలుగులోకి వచ్చింది. మంగ్లీతో పాటుగా ఆమె సోదరుడు శివ పైన సుబ్బారావు పలు రకాల ఆరోపణలు చేశారు. రమావత్ మధు అనే వ్యక్తి గోకుల్ నంద ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో సింగర్ మంగ్లీ పేరును ఉపయోగించుకొని మైక్రో ఫైనాన్స్ కార్యక్రమాలు నిర్వహించారని, నెలకు నాలుగు నుంచి ఐదు శాతం వరకు వడ్డీ , స్థలలు రిజిస్ట్రేషన్ వంటి హామీలు ఇచ్చి రూ. 150 కోట్ల రూపాయల వరకు వసూలు చేశారంటూ ఆరోపణలు చేశారు. సుమారు రూ. 10 కోట్లకు పైగా మోసం జరిగిందని, ఇందులో మంగ్లీ తన సెలబ్రిటీ హోదాను అడ్డం పెట్టుకుని ప్రజలను నమ్మించి డబ్బులు సమీకరించారని ఆయన ఆరోపించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మంగ్లీతో పాటు మరో నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు

నేను ఏ తప్పు చేయలేదు: మంగ్లీ

అయితే అడ్వకేట్ సుబ్బారావు చేసిన ఆరోపణలను మంగ్లీ కొట్టిపారేసింది. తనను బ్లాక్‌మెయిల్ చేసేందుకే సుబ్బారావు తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని పోలీసులకు ఎదురు ఫిర్యాదు చేశారు. తన పైన సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రచారం పెరుగుతూ ఉండడంతో నేరుగా డీజీపీని కలిసి ఫిర్యాదు చేసింది. అయితే తాజాగా బాధితులు ఒక్కొక్కరుగా నేరుగా మీడియా ముందుకు వచ్చి తమ గోడు వ్యక్తం చేస్తుండటంతో ఈ కేసులో మంగ్లీకి ఇబ్బందులు తప్పేలా లేవు. పోలీసులు ప్రస్తుతం ఈ కేసును లోతుగా విచారిస్తున్నారు.

ఆ 62కేసులు సీఐడీకి బదిలీ

సింగర్ మంగ్లీ మైక్రోఫైనాన్స్ మోసాల కేసులో రోజు రోజుకు బాధితుల సంఖ్య పెరుగుతుంది. మెక్రో ఫైనాన్స్ దందాతో కోట్లాది రూపాయలు వసూలు చేసి పరారీలో రమావత్‌ మధు, బాలాజీ నాయక్‌, భరత్‌ చౌహాన్‌ లు ముగ్గురిపై నల్గొండ, గద్వాల్‌లో నమోదైన 62 కేసులను సీఐడీకి బదిలీ చేశారు. నిందితులు సిమెంట్‌ కంపెనీలో పెట్టుబడుల పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. మధు గ్యాంగ్‌ కోసం సీఐడీ పోలీసుల గాలింపు చేపట్టారు. అయితే పరారీలో ఉన్న మధు మాత్రం ఒక వీడియోను విడుదల చేస్తూ ఆ వీడియోలో అడ్వకేట్ సుబ్బారావు చెప్పిన ఆరోపణలు నిజాలు కావని తాను మోసపోయానని తెలిపారు. హిమాకాంత్ రెడ్డి అనే వ్యక్తి దగ్గరే డబ్బులు అన్ని ఉన్నాయంటూ ఆరోపణలు చేశారు. ఆ డబ్బులు బినామీల మీద ఉంచారంటు ఆరోపణలు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. మధు విడుదల చేసిన వీడియోలో, సింగర్ మంగ్లీకి ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కంపెనీ నుంచి రూ.20 కోట్లు హిమాకాంత్ రెడ్డి తీసుకున్నాడని మధు ఆరోపించాడు. అడ్వకేట్ సుబ్బారావు, హిమాకాంత్ రెడ్డి స్నేహితులని, హిమాకాంత్ రెడ్డి నుంచి డబ్బులు ఇప్పిస్తానని సుబ్బారావు చెప్పారని మధు పేర్కొన్నాడు.

ప్రెస్ క్లబ్ కు రండి..తేల్చుకుందాం : సుబ్బారావు

తన మీద ఆరోపణలు చేస్తున్న మంగ్లీ గాని, ఆమె తమ్ముడు గాని మధు గాని..ఎవరైనా సరే గురువారం 2 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కి రావాలని, అక్కడ మీడియా సాక్షిగా ఎవరిది తప్పుందో తేల్చుకుందాం అంటూ అడ్వకేట్ సుబ్బారావు ఛాలెంజ్ చేశారు. దీంతో ప్రెస్ క్లబ్ వద్ద హై డ్రామా నెలకొంది.

ఇవి కూడా చదవండి :

పీవీఆర్ మాల్ నిర్లక్ష్యం..ఉద్యోగి ప్రాణం బలి !
Tollywood | ‘జన నాయగన్’ లీక్‌తో ఇండ‌స్ట్రీ అంతా షాక్… గ‌తంలో విడుదలకు ముందే లీకైన తెలుగు సినిమాలు ఇవే!