పార్లమెంట్ సాక్షిగా తెలంగాణకు మరోసారి అవమానం! మళ్లీ రగలిన సెంటి‘మంటలు’

తెలంగాణ ఆవిర్భావాన్ని బీజేపీ నేతలు ఇంకా జీర్ణించుకున్నట్టు లేరు. తల్లిని చంపి బిడ్డను బతికించారన్న మోదీ వ్యాఖ్యలకు కొనసాగింపుగా తరచూ విభజనపై విషాన్ని వెళ్లగక్కుతున్న బీజేపీ నేతలు.. తాజాగా ఆంధ్రప్రదేశ్‌ విభజనను ఇండియా పాకిస్తాన్‌ విభజనతో పోల్చడంతో తెలంగాణ అగ్గిమీద గుగ్గిలమవుతున్నది. తాజా వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతున్నది.

పార్లమెంట్ సాక్షిగా తెలంగాణకు మరోసారి అవమానం! మళ్లీ రగలిన సెంటి‘మంటలు’
  • పాకిస్థాన్, భారత్ విభజన తరహాలో ఏపీని విభజించారన్న బీజేపీ ఎంపీ
  • కాంగ్రెస్‌ను బ్రిటిష్ వారితో పోల్చిన తేజస్వీ సూర్యపై వెల్లువెత్తిన ఆగ్రహం
  • విభజన జరిగి పుష్కరకాలమైనా బీజేపీ విమర్శల పర్వం
  • మరోసారి ఇరకాటంలో తెలంగాణ బీజేపీ నేతలు

విధాత, ప్రత్యేక ప్రతినిధి:

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆంధ్ర, తెలంగాణ రెండు రాష్ట్రాలుగా ఏర్పాటు చేసిన తీరుపై బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య లోక్‌సభలో మాట్లాడిన మాటలిప్పుడు తెలంగాణలో అగ్గిరాజేస్తున్నాయి. లోక్‌సభలో గురువారం మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ చట్ట సవరణ బిల్లుల చర్చ సందర్బంగా ఆయన రాష్ట్ర విభజనపై చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు భగ్గుమంటున్నారు. కర్ణాటకకు చెందిన ఈ బీజేపీ ఎంపీ మాట్లాడుతూ డీలిమిటేషన్ చట్టం తెస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఉత్తర, దక్షిణ భారతమంటూ విభేదాలు తెచ్చేందుకు ప్రయత్నిస్తోందని, ప్రజల మధ్య విభేదాలు, విద్వేషాలు సృష్టించే విధానాలు అవలంబిస్తున్నదంటూ.. ఆ వారసత్వం కొనసాగింపులో భాగంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏపీ, తెలంగాణ రాష్ట్రాలుగా విభజన చేసిన తీరును తీవ్రంగా తప్పు తప్పుబట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనను దేశం నుంచి పాకిస్థాన్ విభజనతో పోల్చారు. ఈ వ్యాఖ్యలపై వెంటనే సభలోని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీపై రాజకీయ విమర్శలు చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తీరును విమర్శిస్తున్న తీరు సహజంగానే ఈ ప్రాంతవాసుల్లో ఆగ్రహానికి కారణమవుతోంది. దశాబ్దాల ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష, వందల మంది విద్యార్ధి, యువకుల బలిదానాలు, సుదీర్ఘ పోరాటం తర్వాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఏర్పాటుకు నిర్ణయం తీసుకుని అమలు చేయడాన్ని తప్పుపట్టడం పట్ల ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీంతో తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఇక్కడి నుంచి గెలిచిన ఆ పార్టీ ఎనిమిది మంది ఎంపీలు టార్గెట్ అవుతున్నారు.

మరోసారి తెలంగాణలో సెంటి‘మంటలు’

తెలంగాణ రాష్టం ఏర్పడి పుష్కరకాలం పూర్తయినప్పటికీ ఇంకా రాష్ట్ర ఏర్పాటుపై కొందరు ఉద్దేశపూర్వక విమర్శలు చేస్తున్నారనే అభిప్రాయం తెలంగాణ ప్రాంతంలో వేళ్ళూనుకుంటోంది. ప్రధాని మోదీ గతంలో పార్లమెంటులో మాట్లాడుతూ రాష్ట్ర విభజన సందర్భంగా కాంగ్రెస్ అనుసరించిన తీరు విద్వేషాలు సృష్టించిందంటూ విమర్శించారు. తల్లిని చంపి బిడ్డను కాపాడారంటూ మండిపడ్డారు. అప్పట్లో ఈ వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తాయి. తెలంగాణ ఏర్పాటు బీజేపీకి ఇష్టం లేదా? అంటూ ప్రశ్నలు తలెత్తాయి. ఆ తర్వాత క్రమంలో కూడా ఒకరిద్దరు బీజేపీ నాయకులు రాష్ట్ర విభజనపై చేసిన వ్యాఖ్యలతో తెలంగాణ ఏర్పాటుకు బీజేపీ వ్యతిరేకమనే భావన వ్యక్తమైంది. మొన్నటికి మొన్న బడ్జెట్ సమావేశంలో ఏపీ టీడీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు కూడా రాష్ట్ర విభజన తీరుపై కాంగ్రెస్‌ను విమర్శించేందుకు ప్రయత్నించి, తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నట్టు మాట్లాడటం దుమారాన్ని రేపింది. తాజాగా డీలిమిటేషన్ బిల్లు సందర్భంగా తేజస్వీ వ్యాఖ్యలు తెలంగాణ వాదుల్లో ఆగ్రహానికి కారణమవడంతోపాటు.. రాష్ట్ర బీజేపీ నేతలను ఇరకాటంలో పడేసింది. తేజస్వి వ్యాఖ్యలను ఖండించలేక.. వివరించేందుకు ప్రయత్నించిన బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచందర్ రావు కూడా ఆయనను సమర్ధించే విధంగా మాట్లాడారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

తేజస్వీ సూర్య ఎంపీ సభ్యత్వం తొలగించాలి: పొన్నం

బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలపై రాష్ట్ర రవాణ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తేజస్వీ సూర్య ఎంపీ సభ్యత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేక ఆయన మాట్లాడిన మాటలను రికార్డుల నుంచి తొలగించాలని కోరారు. ఈ విషయంలో మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, తెలంగాణ బీజేపీ ఎంపీలు ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు. తేజస్వి సూర్య తెలివిలేని వెధవ-అంటూ పొన్నం విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై అజ్ఞానంగా మాట్లాడారని, ఈ విధంగా మరొకరు మాట్లాడకుండా బుద్ధి చెప్పాలని అన్నారు. తెలంగాణ డీఎన్‌ఏ ఉన్నవాళ్లు తేజస్వి వ్యాఖ్యలను ఖండించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఏర్పాటును పాకిస్తాన్‌ విభజనతో పోలుస్తారా? అంటూ ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటుపై అడ్డగోలుగా మాట్లాడితే ఖబడ్దార్‌ అంటూ హెచ్చరించారు. ఆయన వ్యాఖ్యలను సమర్థించేవాళ్లు మూర్ఖులని పొన్నం స్పష్టం చేశారు. గతంలో ప్రధాని మోదీ కూడా తల్లిని చంపి బిడ్డను కన్నారంటూ తప్పుడు వ్యాఖ్యానాలను చేశారని విమర్శించారు.

ఆత్మగౌరవాన్ని కించపరిచే వ్యాఖ్యలు : హరీశ్, కేటీఆర్

కర్ణాటక బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య తెలంగాణ ఏర్పాటును పాకిస్తాన్ విభజనతో పోల్చిడంపై బీఆర్ఎస్ మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ టి హరీశ్ రావు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. పార్లమెంట్ సాక్షిగా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని అవమానించినందుకు వెంటనే ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మహోన్నత ఉద్యమాన్ని విద్వేషపూరిత విభజనతో పోల్చడం చరిత్రను అవమానించడమేనని, అమరుల త్యాగాలను తక్కువ చేసి చూపించడమేనని స్పష్టం చేశారు. ఇది భారత సమాఖ్య స్ఫూర్తి పట్ల బీజేపీకి ఉన్న అజ్ఞానాన్ని సూచిస్తోంది అని ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇండియా పాకిస్థాన్ విభజన లాంటిదే తెలంగాణ ఏర్పాటు అయితే ఆనాడు బీజేపీ విభజన బిల్లుకు ఎందుకు మద్దతు తెలిపింది? అని ప్రశ్నించారు. ప్రధాని మోడీ కూడా గతంలో అనేకసార్లు తెలంగాణ ఏర్పాటు ప్రక్రియపై విషం చిమ్మారని గుర్తు చేశారు.

తేజస్వి ఉద్దేశ్యం అదికాదు: బీజేపీ చీఫ్ రామ చందర్ రావు

తేజస్వి వ్యాఖ్యలు ఆ ఉద్దేశంతో చేసినవి కావంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు సమర్ధించుకునే ప్రయత్నం చేశారు. వెంటనే తెలంగాణ ఇవ్వకుండా వందలాది విద్యార్ధి, యువకుల బలిదానాల తర్వాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఏర్పాటుకు చర్యలు తీసుకుందనే విషయాన్ని తేజస్వి చెప్పేందుకు యత్నించారంటూ ఆయన మాట్లాడారు.