• Telugu News
  • /Telangana

Pawan Kalyan Vs Anirudh Reddy | దిష్టి మాది కాదు..మీది : పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు అనిరుధ్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్

కోనసీమ కొబ్బరి చెట్లకు తెలంగాణ వాళ్ల దిష్టి తగిలిందన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అసలు తమ హైదరాబాద్‌కే ఏపీ వాళ్ల దిష్టి తగులుతోందని విమర్శించారు.

Reported by: Tejaswini Nanna | తెలంగాణ‌ | Nov 29, 2025, 3:06 pm IST
Read Time: 4 mins
Pawan Kalyan Vs Anirudh Reddy | దిష్టి మాది కాదు..మీది : పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు అనిరుధ్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్

విధాత, హైదరాబాద్ : కోనసీమ కొబ్బరి చెట్లు తెలంగాణ వాళ్ల దిష్టి తగిలి ఎండిపోతున్నాయని..రాష్ట్ర విభజనకు కోనసీమ పచ్చదనం కూడా ఓ కారణమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఓ రాష్ట్ర డిప్యూటీ సీఎం హోదాలో ఉండి పవన్ కళ్యాణ్ అలా మాట్లాడటం ఏంటి ? అని మండిపడ్డారు. అసలు మా హైదరాబాద్ కే ఏపీ వాళ్ల దిష్టి తగులుతోందని విమర్శించారు. ఏపీ వాళ్లు బాగుండకూడదు అని మేము నిజంగానే అనుకుంటే హైదరాబాద్ లో వాళ్లు ఉండగలుగుతారా? అని ప్రశ్నించారు. ఇక్కడి ప్రభుత్వ భూములను దోచుకునేదే వాళ్లు అని, వాళ్ళ లాగా ఒకరి కాళ్ళు పట్టుకోలేం, లంచాలు ఇచ్చి పని చేసుకోలేం అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ వాళ్లు ముక్కుసూటి మనుషులని అన్నారు. కోనసీమ కొబ్బరి తోటలు, పైర్లతో అందంగా ఉంటుందని అందరం అంటామని..అంతమాత్రాన దిష్టి తాకిందనడం సరైంది కాదని..అలాగైతే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ బాగుందని ఆంద్రోళ్లో దిష్టి తగిలించారని విమర్శించారు.

తెలంగాణ వాళ్లది నరదిష్టి అంటున్న పవన్ కల్యాణ్ మా రాష్ట్రంలో సినిమాలు ఎందుకు విడుదల చేస్తున్నారని, టికెట్ రూ.800లకు ఇక్కడ పెంచుకున్నారని..ఓ ఫ్యాన్ గా ఆయన సినిమాను చూశామన్నారు. తెలంగాణ వాళ్లు మంచివాళ్లు కాకపోతే హైదరాబాద్ లో ఎందుకుంటున్నావని..పోయి విజయవాడలో ఉండవచ్చు కదా అని పవన్ కల్యాణ్ కు చురకలేశారు. మా బతుకేదో మేం బతుకుతున్నామన్నారు. తెలంగాణలో ఆంధ్రా వాళ్లు ఉండటంలో ఇబ్బంది ఉందన్న పవన్ కల్యాణ్… ఏం ఇబ్బంది ఉందో చెప్పవచ్చన్నారు. తెలంగాణ వచ్చాక కూడా ఆంధ్రావాళ్లే బాగుపడుతున్నారన్నారు. కాంట్రాక్టర్లు, సినీ నిర్మాతలంతా వారే ఉన్నారని..అవినీతి, అక్రమాలలో వారే ఉన్నారని అనిరుధ్ రెడ్డి ఆరోపించారు. తప్పు చేసిన వాళ్లని పక్కా టార్గెట్ చేస్తామని, తెలంగాణ సెంటిమెంట్లను కించపరిస్తే సహించేది లేదన్నారు. ఏదో ఒకరోజు నాకు కూడా పెద్ద పదవి వస్తుందని..అప్పుడు అవినీతి కాంట్రాక్టర్ల వ్యవహారాన్ని బయటపెడుతానని వ్యాఖ్యానించారు.