హైలైట్స్:

  • తెరపైకి మరోసారి తెలంగాణ అస్తిత్వ సెగలు
  • పవన్ హైదరాబాద్ మీటింగ్ ఆంతర్యంమేంటి?
  • పవన్‌పై పొన్నం, కల్వకుంట్ల కవిత ఆగ్రహం
  • తెరవెనుక బీజేపీ వ్యూహముందంటూ పొన్నం విమర్శ

విధాత, ప్రత్యేక ప్రతినిధి:

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వేళ మరోసారి సెంటిమెంట్ సెగలు రగులుతున్నాయి. తెలంగాణ వ్యతిరేక ఆంధ్రా ఆధిపత్య రాజకీయ నేతలపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఆంధ్ర ఆధిపత్య శక్తులకు తొత్తులుగా వ్యవహరిస్తూ తెలంగాణ అస్తిత్వాన్ని మంటకలుపుతున్న ఇక్కడి వ్యక్తులూ, శక్తులపై కూడా భగ్గుమంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి జూన్ 2వ తేదీకి పుష్కరకాలం పూర్తవుతున్నప్పటికీ, ఇంకా ఇక్కడి ఆత్మగౌరవం, అస్తిత్వంపై దాడి కొనసాగుతోందనే ఆవేదన సర్వత్రా వ్యక్తమవుతోంది. రాష్ట్ర ఏర్పాటు, అధికారంతోపాటే తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బకొట్టే చర్యలు కూడా ప్రారంభమయ్యాయనే విమర్శలున్నాయి. ఈ విధానాలు కొన్ని సందర్భాల్లో బహిరంగంగా, మరి కొన్ని సందర్భాలు చాపకింద నీరులా సాగుతూ వస్తోందంటున్నారు. ఫక్తు తెలంగాణవాదులుగా చెప్పుకొనే వారి పాలనలోనే ఈ దయనీయ పరిస్థితి ప్రారంభమైందనే విమర్శలు ఇప్పటికీ ఉన్నాయి.

అవకాశ వాద విధానాల ఫలితం..

తెలంగాణవాదులుగా చెప్పుకొనే వారు కూడా తమ అధికారాన్ని కాపాడుకునేందుకు అనుసరించిన అవకాశవాద విధానాల ఫలితంగా తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవం ‘నినాదాలు’గా మిగిలిపోయాయనే విమర్శలున్నాయి. దీంతో గోతికాడి నక్కల్లా కాచుకుని కూర్చున్న తెలంగాణలోని సమైక్యవాదులు క్రమంగా రెచ్చిపోతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ శక్తులు ఇటీవల కాలంలో నెమ్మదిగా ఆధిపత్యాన్ని చెలాయించేందుకు చేస్తున్న ప్రయత్నాలపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. తెలంగాణలో జరుగుతున్న వరుస పరిణామాలు, ముఖ్యంగా ఆంధ్రప్రాంత నాయకుల విగ్రహాల ఏర్పాటు కలవరపరిచినప్పటికీ, సానుకూల ‘పాలకుల్లో’ కనీసం చలనం లేదు. తెలంగాణ వ్యతిరేకులుగా ముద్రపడి, ఇక్కడి నుంచి తరిమేసిన పార్టీలు, ఆంధ్రలోని కొన్ని పార్టీలు ఇక్కడ జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ప్రవేశించేందుకు ముహుర్తం ఫిక్స్ చేసినప్పటికీ వాతావరణం సానుకూలించలేదు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కొన్ని సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలూ, వైఎస్, రోశయ్య, ఎస్పీ బాలసుబ్రమణ్యం, ఎన్టీఆర్ విగ్రహాలు హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. గతంలో సీఎం మాట్లాడుతూ టీడీపీ పునాదులను తెలంగాణలో నాశనం చేసిన పార్టీని బొందపెట్టేవరకు నిద్రపోనంటూ చేసిన ఆవేశ ప్రసంగం, తాజాగా ఎన్టీఆర్ విగ్రహం సందర్భంగా మాట్లాడిన మాటలు, తాజాగా జరిగిన పరిణామాలు మరింత ఆజ్యం పోశాయి.

పవన్‌ కొత్త వివాదం

తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి మద్దతుగా జనసేన నేత పవన్ కల్యాణ్ ప్రచారం చేస్తారంటూ కార్యక్రమం ఫిక్స్ చేసిన తర్వాత ఆయన పర్యటన రద్దైన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో పవన్ కల్యాణ్, ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్, కేంద్ర మంత్రి, బీజేపీ నేత అమిత్ షాతో జరిగిందని చెబుతున్న మీటింగ్‌పై రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని సృష్టించాయి. నాగేశ్వర్ వ్యాఖ్యల తప్పొప్పులపై ఎవరైనా చర్చించవచ్చు. కానీ, తెలంగాణ ప్రాంత వ్యక్తికి ఆంధ్ర రాజకీయాలపై మాట్లాడే హక్కెక్కడిదంటూ కొందరు నాయకులు మాట్లాడిన తీరు విమర్శలకు తావిచ్చింది. నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యల అంశానికి ఇచ్చిన ప్రాధాన్యం వెనుక తెరవెనుక వ్యూహం ఉందనే విమర్శలు వెల్లువెత్తాయి. దశాబ్దాల ఉద్యమం, త్యాగాలతో ఏర్పడిన తెలంగాణ పైన, తెలంగాణ పాలకులపైన ఇప్పటికీ ఆంధ్ర ఆధిపత్య శక్తుల పెత్తనం సాగుతోందనే విమర్శలున్నాయి. వాటిని నిజం చేస్తూ తాజా పరిణామాలు సాగుతున్నాయనే ఆందోళన క్రమంగా పెరుగుతోంది.

రంగు బయటపెట్టుకున్న టీడీపీ

మొన్నటికి మొన్న మహానాడు వేదికగా తెలంగాణకు చెందిన వ్యక్తితో తడిగుడ్డతోనే తెలంగాణ గొంతుకోసేందుకు తెలంగాణ అనే పదం డిక్షనరీలో లేదని చెప్పించడం ఈ ప్రాంత ప్రజల మనోభావాలను కించపరిచే విధంగా ఉందనే వాదన సాగుతోంది. ఆ తర్వాత అమీర్‌పేట సెంటర్‌లో సీఎం రేవంత్ ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ చేయడంతో ఇంకొంత చర్చను తీవ్రం చేసింది. ఇదే సమయంలో మంత్రి లోకేశ్‌ తెలంగాణలో తిరిగి టీడీపీని బలోపేతం చేస్తామంటూ ప్రకటించడం పుండుమీద కారంచల్లినట్లుగా మారింది. దీనికి అనుసంధానంగా జనసేన నేత పవన్ కల్యాణ్ తెలంగాణలో తమ పార్టీని పటిష్టం చేస్తామంటూ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు 2వ తేదీన మీటింగ్ పెట్టుకోవడంతో ఇంకొంత అగ్గిరాజేసింది. ఈ మొత్తం పరిణామాలు ప్రణాళికబద్ధంగా జరుగుతున్నాయనే అభిప్రాయాలు పెరుగుతున్నాయి. దీనికి బీజేపీ మద్దతు కూడా ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు ఎన్డీఎ కూటమిలో భాగస్వామ్యమైన టీడీపీ, జనసేన ‘అండ’తో ముందుకుసాగాలనే తెరవెనుక వ్యూహంలో భాగామే తాజా పరిణామాలంటూ కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. ఎన్నికల రాజకీయాల్లో తెలంగాణ అస్తిత్వం అల్లకల్లోమవుతోందనే ఆవేదన కరుడుగట్టిన తెలంగాణవాదుల్లో ఇటీవల మరోసారి బలంగా వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో పవన్ పర్యటనపై మంత్రి పొన్నం ప్రభాకర్, టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత తీవ్రంగా ప్రతిస్పందిస్తూ బహిరంగ హెచ్చరికలు జారీ చేయడం విస్తృత చర్చకు దారి తీస్తోంది.

ఆవిర్భావ దినోత్సవం రోజే పవన్ పర్యటన అంతర్యం?

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన నేత పవన్ కల్యాణ్ హైదరాబాద్ వేదికగా నవనిర్మాణ సదస్సు పేరుతో పార్టీ మీటింగ్ ఏర్పాటు చేయడం తెలంగాణవాదులను తీవ్రంగా కలవరపరుస్తోందంటున్నారు. ప్రజాస్వామిక వ్యవస్థలో ఏ పార్టీ ఎక్కడైనా సభలు, సమావేశాలు నిర్వహించుకునేందుకు అవకాశం ఉన్నప్పటికీ తెలంగాణ ఉద్యమ ఫలితంగా ఇక్కడ తెరమరుగైన పార్టీలు, ఆంధ్ర నాయకుల నాయకత్వంలో సాగుతున్న పార్టీలో తిరిగి తెలంగాణ గడ్డపై రాజకీయాలు చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలు తెలంగాణవాదులను తీవ్రంగా కలవరపరుస్తోంది. ఈ నేతల రంగ ప్రవేశానికి అన్ని పార్టీల్లోని ఆంధ్రా అనుకూల ముఖ్యనేతల తీరే కారణమనే అభిప్రాయం, ఆగ్రహం తెలంగాణ అస్తిత్వవాదుల్లో వ్యక్తమవుతోంది. ఈ స్థితిలో ఎన్డీఏ కూటమి పేరుతో తెలంగాణలో బీజేపీ పట్టు సాధించేందుకు జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి ఇక్కడ పట్టు సాధించేందుకు యత్నిస్తున్నట్లుగా చర్చ సాగుతోంది. ప్రణాళిక ప్రకారం పావులు కదుపుతున్నట్లు భావిస్తున్నారు. వాస్తవానికి గత పదేండ్ల క్రితం నుంచే తెలంగాణ అస్తిత్వానికి చేయాల్సిన నష్టం చేస్తూ వచ్చారని, ఇప్పుడు కొనసాగింపు మాత్రమే అనే విమర్శలున్నాయి. ఈ స్థితిలో జనసేన నేత పవన్ మీటింగ్‌ తెలంగాణ వాదుల్లో ఆగ్రహానికి కారణమవుతోంది. మరీ రాష్ట్ర ఏర్పాటు రోజు పవన్ కల్యాణ్ ఇక్కడ మీటింగ్ పెట్టడమంటే ‘దాడి’ నేరుగా ప్రారంభించడంగా భావిస్తున్నారు. పైగా పలు సందర్భాల్లో తెలంగాణ వ్యతిరేకిగా తనకు తాను చెప్పుకొన్న పవన్ కల్యాణ్ తీరు ఇప్పుడు వివాదస్పదంగా మారుతోంది. తాజా పరిణామాల నేపథ్యంలో ఆయన సమావేశం జరుగుతుందా? లేదా? అనే చర్చ కూడా మరోవైపు సాగుతోంది. ఎన్నికల లెక్కలు, అధికార ఆటలో తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవంతో పాటు ఆటబొమ్మగా మారిందంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న రోజుల్లో స్వయం పాలన కూడా పరాయిగా మారేందుకు ఎంతో కాలం పట్టదంటున్నారు.