తెలంగాణ శత్రువు పవన్ కల్యాణ్ మరోసారి రాష్ట్రంలో నవ నిర్మాణ సభ పేరుతో వస్తున్నాడని, ఆంధ్రప్రదేశ్ లో సచివాలయం కట్టుకునే తెలివి లేనోడు మనల్ని ఉద్దరిస్తాడట అని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. నువ్వు సినిమా యాక్టర్ మాత్రమేనని, మా తెలంగాణలో ఇంటికో హీరో ఉన్నాడు అని..తెలంగాణలో విచ్చిన్నకర రాజకీయ కుట్రలు మానుకోవాలని… గో బ్యాక్ మిస్టర్ పవన్ కళ్యాణ్ అంటూ కవిత హెచ్చరించారు. ఇదివరకు ఒకసారి మాతో పెట్టుకున్నారు.. రాష్ట్రం వచ్చింది.. ఈసారి పెట్టుకుంటే మూతి పళ్ళు రాలుతాయి అని కవిత స్పష్టం చేశారు.
మీ రాజధానిలో, సీఎం కుర్చీ కింద నీళ్లు రాకుండా చూసుకోండి
“తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు – సాధన” రౌండ్ టేబుల్ సమావేశంలో కవిత మాట్లాడారు. ఆంధ్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నానని, అసలే వానాకాలం వస్తుంది అని, మీ సెక్రటేరియట్ లో, మీ అమరావతిలో, మీ ముఖ్యమంత్రి కుర్చీ కింద నీళ్లు రాకుండా చూసుకోండి ఫస్ట్ అని, ప్రతి వానాకాలం అక్కడ క్యాపిటల్ మునుగుడేనని కవిత ఎద్దేవా చేవారు. 13ఏళ్లు అయినా మీకు రాజధాని కట్టుకోవడం చేతకాదు కానీ, తెలంగాణ నవనిర్మాణం చేస్తావా? అని విమర్శించారు. మా పని మేము చేసుకుంటాం.. ముందు మీ పని చూసుకోండని కవిత చురకలేశారు . లోకేష్ , పవన్ కళ్యాణ్ ముందు మీ సెక్రటేరియేట్‌లోకి వాన నీళ్లు రాకుండా చూసుకోండని హితవు పలికారు. ప్రతి వర్షాకాలంలో మీ రాజధాని మునిగిపోతుంటే అది ఆంధ్ర ప్రజలకు అవమానకరం అన్నారు. 80వేల ఎకరాల భూమిని సేకరించి రైతులను నష్టపరుస్తూ అక్కడి ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందన్నారు. దీనిపై మేం మాట్లాడుతామని, ఇక్కడి సీఎం ఎలాగైతే ఏపీ నాయకుల విగ్రహాలు పెట్టిస్తున్నారో మీరు కూడా ఏపీలో మా జయశంకర్, శ్రీకాంత్ చారి విగ్రహాలు పెట్టాలని డిమాండ్ చేశారు. జనసేన, టీడీపీలు తెలంగాణలో విద్వేష రాజకీయాలు చేస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు.
అక్కడేం చేయలేదు..ఇక్కడేం ఉద్దరిస్తారు..?
ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ మంత్రులు ఆపరేషన్ల కోసం హైదరాబాద్ వస్తున్నారని, గత 12 ఏళ్లుగా అక్కడ కనీసం ఒక మంచి హాస్పిటల్ కూడా కట్టుకోలేకపోయారని కవిత చురకలంటించారు. ముందు మీ రాష్ట్రంలో మౌలిక వసతులు, వైద్య సదుపాయాలు మెరుగుపరిచి తర్వాత తెలంగాణ గురించి మాట్లాడండన్నారు. తెలంగాణ ఏర్పాటును నిరసిస్తూ 11రోజులు అన్నం తినలేదని చెప్పిన పవన్ కల్యాణ్ కు తెలంగాణలో సభ ఎందుకు అని ప్రశ్నించారు. తెలంగాణలో టీడీపీ, జనసేన విస్తరిస్తుందని లోకేశ్, పవన్ చెబుతున్నారని, విస్తరించడానికి సామ్రాజ్యాలు లేవు అని, ఇక్కడ ఉన్నది చైతన్యవంతమైన తెలంగాణ అని కవిత హెచ్చరించారు.
ఇటీవల తెలంగాణ టీడీపీ నాయకుడొకరు తెలంగాణ పదం డిక్షనరీలో లేదని అన్నాడని, మెడకాయ మీద తలకాయ ఉన్నోడు ఎవడైనా తెలంగాణ పదం డిక్షనరీలో లేదని అంటాడా? అని కవిత ప్రశ్నించారు. రాజ్యాంగ బద్దంగా తెలంగాణను మనం సాధించుకున్నాం.. రాజ్యాంగం తెలంగాణను ఇచ్చిందని గుర్తు చేశారు. తెలంగాణలో ఏపీ సెటిలర్లను కడుపులోపెట్టి చూసుకున్నాం అని, చూసుకుంటాం అని..ఇక్కడ ఆంధ్ర పాలకుల అవసరం లేదన్నారు.
ఉప్పల్ భగాయత్ భూములు పంచకపోతే జూలై 2న ఆక్రమణ
తెలంగాణ రక్షణ సేన నాయకులు ప్రతి గ్రామంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించాలని, ఉద్యమకారులను సన్మానించుకోవాలని కవిత పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీల అమలు సాధనకు టీఆర్ఎస్ పోరాడుతుందన్నారు. కేకే కమిటీ అంటేనే కాలయాపన కమిటీ అని కవిత ఆరోపించారు. ఉప్పల్ భగాయత్ లో ప్రభుత్వం భూమి 350ఎకరాలు ఉందని, నెల రోజుల్లో ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వాటిని ఉద్యమకారులకు పంచాలని డిమాండ్ చేశారు. లేనట్లయితే జూలై 2న ఆ భూముల్లో ఆవాసాలు ఏర్పాటు చేసుకుని వంటవార్పు చేస్తాం అని ప్రకటించారు. కేసులు ఉన్నవాళ్లకైనా తొలి ధఫాగా స్థలాలు ఇవ్వాలని సూచించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం 500మంది వరకే పరిమితం చేసిందని, అయితే 1200మంది ఉద్యమకారులతో పాటు 1969 ఉద్యమకారులను గుర్తించి ఆదుకోవాలన్నారు.