కొత్త పార్టీ సన్నాహాలు…కాశీలో కవిత పూజలు

కొత్త పార్టీ ఏర్పాటు ముందు కాశీ విశ్వనాథుడిని దర్శించుకున్న కవిత ప్రత్యేక పూజలు చేశారు. ఈ నెల 25న కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.

విధాత, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కాశీ (వారణాసి) విశ్వనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
ఈనెల 25న రాజకీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్న నేపథ్యంలో ఆమె కాశీ విశ్వనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్బంగా కవిత మాట్లాడుతూ..కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయడానికి ముందు మేము గంగామాతను దర్శించుకోవాలని భావించాం అని తెలిపారు. నిరంతరం ప్రవహిస్తూనే ఉండాలని గంగామాత మనకు బోధిస్తుంది, మనకు స్ఫూర్తినిస్తుంది అని, అదే రీతిలో మా పార్టీ కూడా నిరంతరం ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. ఈ నెల 25వ తేదీన మేము పార్టీని ప్రారంభించబోతున్నాం అని, అందుకే, ఒక వారం ముందుగానే మేము ఇక్కడికి వచ్చామని తెలిపారు. తెలంగాణ కోసం, అలాగే పరోక్షంగా దేశం కోసం మా పార్టీ పనిచేస్తుందని పేర్కొన్నారు.

మహిళ రిజర్వేషన్ బిల్లుకు, డీలిమిటేషన్ కు లింక్ సరికాదు

మహిళా రిజర్వేషన్ బిల్లు, ప్రతిపాదిత నియోజకవర్గాల పునర్విభజన బిల్లకు పరస్పరంఎటువంటి సంబంధం లేదు అని, కానీ ప్రస్తుత ప్రభుత్వం, మహిళా రిజర్వేషన్ బిల్లు ముసుగులో నియోజకవర్గాల పునర్విభజనను ప్రవేశపెట్టడానికి కేంద్రం ప్రయత్నించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఈ పునర్విభజన వల్ల దక్షిణ భారతదేశానికి తీవ్రమైన నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దక్షిణ భారత రాష్ట్రాలన్నీ తమ హక్కుల కోసం పోరాడుతాయని, ఒకవేళ రాజకీయ ప్రాతినిధ్యం తగ్గిపోయి, దక్షిణాదికి తక్కువ సీట్లు లభిస్తే, అభివృద్ధి ఫలాల్లో దక్షిణాదికి తగిన వాటా దక్కదు అని, అందుకే, దక్షిణ భారత రాష్ట్రాలన్నీ దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయన్నారు. . ఉత్తర భారత రాష్ట్రాల్లో ఉన్న మా సోదరులు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం అన్నారు.

తేజస్వీ సూర్య వ్యాఖ్యలు ఖండనీయం

తెలంగాణ రాష్ట్రా సాధనకు ఈ ప్రాంత ప్రజలు ఆరు దశాబ్దాలుగా పోరాడారని, ఆత్మబలిదానాలు, ఉద్యమాలతో సాగించుకున్న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పాకిస్తాన్ ఏర్పాటుతో పోల్చి మా ప్రజలను అవమానించడానికి కర్ణాటక బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్యకు ఎంత ధైర్యం అని కవిత మండిపడ్డారు. తెలంగాణను సాకారం చేయడానికి తమ ప్రాణాలను త్యాగం చేసిన వేలాది మంది అమరుల స్మృతిని కూడా ఆయన అగౌరవపరిచారని, తేజస్వీ వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు స్పందించాలని కవిత డిమాండ్ చేశారు. లేదంటే మీ ఎంపీ పదవులకు రాజీనామా చేయండని కవిత వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజల భావోద్వేగాల పవిత్రతను నిలబెట్టలేకపోతే మీకు తెలంగాణ ప్రజలకు ప్రాతినిధ్యం వహించే అర్హత లేదని కవిత పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి :

ఉద్యోగుల డిమాండ్లపై 17న తహశీల్దార్లకు వినతులు: లచ్చిరెడ్డి
దేశ చరిత్రలో మహిళ రిజర్వేషన్ బిల్లు కీలక ఘట్టం: ప్రధాని మోదీ

Latest News