- బెంగాల్, తమిళనాడు పోలింగ్ ముగిశాక వాతలే వాతలు
- పెట్రోల్‌పై రూ.18, డీజిల్‌పై రూ.15 పెంచుతారని ప్రచారం
- ధరల పెంపుపై బీజేపీ సర్కార్ డ్రామాలు
- నష్టాలతో నెట్టుకొస్తున్న పెట్రోలియం కంపెనీలు
విధాత, హైదరాబాద్:
అంతర్జాతీయ మార్కెట్‌లో ఇంధనం ధరలు ఇలా పెరగడం.. అలా భారతదేశంలోని ఇంధన కంపెనీలు ఇలా ధరలు పెంచేయడం చాలా అరుదు. మనకు తెలియకుండా పైసల చొప్పున పెంచుతూ పోతుంటాయి. విశేషం ఏంటంటే.. ఇరాన్ యుద్ధంతో అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు మండుతున్నా.. భారతదేశంలో మాత్రం చమురు కంపెనీలు ధరలు పెంచడం లేదు. దీనికి కారణం.. ప్రస్తుతం భారతదేశంలో కొనసాగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎన్నికలు ముగియగానే పెట్రో ధరల మంటలు తప్పదని అంచనా వేస్తున్నారు. ఎల్పీజీ సిలిండర్ ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. గతంలో ఎన్నికల సమయంలో ధరల పెరుగుదలను నిలిపివేసి.. ఎన్నికలు పూర్తయ్యాక ధరలు అమాంతం పెంచేసిన ఉదంతాలను పలువురు ప్రస్తావిస్తున్నారు.
ఇప్పటికే లీటర్ పెట్రోల్‌పై రూ.18, డీజిల్‌పై రూ.35 వరకు నష్టాలు వస్తున్నాయని పెట్రోలియం కంపెనీలు కొద్ది రోజులుగా సణుగుతున్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆదేశిస్తే తప్ప పెంచలేని నిస్సహాయ స్థితిలో పెట్రోలియం కంపెనీలు ఉన్నాయి. ఎన్నికల తంతు ముగియగానే ధరలు పెంచేందుకు కంపెనీలు ప్రణాళికలు సిద్ధం చేసుకుని ఉన్నాయని పెట్రోల్ డీలర్ల సంఘం నాయకుడు ఒకరు తెలిపారు. ధరలు ఎందుకు పెంచుతున్నారని ప్రశ్నిస్తే పశ్చిమాసియాలో నెలకొన్న విపత్కర పరిస్థితులు కారణంగా చూపుతున్నారు.
హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ.107.46 కాగా డీజిల్ ధర 95.70కు విక్రయిస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం కంపెనీల ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇరాన్ దేశంపై అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు విరుచుకుపడుతున్న కారణంగా హార్మూజ్ జలసంధి నుంచి ఇంధన నౌకల రాకపోకలు దాదాపు స్తంభించిపోయాయి. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు బ్యారెల్ కు రూ.120 చేరుకోవడంతో దేశంలో మూడు ప్రభుత్వ రంగ కార్పొరేషన్లు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నాయని ప్రచార, ప్రసార సాధనాలు ఊదరగొడుతున్నాయి.
యుద్ధం ప్రారంభానికి ముందు బ్యారెల్ ధర 70 డాలర్లకు పైగా ఉంది. భారతదేశం 88 శాతం క్రూడాయిల్‌ను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నది. మార్చి నెలాఖరులో కేంద్ర ప్రభుత్వం ఇంధన ఉత్పత్తులపై ఎక్సైజ్ సంకాలను తగ్గించింది. ఆ ప్రయోజనాలను ఆయిల్ కంపెనీలు వినియోగదారులకు బదిలీ చేయకుండా తమ నష్టాలను పూడ్చుకుంటున్నాయి. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాలలో జరగనున్న ఎన్నికల్లో గెలుపొందడం కోసం ఎక్సైజ్ సుంకాలను తగ్గించింది. ఈ నిర్ణయం వెలువడగానే రాష్ట్ర బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం కూడా పన్నులు తగ్గించాలని ఉచిత సలహా ఇచ్చారు.
నడ్డి విరిచేలా భారం?
చివరి దశ ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే ధరలు పెరుగుతాయన్న చర్చలు డీలర్లలో వినిపిస్తున్నాయి. ఆ ధరల పెంపు కూడా వాహనదారుల నడ్డి విరిచే విధంగా ఉంటుందని డీలర్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికే ప్రైవేటు కంపెనీలు ధరలు పెంచాయని, ప్రభుత్వ రంగ సంస్థలది పెండింగ్‌లో ఉందని చెబుతున్నారు.
బీజేపీ డ్రామా!
వాస్తవానికి ప్రతి నిత్యం లెక్కలు వేసుకునిమరీ ఏమాత్రం నష్టాలు వస్తున్నా ఆలస్యం చేయకుండా అదే రోజు ధరలను ఆయిల్ కంపెనీలు పెంచేసేవి. వినియోగదారులకు సెగ తగలకుండా పైసల చొప్పున పెంచుతూ వస్తున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో అదికూడా ఆగిపోయిందని చెబుతున్నారు. ఫలితాలు ఎలా ఉంటాయో తెలియక అయోమయంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం.. ఆయిల్ కంపెనీలను బుజ్జగిస్తున్నదని సమాచారం. ఎన్నికలయ్యాక మీ ఇష్టం అనే విధంగా సంకేతాలు ఇచ్చినట్లు ప్రచారం సాగుతోంది. కొద్ది సంవత్సరాలుగా బీజేపీ ఇంధన ధరల పెంపు, తగ్గుదలలో తమ ప్రమేయం ఏమీ లేదని నాటకాలాడుతున్నది. నష్టాలు వస్తే పెంచుతాయని, అంతర్జాతీయ మార్కెట్ క్రూడాయిల్ ధరలు తగ్గుముఖం పడితే కాస్త ఉపశమనం ఇస్తాయని చెప్పుకొస్తున్నాయి. ప్రస్తుతం యుద్ధం జరుగుతున్న తరుణంలో బ్యారెల్ క్రూడ్ ధరలు 120కి చేరుకున్నా ఆయిల్ కంపెనీలు పెంచకపోవడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఉన్న సంకేతాలే కారణమన్న అభిప్రాయాలు ప్రతిపక్ష పార్టీల్లో వ్యక్తమవుతున్నాయి. అందుకే తప్పని పరిస్థితుల్లో నష్టాలు భరిస్తున్నాయని, పోలింగ్ కాగానే ఆ నష్టాలను ప్రజల నుంచి ముక్కుపిండి వసూలు చేయడం ఖాయంగా కన్పిస్తున్నదని చెబుతున్నాయి.
