బెంగాల్‌లో ఇక బీజేపీతో ఢీ కొట్టేదెవరు?
బీజేపీ పాలనలోకి వచ్చిన బెంగాల్‌లో బలమైన ప్రతిపక్షంగా టీఎంసీ నిలబడగలదా? ఏర్పడే రాజకీయ శూన్యతను కాంగ్రెస్, వామపక్షాలు భర్తీ చేయడానికి ప్రయత్నించగలవా?
- మరో ఐదేళ్లలో మమత బలహీనం
- కాంగ్రెస్ పార్టీ అయినా పుంజుకునేనా!
- అధిర్ రంజన్ ఓటమి కాంగ్రెస్‌కు మైనస్
- సీపీఎం పూర్వ వైభవం సాధించగలదా?
విధాత, హైదరాబాద్:
పశ్చిమ బెంగాల్ రాజకీయాలను కొన్ని దశాబ్దాలుగా సీపీఎం, టీఎంసీ శాసిస్తూ వచ్చాయి. సీపీఎం పూర్తిగా నిస్తేజమవ్వగా.. ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ కూడా అదే బాట పడుతుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మున్ముందు జరిగే ఎన్నికల్లో బీజేపీని ఢీకొట్టే సత్తా, శక్తియుక్తులు ఏ పార్టీకి ఉంటుందనేది ఇకనుంచి బెంగాల్ ప్రజలను వేధించే ప్రధాన సమస్యకానున్నదని అంటున్నారు.
పదిహేను సంవత్సరాల పాలనలో తృణమూల్ కాంగ్రెస్ పెద్ద ఎత్తున ప్రతిపక్షాలపై నిర్బంధానికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు బీజేపీ సైతం అదే బాటలో పయనించి.. ఎక్కడికక్కడ టీఎంసీ శ్రేణులను ముప్పుతిప్పలు పెట్టే చర్యలకు దిగబోదనే గ్యారెంటీ ఏమీ లేదని రాజకీయవర్గాలు అంటున్నాయి. సీపీఎం తరువాత అధికారం చేజిక్కించుకున్న మమతా బెనర్జీ సీపీఎం పార్టీ నాయకులను వార్డు స్థాయి వరకు సామ భేద దాన దండోపాయాలను ఉపయోగించి తనవైపు తిప్పుకున్నది. రాజకీయ ఒత్తిళ్లు.. సంక్షేమ పథకాలు కారణంగా అనేక మంది తృణమూల్ వైపు మళ్లారు. కొందరు రాజకీయాల నుంచే తప్పుకొన్నారు. వామపక్ష ఓటర్లలోనూ అదే ధోరణి కనిపించింది.
80కిపైగా సీట్లతో బలమైన ప్రతిపక్షంగానే ఉన్నప్పటికీ.. ఆ బలాన్ని బీజేపీ నిలువనిస్తుందా? అనే సందేహాలూ ఉన్నాయి. అధికారంలోకి రావడంతో భవిష్యత్తులో తమకు అడ్డు లేకుండా ఉండేందుకు టీఎంసీ కార్యకర్తలను తమవైపు తిప్పుకొనేందుకు ఏ అవకాశాన్ని కూడా వదిలిపెట్టదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి ఇప్పుడు బీజేపీ కీలక నాయకుడిగా ఉన్న సువేందు అధికారి ఒకప్పుడు కట్టర్ తృణమూల్ నాయకుడని అందరికీ తెలిసిందే. అదే తీరులో పోలీసు, అధికార ప్రయోగం ఉపయోగించి టీఎంసీ పార్టీని కాకావికలం చేసే ప్రయత్నం చేస్తారనే ఆందోళనలు ఉన్నాయి. ఒకవేళ ఆ సాహసానికి దిగనట్లయితే వచ్చే ఎన్నికల నాటికి టీఎంసీ ఎంతోకొంత పుంజుకునే అవకాశం లేకపోలేదని అంటున్నారు.
ఈ పరిస్థితి జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌కు అందివచ్చిన అవకాశంగా మారుతుందనే అంచనాలూ వెలువడుతున్నాయి. ఈ సమయంలో రాష్ట్ర నాయకత్వాన్ని పటిష్టం చేసుకోవాల్సిన బాధ్యత రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రాలపై ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీజేపీ సమ ఉజ్జిగా కాంగ్రెస్ శ్రేణులను సిద్ధం చేయడంతో పాటు రాష్ట్ర నాయకత్వానికి స్వేచ్చ, అధికారాలు ఇవ్వాల్సిన బాధ్యత కాంగ్రెస్ అగ్రనాయకత్వంపై ఉందంటున్నారు.
పశ్చిమ బెంగాల్‌లో 293 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. బీజేపీ 207, టీఎంసీ 80, కాంగ్రెస్ 2, సీపీఎం 2, ఇతరులు ఇద్దరు చొప్పున గెలుపొందినట్టు తాజా సమాచారం చెబుతోంది. బంగ్లాదేశ్‌కు పొరుగున ఉన్న పశ్చిమ బెంగాల్‌లో పాగా వేయాలని గత ఐదు సంవత్సరాలుగా బీజేపీ జాతీయ నాయకత్వం సర్వ శక్తులను ఒడ్డుతున్నది. ఒకప్పుడు టీఎంసీలో కీలకంగా పనిచేసిన సువేంధు అధికారిని తమ పార్టీలో చేర్చుకుని, మమతా బెనర్జీకి సవాల్ విసిరింది. గత ఎన్నికల్లో మమతా బెనర్జీని ఓడించిన సువేంధు అధికారి, ఈ ఎన్నికల్లో ఏకంగా మమత ప్రభుత్వాన్నే ఇంటికి పంపించారు. ఈ గెలుపులో కమల దళంతో పాటు సోషల్ మీడియా సైన్యం ప్రముఖ పాత్ర పోషించాయనడంలో ఏమాత్రం సందేహం లేదు.
మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన మమతా బెనర్జీ మిగతా రాష్ట్రాలతో పోల్చితే అభివృద్ధిలో పూర్తి వెనకంజలో ఉన్నారు. మమతా బెనర్జీ వేధింపులు, టీఎంసీ కార్యకర్తల గుండాయిజానికి భయపడి వందలాది కంపెనీలు బెంగాల్‌ను వీడాయని గత కొన్ని సంవత్సరాలుగా ప్రచారం జరుగుతోంది. అలా రాష్ట్రం వీడి వెళ్లిన కంపెనీల జాబితాను సోషల్ మీడియాలో వైరల్ చేయడంలో కాషాయ దళాలు విజయవంతం అయ్యాయి. నాలుగోసారి మమతా బెనర్జీ అధికారంలోకి వస్తే మీ ఇళ్లు, వాకిలి ఒక వర్గం వారు కబ్జా చేస్తారనే ప్రచారాన్ని జనంలోకి బలంగా తీసుకెళ్లడంలో బీజేపీ సక్సెస్ అయిందని అంటున్నారు. ఎన్నడూ లేని విధంగా ఎక్కువ సంఖ్యలో ప్రజలు పోలింగ్ బూతులకు వచ్చి ఓట్లేయడంతో ఊహించని విధంగా పోలింగ్ శాతం 93 వరకు నమోదు అయ్యింది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో గతంలో మాదిరి నాలుగైదు దశలలో కాకుండా రెండు దశలలో మాత్రమే అసెంబ్లీ ఎన్నికలు సాగేలా బీజేపీ జాగ్రత్త పడిందని అంటున్నారు.
రాష్ట్ర పోలీసులతో ఏమాత్రం సంబంధం కేంద్ర బలగాలను రంగంలోకి దించి కఠినంగా వ్యవహరించారు. టీఎంసీ క్యాడర్‌ను అష్టదిగ్బంధం చేశారు. దేశంలోనే తొలిసారిగా కౌంటింగ్ కేంద్రాలలో ఎన్నికల పరిశీలకులతో పాటు కేంద్ర ప్రభుత్వానికి చెందిన మైక్రో అబ్జర్వర్లను నియమించారు. మైక్రో అబ్జర్వర్ల నియామకంపై మమతా బెనర్జీ సుప్రీంకోర్టు వరకు వెళ్లినప్పటికీ అనుకూలంగా తీర్పు రాలేదు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) లో భాగంగా 90.66 లక్షల ఓటర్లను తొలగించారు. ఇందులో చనిపోయిన వారు, ఇతర దేశాల నుంచి వచ్చిన వారు, ఇతర రాష్ట్రాలు, జిల్లాలలో ఓటు హక్కు కలిగిన వారు, అనర్హులు ఉన్నారని కేంద్ర ఎన్నికల కమిషన్ చెబుతోంది. ఈ అంశాలన్నీ బీజేపీకి కలిసి రాగా, టీఎంసీ పార్టీకి శాపంగా పరిణమించాయి.
రాష్ట్ర చరిత్రలో 1977 వరకు కాంగ్రెస్ పార్టీ, బంగ్లా కాంగ్రెస్ పార్టీలు అధికారం చేపట్టాయి. 1977 సంవత్సరం జూన్ నెలలో జరిగిన ఎన్నికల్లో తొలిసారి జ్యోతిబసు నాయకత్వంలో సీపీఎం నేతృత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్ అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి 2011 మే నెల వరకు ఆ కూటమి అధికారంలో ఉంది. 2011 మే నెలలో తొలిసారి అధికారంలోకి వచ్చిన మమతా బెనర్జీ మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో పరాజయాన్ని చవిచూశారు.
ఈ పరిణామాలను ఒకసారి పరిశీలిస్తే సీపీఎం పార్టీ ఇప్పట్లో కోలుకుంటుందా? అనేది అనుమానమే. మమతా బెనర్జీ వయస్సు ఏడు పదులు దాటింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఆమె ఆరోగ్యం ఇప్పుడున్నంత గట్టిగా ఉండదనే అంచనాలు ఉన్నాయి. అధికారం కోల్పోవడం, బీజేపీ ప్రభుత్వం వేధింపుల కారణంగా ఆమె నైతికశక్తి క్షీణించవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ దశలో బీజేపీ ప్రభుత్వాన్ని ఢీకొట్టే సత్తా ఏ పార్టీకి ఉందనేది ప్రశ్నార్థకంగా ఉంది. దేశంలో కమ్యూనిస్టు పార్టీలు బలంగా లేకపోవడం, ఉన్న ఒక్క కేరళం కూడా ఓడిపోవడం పెద్ద మైనస్ గా మారింది. టీఎంసీకి పోటీగా ప్రాంతీయ పార్టీలు కూడా లేవు. ప్రత్యామ్నాయం కన్పిస్తున్నది ఒక్క జాతీయ పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని, అయితే.. బీజేపీని నిలువరించగలగాలంటే సుదీర్ఘ ప్రణాళికతో శ్రమించాల్సి ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
గత దశాబ్దకాలంగా మమతా ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అధిర్ రంజన్ చౌధురీ పోరాడుతూ వస్తున్నారు. తాజా ఎన్నికల్లో బహరాపూర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి సుబ్రతా మైత్రా చేతిలో అధిర్ ఓటమిపాలయ్యారు. రాష్ట్ర ఓటర్లకు సుపరిచితుడు అయిన అధిర్ ఓటమి కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టం అని అంటున్నారు. ఈ స్థాయిలో పేరు ఉన్న నాయకుడు పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ పార్టీ లో లేరనే వాదన కూడా ఉంది.
రాజకీయాలలో యాక్టీవ్ గా ఉన్నా ఈయన వయస్సు కూడా ఏడు పదులు దాటడం కూడా మైనస్ గా చెప్పుకోవాలి. ఈ పరిస్థితులను గమనిస్తే బీజేపీకి రాష్ట్రంలో మున్ముందు ప్రత్యామ్నాయం లేకుండా పోయిందా? అనే విధంగా పరిస్థితులు తయారవుతాయనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. టీఎంసీ కానీ, కాంగ్రెస్ కానీ బలమైన నాయకులను తయారు చేసుకుంటే తప్ప వచ్చే ఎన్నికల నాటికి బీజేపీని ఢీ అంటే ఢీ అనే పరిస్థితి లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సీపీఎం, ఇతర వామపక్షాలు కూడా పూర్వ వైభవానికి ప్రయత్నం చేస్తే ఎంతో కొంత ఫలితం వచ్చే అవకాశాలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. అయితే.. ఆ ప్రయత్నాలను బీజేపీ సాగనిస్తుందా? అనేది పెద్ద ప్రశ్నగానే ఉంది. దీనికి భవిష్యత్తే సమాధానం చెప్పాలి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram