హైలైట్స్:

  • 80 మంది ఎమ్మెల్యేల్లో భేటీకి సగం మంది డుమ్మా
  • పార్టీ గుర్తింపు చిహ్నం చేజారే ప్రమాదం..
  • ఎమ్మెల్యే హాస్టల్‌లో సమావేశమైన వ్యతిరేక వర్గం
  • ఇక మమతకు కంటినిండా కునుకు కరువే

ప్రాంతీయ పార్టీలను ఖతం పట్టించే పనికి మరోసారి బీజేపీ పూనుకొంటున్నదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవలి ఎన్నికల్లో పశ్చిమబెంగాల్‌లో అధికారంలోకి వచ్చిన బీజేపీ.. అప్పటివరకూ రాష్ట్రాన్ని అప్రతిహతంగా పాలించిన టీఎంసీని రాజకీయ సమాధి చేసే ప్రయత్నాల్లో నిమగ్నమైందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఇప్పటికే అధికారం కోల్పోయి ఉక్కిరిబిక్కిరి అవుతున్న తృణమూల్‌ కాంగ్రెస్‌.. బీజేపీ ఎత్తుగడలతో మరింత నీరసించిపోయేలా కనిపిస్తున్నది. మొన్నటికి మొన్న మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్‌ అధినేత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, పార్టీలో నెంబర్‌ టూగా చెలామణి అవుతున్న ఎంపీ అభిషేక్‌ బెనర్జీని ఒక గ్రామంలో ప్రజలు వెంటబడి తరిమి, కోడిగుడ్లు, రాళ్లతో దాడి చేసిన విషయం తెలిసిందే. సరిగ్గా పదిహేనేళ్ల క్రితం కూడా టీఎంసీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాల్లో సీపీఎం శ్రేణులను ఇదే టీఎంసీ శ్రేణులు వెంటాడి, వేధించి చంపాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఉంటే టీఎంసీలో ఉండాలి.. లేదంటే పైకి పోవడమేనన్న స్థాయిలో అరాచకాలు జరిగాయని చెబుతుంటారు. ఇక అవినీతి సంగతి సరేసరి. ఈ నేపథ్యంలోనే టీఎంసీ పాలనకు చరమగీతం పాడేరనే అభిప్రాయాలు ఉన్నాయి. సర్‌ పేరుతో యథేచ్ఛగా ఓటర్లను తొలగించారనే వాదన కూడా ఉన్నప్పటికీ.. మమతా బెనర్జీ పాలన ప్రజల్లో భయాన్ని నెలకొల్పిందని, అందుకే ఆమెను ఓడించారనే అభిప్రాయాలు ఉన్నాయి. ఇప్పుడు అదే పునరావృతం అవుతుందా? అనే భయాలు వ్యక్తమవుతున్నాయి. వచ్చిన అధికారాన్ని తలకెక్కించుకుంటే జరిగే పరిణామాలు ఇలానే ఉంటాయన్న వాస్తవాలను రాజకీయ పార్టీలు గుర్తించాలని విశ్లేషకులు అంటున్నారు.

పావులు కదుపుతున్న బీజేపీ

పశ్చిమబెంగాల్‌లో రాజకీయ పరిణామాలను గమనిస్తే.. మమతా బెనర్జీ పార్టీని క్రమంగా బలహీనపర్చే లక్ష్యంతో బీజేపీ వ్యూహాలు రచిస్తున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సోమవారం కోల్‌కతాలోని హోటల్‌ గేట్‌వేలో నిర్వహించిన టీఎంసీ శాసనసభాపక్ష సమావేశానికి 50 మందికి పైగా ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడం రాష్ట్రంలో సంచలనం రేపింది. అభిషేక్ అరాచకాలు, వేధింపులు, అక్రమాలపై విసుగు చెందిన పలువురు ఎమ్మెల్యేలు తమ ఆగ్రహాన్ని ఈ రూపంలో చూపిస్తున్నారనే వాదన వినిపిస్తున్నది. కుటుంబ పెత్తనం, ఒంటెత్తు పోకడలు, సీనియర్లకు గౌరవం ఇవ్వకపోవడం మూలంగా పార్టీ మనుగడ కష్టమని వ్యాఖ్యానిస్తున్నరు. ఐ ప్యాక్ కన్సల్టెన్సీ సాయం తీసుకోవడాన్ని కూడా చాలా ఎమ్మెల్యేలు జీర్ణించుకోవడం లేదు. ఈ సమావేశానికి కేవలం ఇరవై మంది ఎమ్మెల్యేలు మాత్రమే హాజరయ్యారు.

దెబ్బతింటే టీఎంసీకి పూర్వవైభవం కష్టమేనా?

కమ్యునిస్టులకు ఒక సిద్ధాంతం, నిబద్ధత ఉంటుందని, ప్రజలు ఈ రోజు కాకపోయినా రేపు అయినా ఆ పార్టీని ఆదరిస్తారని, టీఎంసీని పూర్వస్థితికి తీసుకురావడం కష్టమని పలువురు రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ పరిస్థితులను అవలోకనం చేసుకున్న బీజేపీ నాయకత్వం టీఎంసీ మూలాలను పెకిలించే దిశగా అడుగులు వేస్తున్నదని అంటున్నారు. టీఎంసీ శ్రేణులపై సామ బేధ దాన దండోపాయ విద్యలను ప్రయోగించే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. మమతా బెనర్జీ వయస్సు ఏడు పదులు దాటడం కూడా బీజేపీ కలిసి వచ్చే అవకాశంగా చెబుతున్నారు. తమిళనాడు రాష్ట్రంలో అన్నా డీఎంకే, మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీని బలహీనపర్చిన విధంగానే బెంగాల్‌లో టీఎంసీని కోలుకోని స్థితికి తీసుకువెళ్లడం ఖాయమని రాజకీయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఏక్‌నాథ్‌ షిండే ఎవరో

మహారాష్ట్రలో ఏకనాథ్ షిండేను ప్రయోగించిన విధంగా పశ్చిమ బెంగాల్‌లో కూడా టీఎంసీలో గట్టి నాయకుడిని ప్రయోగించి, ఆ పార్టీని ముక్కలు చేసే అవకాశాలు లేకపోలేదని చెబుతున్నారు. 80 మంది ఎమ్మెల్యేలు, 18 మంది ఎంపీలలో సగం మందిని చీల్చేందుకు మంతనాలు కూడా పూర్తయ్యాయని సమాచారం. ఇలా చీలిపోయిన వర్గంతో కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయించి, రెండాకుల పువ్వు గుర్తును తమకే కేటాయించాలని కోరే అవకాశం ఉందనే వార్తలు బెంగాల్‌ మీడియాలో వస్తున్నాయి. ఇప్పటికే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ఎమ్మెల్యేలు సాందిపన్ సాహ, రితబ్రతా బెనర్జీని టీఎంసీ నుంచి బహిష్కరించారు. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు కొలకతాలోని ఎమ్మెల్యే హాస్టల్‌లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరు కావడం మమతా బెనర్జీకి కంటినిండా కునుకు లేకుండా చేస్తున్నది. ఈ సమావేశం పార్టీ గుర్తు, చీలికపై ప్రధానంగా చర్చ జరిగిందంటున్నారు. పార్టీ అధికార ప్రతినిధి రిజు దత్తా నాయకత్వంపై విమర్శల ధాటి పెంచి ప్రజల్లో పార్టీ పట్ల ఏహ్యభావం కలిగేలా ప్రకటనలు గుప్పిస్తున్నారు. మొత్తానికి బీజేపీ తనకు బాగా అలవాటైన రాజకీయ క్రీడను ఇక్కడ ప్రవేశపెడుతున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.