విధాత, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న నియోజకవర్గాల పునర్విభజనతో దేశం నిట్టనిలువునా చీలిపోతుందని పలువురు న్యాయ నిపుణులు, సీనియర్ పాత్రికేయులు, రాజకీయ నాయకులు అన్నారు. మోదీ ప్రభుత్వ చర్య ఉత్తరాది ఆధిపత్యాన్ని పెంచి, దక్షిణాది రాష్ట్రాల అధికారాలను తగ్గించే కుట్రగా అభివర్ణించారు. మహిళలకు రిజర్వేషన్ పెంచితే తప్పు లేదని, కానీ, ఆ బిల్లుతో డీలిమిటేషన్‌ను ఎందుకు ముడిపెడుతున్నారని నిలదీశారు. డీలిమిటేషన్ బిల్లుకు వ్యతిరేకంగా ఏప్రిల్ 18న బషీర్‌బాగ్ బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహం నుంచి బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ చేయాలని తెలంగాణ సమాఖ్య ఆధ్వర్యంలోని అఖిలపక్షం ఏకగ్రీవంగా తీర్మానించింది. బుధవారం బేగంపేటలో తెలంగాణ సమాఖ్య ఆధ్వర్యంలో ‘సమాఖ్య రాజ్యాంగానికి తూట్లు పొడిచే డీలిమిటేషన్’ అంశంపై అఖిపలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు పార్టీలకు చెందిన నాయకులు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీరును తూర్పారబట్టారు.
తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎం కోదండరామ్ మాట్లాడుతూ, 131వ రాజ్యాంగ సవరణ బిల్లుపై బయట ఒక విధంగా చెబుతూ లోపల చేసేది మరో విధంగా అన్నారు. ఏ లెక్క ప్రకారం, ఏ పద్ధతుల్లో సీట్లు పెంచుతారనే దానిపై స్పష్టత ఇవ్వడం లేదన్నారు. సీట్ల పెంపు విషయాన్ని బహిరంగంగా, పారదర్శకంగా ప్రకటించడం లేదని చెప్పారు. రాజ్యాంగ సవరణ ద్వారా డీలిమిటేషన్‌పై కమిషన్‌కు అధికారం ఇస్తారన్నారు, ఈ కమిషన్ లో రిటైర్డు సుప్రీంకోర్టు జడ్జీ, ఎలక్షన్ కమిషన్ ప్రధాన కమిషనర్ ఉంటారని పేర్కొన్నారు. ఇప్పటికే ప్రధాన కమిషనర్ వ్యవహారశైలిపై దేశంలో పెద్ద రచ్చ జరుగుతున్న విషయాన్ని కోదండరామ్ గుర్తు చేశారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగే విధంగా ఉన్న 131వ రాజ్యాంగ సవరణ బిల్లును తిరస్కరించాల్సిందేనన్నారు. ప్రతి రాష్ట్రానికి అస్తిత్వం ఉంటుందని, తెలంగాణకు సాయుధ పోరాటం, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం అని ఆయన గుర్తుచేశారు. ద్రావిడ ఉద్యమం తమిళనాడుకు, నారాయణగురు సంస్కరణలు కేరళకు అస్తిత్వం తెచ్చాయన్నారు. ఈ ఆకాంక్షల వ్యక్తీకరణకు విరుద్ధంగా డీలిమిటేషన్ చేసి ఉత్తరాది రాష్ట్రాలను బలోపేతం చేస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఉత్తరాది ఆధిపత్యం పెరిగితే చిన్న రాష్ట్రాల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఉత్తరాదిలో పెద్ద రాష్ట్రాలు చేసి, దక్షిణాదిలో చిన్న రాష్ట్రాలు చేస్తే సమాఖ్య వ్యవస్థ నిలదొక్కుకోలేదని, ఎప్పటికైనా సమస్యలు వస్తాయని అంబేద్కర్ యాభై ఏళ్ల క్రితమే హెచ్చరించారని కోదండరామ్ గుర్తు చేశారు. ఇప్పటి బీజేపీ పాలకులకు వ్యత్యాసాలను సరిచేసే ఆలోచన లేదని, తాము అధికారంలో ఉండటం తప్ప మరో యావ లేదని విమర్శించారు. తాను, తన చుట్టూ ఉండే అంబానీ, అదానీలకు దేశ సంపద చెందాలని చూస్తున్నారని, ఫలితంగా రెండు మూడు కార్పొరేట్ కంపెనీలు పెత్తనం చెలాయిస్తున్నాయని కోదండరామ్ విమర్శించారు.
దక్షిణాది పన్నులతో బాగుపడుతున్న ఉత్తరాది
దక్షిణాది రాష్ట్రాలు పన్నులు కడతాయి కాని ఆ డబ్బులతో ఉత్తరాది వాళ్లు బాగుపడుతున్నారని సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి విమర్శించారు. డీలిమిటేషన్ వల్ల సీట్లు పెరుగుతాయని, ఆ సీట్లు కూడా వారికే దక్కుతాయన్నారు. దీంతో దక్షిణాది రాష్ట్రాలలో అంతర్గత వలసలు జరుగుతాయని, ఈశాన్య రాష్ట్రాలకు కూడా తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కమ్యూనిస్టులను దేశంలో లేకుండా చేయాలని అమెరికాతో పాటు ఇక్కడి బీజేపీ నాయకులు కుట్రలు చేస్తున్నారన్నారు. ఆ కుట్రల ఫలితమే డీలిమిటేషన్ అన్నారు. డీలిమిటేషన్ మూలంగా దేశం నిట్ట నిలువుగా చీలిపోతుందని హెచ్చరించారు. డిమాండ్ల సాధనకు ఏప్రిల్ 18వ తేదీన బషీర్ బాగ్ నుంచి బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించామన్నారు.
రాజ్యాంగ సవరణ పేరిట మరణశాసనం
ఆర్టీఐ మాజీ కమిషనర్, న్యాయకోవిదుడు మాడభూషి శ్రీధర్ మాట్లాడుతూ, బీజేపీ నాయకులు భారత రాజ్యాంగాన్ని కేవలం మూడు రోజుల్లోనే మార్చేస్తారని చెప్పారు. రాజ్యాంగ సవరణ పేరుతో రాజ్యాంగానికి మరణ శాసనం రాస్తున్నారని మండిపడ్డారు. మహిళల రిజర్వేషన్‌కు, డీలిమిటేషన్ అంశాలకు ఏమాత్రం సంబంధం లేదని చెప్పారు. మహిళలకు రిజర్వేషన్ ఇచ్చుకుంటే తప్పే లేదన్నారు. కానీ రిజర్వేషన్ బిల్లుతో డీలిమిటేషన్‌ను ఎందుకు ముడిపెడుతున్నారని ప్రశ్నించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థలను నీరుగార్చుతూ విధ్వంసం చేస్తున్నదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇన్నాళ్లు ఎన్నికల్లో ఓటు ద్వారా తమ సమస్యల పరిష్కారం అవుతాయని అనుకున్నాం కానీ స్వయంప్రతిపత్తి కల్గిన ఎన్నికల కమిషన్ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు చేస్తున్న రాజ్యాంగ సవరణలు చూస్తే అంబేద్కర్ బతికి ఉంటే ఇలా కూడా సవరించవచ్చా? అని ఆశ్చర్యపోయేవారని అన్నారు. జాతీయత అంటే జాతి వేరు, మతం పేరు, కులం వేరు అనే విధంగా ప్రజలను విడదీస్తున్నారన్నారు. జాతీయతను మాతం గా మార్చుతున్నారని ఆయన విమర్శించారు.
ప్రజాభిప్రాయం ఏది?
హైకోర్టు న్యాయవాది శారద మాట్లాడుతూ డీలిమిటేషన్ అనేది ఒక నెంబర్ గేమ్ అని, ప్రజాస్వామ్యంలో ప్రజల అభిప్రాయం తీసుకుంటున్నారా? అని ప్రశ్నించారు. బీజేపీ అంటే మోదీ, అమిత్ షా ప్రభుత్వం అని, అటల్ బిహార్ వాజపేయి తరహా రాజకీయాలు కాదన్నారు. వాళ్లకు, వాళ్లకు చెందిన కంపెనీలకు లాభం జరిగే విధంగా ప్రభుత్వంలో చర్యలుంటాయన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ ఎన్డీఏ నుంచి వైదొలిగి, తమ వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల సమస్యల గురించి నిలదీసినా, ప్రశ్నించినా అర్బన్ నక్సలైట్ అని ముద్ర వేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీతో పాటు ఉత్తరాది నాయకులు డీలిమిటేషన్ గురించి పట్టించుకోవడం, స్పందించడం కూడా లేదని ఆమె అన్నారు.
మంత్రులు ఉత్సవమూర్తులు
పబ్లిక్ పాలసీ నిపుణులు డాక్టర్ దొంతి నర్సింహారెడ్డి మాట్లాడుతూ, కేంద్రంలో అయినా రాష్ట్ర ప్రభుత్వంలో అయినా మంత్రులు ఉత్సవ విగ్రహమేనని, అక్కడ ప్రధాన మంత్రి, ఇక్కడ ముఖ్యమంత్రి నిర్ణయాలు తీసుకుంటారని విమర్శించారు. డీలిమిటేషన్ తరువాత పెరిగిన సభ్యుల సంఖ్యతో చేతులు లేపి మద్దతు తెలుపడం తప్ప మరోటి కాదన్నారు. ఐక్య రాజ్య సమితిలో 58వేల ఒప్పందాలు మన దేశాన్ని శాసిస్తున్నాయన్నాయని, ఈ ఒప్పందాల గురించి మన ఎంపీలకు తెలిసి ఉండకపోవచ్చన్నారు. ఇంతగా సభ్యుల సంఖ్య పెంచుతున్నారని, దీని వల్ల ప్రయోజనం ఏం జరుగుతుందనేది మాత్రం ప్రజలకు చెప్పడం లేదన్నారు. చట్ట సభల్లో సభ్యుల సంఖ్య పెరగడం వల్ల దేశ ఖజానాపై మోయలేని ఆర్థిక భారం తప్ప మరో ఉపయోగం లేదన్నారు.
రెండో శ్రేణి పౌరులుగా దక్షిణాది
న్యూ డెమోక్రసీ నాయకుడు గోవర్థన్ మాట్లాడుతూ, డీలిమిటేషన్ బిల్లు చట్టసభల్లో పాస్ అయితే దక్షిణాది ప్రాంతాల వారు రెండో రకం పౌరులుగా మారే ప్రమాదముందన్నారు. ఈ బిల్లుల దీని వెనకాల బీజేపీకి రాజకీయ లాభం ఉందని విమర్శించారు. యాభై ఏళ్ల క్రితమే రాజ్యాంగం ముసలది అయ్యింది, మార్చుకోవాలనే వాదనకు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. ఈ రాజ్యాంగం పేదలకు న్యాయం చేయడం లేదని కొందరు కమ్యూనిస్టులు కూడా వాదించారని ఆయన గుర్తు చేశారు. పెద్ద నోట్ల రద్దు ద్వారా ఆ లక్ష్యాలు అమలు కాలేదన్నారు. అలాగే అప్పట్లో జీఎస్టీ లో చెప్పినట్లు లక్ష్యాలు సాధించలేదన్నారు. ఆర్ఎస్ఎస్ అడుగుజాడల్లో నడుస్తున్న బీజేపీ ప్రభుత్వం హిందీ, హిందూ, హిందుస్తాన్ మీద ఆధారపడి నడుస్తున్నదని ఆయన విమర్శించారు. వికసిత భారత్ చేస్తామని మోదీ అంటున్నారు అంటే హిందుస్తాన్ చేయడమేనన్నారు. దేశం అంటే ఉపఖండం అని, అలాంటి భారత్‌ను ఒకే దేశం ఒకే మతం ఒకే ఎన్నిక అనడం దుర్మార్గం అన్నారు. అన్ని వర్గాలు, ప్రాంతాలు, ఆచారాలను ఒకటే విధంగా ఉండాలని శాసించడం దుర్మార్గమని చెప్పారు.
ఉత్తరాది ఆధిపత్యం పెంచేందుకే
ఆర్పీఐ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ మాట్లాడుతూ, దేశం యూనియన్ ఆఫ్ ఇండియా కాదని, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా గా ఉండాలని బాబా సాహెబ్ అంబేద్కర్ అప్పట్లో ఆకాంక్షించాన్నారు. కానీ యూనియన్‌కు, యునైటెడ్‌కు చాలా వ్యత్యాసం ఉందని చెప్పారు. యూనియన్ అంటే రాష్ట్రాల హక్కులను కాలరాయడం అని, యునైటెడ్ అంటే స్వేచ్ఛగా ఉండడం, స్వతంత్రంగా పనిచేయడమని వివరించారు. ప్రతి రెండు కోట్ల జనాభాకు ఒక ప్రత్యేక రాష్ట్రం ఉండాలని అంబేద్కర్ భావించారని తెలిపారు. ఉత్తరప్రదేశ్‌ను నాలుగు రాష్ట్రాలు చేయాలని మాయావతి అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించినా పార్లమెంటు అంగీకరించలేన్నారు. దేశంలో రెండు రాజధానులు ఉండాలని ఢిల్లీ తరువాత హైదరాబాద్‌లో కూడా రెండో రాజధాని ఏర్పాటు చేయాలని సూచించారన్నారు. ప్రస్తుతం పార్లమెంటులో చేస్తున్న సవరణలు ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికా? ఉత్తరాది ఆధిపత్యాన్ని పెంచడానికా? అని ఆయన ప్రశ్నించారు. సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ మాట్లాడుతూ, మహిళల రిజర్వేషన్ బిల్లుకు మద్దతిస్తామని స్పష్టం చేశారు. డీలిమిటేషన్‌తో దీన్ని ముడిపెట్టవద్దన్నారు. 18వ తేదీన హైదరాబాద్ లో బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహం నుంచి బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం వరకు జరిగే ర్యాలీకి తమ పార్టీ హాజరవుతుదని తెలిపారు.
ఇవి కూడా చదవండి..
తెలంగాణ కుల గణన లెక్కలు వెల్లడించిన ప్రభుత్వం.. రాష్ట్ర జనాభాలో వారే అత్యధికం
దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యంతో ఆడుకుంటే తీవ్ర తిరుగుబాటు.. కేంద్రానికి కేటీఆర్ హెచ్చరిక
దక్షిణాదిపై డీలిమిటేషన్ బాంబు.. మహిళా రిజర్వేషన్ ముసుగులో కేంద్రం అత్యుత్సాహం
బీజీపీకి లాభం.. ప్రతిపక్షాలకు నష్టం.. : పెరిగే సీట్లపై యోగేంద్రయాదవ్ విశ్లేషణ
