పిల్లలు కావాలంటే నీ భార్యను నా వద్దకు పంపు : టీసీఎస్‌ నాశిక్‌ టీమ్‌ లీడ్‌ దారుణ వ్యాఖ్యలు

టీసీఎస్‌ నాసిక్‌ బ్రాంచ్‌ వివాదాల్లో చిక్కుకుంటున్నది. కొద్ది రోజుల క్రితం మహిళలపై వేధింపుల ఉదంతాలు రాగా.. తాజాగా ఒక ఎంప్లాయీని అనుచిత పదజాలంతో టీమ్‌ లీడ్‌ దుర్భాషలాడిన ఉదంతం సంచలనం రేపుతున్నది.

Allegations on team lead in Nashik branch of TCS

దేశంలోనే ప్రసిద్ధి చెందిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) నాశిక్‌ బ్రాంచ్‌లో లైంగిక వేధింపులు, మత మార్పిడుల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కార్యాలయంలోని ఒక టీమ్‌ లీడర్‌ తనతో అసభ్యంగా మాట్లాడాడని ఒక ఎంప్లాయీ పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనం రేపింది. తమకు ఇంకా సంతానం కలుగలేదని తెలుసుకున్న టీమ్‌ లీడర్‌.. ‘పిల్లలు కావాలంటే నీ భార్యను నా వద్దకు పంపు’ అంటూ అసభ్యంగా మాట్లాడాడని బాధితుడు మీడియాకు చెప్పాడని వీక్‌ ఒక కథనం పబ్లిష్‌ చేసింది. ‘నాకు పిల్లలు లేరు. దీంతో మా టీమ్‌ లీడర్‌ తౌసిఫ్‌ అక్తర్‌, కొలీగ్‌ డానిష్‌ షేక్‌ వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారు. నేను వాళ్ల వద్దకు నా భార్యను పంపాలని అన్నారు. మా మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నప్పుడు తౌసిఫ్‌ కోపంతో నాపైకి ఫ్యాన్‌ విసిరి, నన్ను చంపుతానని బెదిరించాడు. నేను హెచ్‌ఆర్‌కు ఫిర్యాదు చేశాను’ అని ఆయన తెలిపాడని న్యూస్‌ 18 పేర్కొన్నది.

టీమ్‌ లీడర్‌ డిమాండ్లను తాను ఇగ్నోర్‌ చేయడంతో తనపై హెడ్డాఫీస్‌కు తప్పుడు రిపోర్టులు పంపాడని సదరు ఎంప్లాయి తెలిపాడు. మత మార్పిడి ప్రయత్నాలను తాను అడ్డుకుంటున్నానని తౌసిఫ్‌, డానిష్‌ తనతో విభేదించారని పేర్కొన్నాడు. అంతేకాకుండా.. తన టీమ్‌ లీడర్లు.. తనను స్కల్‌క్యాప్‌ పెట్టుకోవాలని, కల్మా చదవాలని, నమాజ్‌ చేయాలని ఒత్తిడి చేశారని తెలిపాడు. ఆఫీసులో మహిళా ఉద్యోగుల పట్ల కూడా వాళ్లు అనుచితంగా ప్రవర్తించారని చెప్పాడు. మరో మీడియాలో వచ్చిన కథనం ప్రకారం.. నైట్‌షిఫ్ట్‌లు అయిన తర్వాత హోటల్స్‌కు తీసుకువెళ్లి.. శాకాహారినైన తనను మాంసాహారం తీసుకోవాలని ఒత్తిడి చేశారని సదరు వ్యక్తి ఆరోపించాడు. ఎంప్లాయీ ఫిర్యాదు మేరకు తౌసిఫ్‌, డానిష్‌, మరో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. టీసీఎస్‌ నాసిక్‌ బ్రాంచ్‌లో మత మార్పిళ్లు, లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నారు.

తౌసిఫ్‌, డానిష్‌లపై 23 ఏళ్ల ఉద్యోగిని కూడా ఫిర్యాదు చేశారు. తనను బలవంతంగా ముద్దు పెట్టుకునేందుకు ప్రయత్నించారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. తౌసిఫ్‌, డానిష్‌, హెచ్‌ఆర్‌ ఎగ్జిక్యూటివ్‌ నిదా ఖాన్‌.. హిందూ దేవతల గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని, తన మతపరమైన విశ్వాసాలను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. ఈ మొత్తం ఆరోపణలపై పోలీసులు 9 కేసులు నమోదు చేశారు. ఏడుగురు పురుషులు, ఒక మహిళను అరెస్టు చేశారు. మరో మహిళ పరారీలో ఉంది.

ఈ ఘటనపై నాసిక్‌ పోలీస్‌ కమిషనర్‌ సందీప్‌ కర్ణిక్‌ స్పందిస్తూ.. బాధితుడి ఫిర్యాదును స్వీకరించేందుకు సంబంధిత యూనిట్‌ ఆపరేషన్స్‌ అండ్‌ హెచ్‌ఆర్‌ తిరస్కరించారని, ‘ఇవన్నీ మామూలే’ అంటూ నిందితుల పక్షాన నిలిచాడని చెప్పారు.

ఈ వారం మొదట్లో ఎనిమిది మంది మహిళా ఉద్యోగులు తమను సీనియర్‌లు మానసికంగా, లైంగికంగా వేధిస్తున్నారని హెచ్‌ఆర్‌కు ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదన్న ఆరోపణలపై పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించారు. ఈలోపే తాజా ఉదంతం బయటకు వచ్చింది.

Latest News