Site icon vidhaatha

California | మాల్‌లో 400 మంది టీనేజ‌ర్ల మూకుమ్మ‌డి దాడి.. దోపిడీ

California | విధాత‌: ఉన్న‌ట్టుండి వంద‌ల మంది టీనేజ‌ర్లు ఒక‌రిఒక‌రు సిగ‌ప‌ట్లు ప‌ట్టుకున్న ఘ‌ట‌న అమెరికా (America) లో జ‌రిగింది. కాలిఫోర్నియాలోని ఎమిరెవిల్లె న‌గ‌రంలో ఉన్న ఈస్ట్ బే షాపింగ్ మాల్‌లో ఆదివారం ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. సుమారు 300 నుంచి 400 మంది టీనేజ‌ర్లు హ‌ఠాత్తుగా షాపింగ్ మాల్‌లోకి ప్ర‌వేశించి గొడవ ప‌డ్డారు. అంతే కాకుండా మాల్‌లోని అద్దాల‌ను ప‌గ‌ల‌కొట్టి వ‌స్తువుల‌ను దోచేశారు.

ఒక‌రిని ఒక‌రు పిడిగుద్దులు గుద్దుకుంటూ బీభ‌త్సం సృష్టించార‌ని ప్ర‌త్య‌క్ష సాక్షులు తెలిపారు. తొలుత వారి హ‌డావుడి చూసి ఏదైనా కాల్పులు చోటుచేసుకున్నాయా? లేక క‌త్తి పోటు ఘ‌టన ఏమైనా జ‌రిగిందా అని అనుకున్నామ‌ని ఒక యువ‌తి పేర్కొంది. ఈ గంద‌ర‌గోళంలోనే ఒక తుపాకీ తూటా పేలిన‌ట్లు శ‌బ్దం వినిపించింది కానీ అది ఎవ‌రినీ గాయ‌ప‌రిచిన‌ట్లు వినిపించ‌లేద‌ని తెలుస్తోంది.

ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి ప్ర‌ధాన అనుమానితుడు ఒక‌రిని అరెస్టు చేశామ‌ని పోలీసులు వెల్ల‌డించారు. ఇక్క‌డ 400 మంది టీనేజ‌ర్లు దాడి చేయ‌డానికి వ‌స్తే ఇళ్ల‌ల్లో వారి త‌ల్లిదండ్రులు ఏమి చేస్తున్నార‌ని దాడిలో గాయ‌ప‌డిన ఒక మ‌హిళ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రానురాను ఒంట‌రిగా బ‌య‌ట తిరిగే ప‌రిస్థితులు క‌నుమ‌రుగ‌వుతున్నాయ‌ని వాపోయారు.

ఈ ఘ‌ట‌న జ‌రిగిన కొంత‌సేప‌టికే ద‌గ్గ‌ర్లోనే ఉన‌న్ టార్గెట్ రిటైల్ స్టోర్‌లోనూ కొంద‌రు దుండ‌గులు విధ్వంసం సృష్టించారు. స్టోర్‌లోని అద్దాలు ప‌గ‌ల‌కొట్టి వ‌స్తువుల‌ను దొంగిలించారు. అయితే కొన్ని రోజుల క్రితం కూడా ఒక షాపింగ్ మాల్‌లో చొర‌బ‌డిన యువ‌కులు అక్క‌డి బ్రాండెడ్ దుస్తుల‌ను దొంగ‌లించుకుపోయిన విష‌యం తెలిసిందే.

Exit mobile version