Chhattisgarh
- మృతులు DRG విభాగానికి చెందిన పోలీసులు
విధాత: ఛత్తీస్‌గఢ్ దంతెవాడ జిల్లా అరణ్‌పూర్‌లో నక్సలైట్లు IED మందుపాతర పేల్చడంతో 10 మంది జవాన్లు, ఒక డ్రైవర్ మృతిచెందారు. మృతులంతా డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ జవాన్లు. డీఆర్‌జీ జవాన్లు కూంబింగ్ ముగించుకుని మినీ బస్సులో వస్తుండగా నక్సలైట్లు మందుపాతర పేల్చారు.
ముందస్తు సమాచారం మేరకు నక్సలైట్లు ప్రణాళిక ప్రకారం మందుపాతర అమర్చినట్లు భావిస్తున్నారు. ఇటీవల చతిస్‌ఘడ్ దంచేవాడ ప్రాంతంలో వరుసగా ఎన్కౌంటర్ సంఘటనలు జరిగిన విషయం తెలిసిందే.
Visuals from the spot in Dantewada where 10 DRG jawans and a civilian driver lost their lives in an IED attack by #Naxals. #Dantewada #Chhattisgarh #Exclusive pic.twitter.com/7qgGKmXKO7
— Siraj Noorani (@sirajnoorani) April 26, 2023
ఈ వరుస సంఘటనలో పలువురు నక్సలైట్లు మృతి చెందారు. ఇటీవల పై చేయి సాధించిన పోలీసులపై ప్రతీకారం తీర్చుకునేందుకు పకడ్బందీ ప్రణాళిక రచించినట్లు భావిస్తున్నారు. కూంబింగ్ పార్టీల కదలికలపై నక్సలైట్లు నిఘా వేసినట్లు అనుమానిస్తున్నారు.
అందుకే పథకాన్ని అనుకున్నట్లు అమలు చేశారని అంచనా వేస్తున్నారు. ఈ మందు పాతర పేలిన ఘటనలో మొత్తం 11 మంది చనిపోయారు. మరి కొంతమంది గాయపడ్డట్టు చెబుతున్నారు.
దంతెవాడలో మావోయిస్ట్ల దాడి సంఘటనలో మరణించిన 10 డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్లు, 1 డ్రైవర్. హెడ్ కానిస్టేబుళ్లు జోగా సోధి -74, మున్నా రామ్ కడ్తి- 965, 901- సంతోష్ తమో, కానిస్టేబుళ్లు దుల్గో మాండవి- 542, లక్ష్ము మార్కం- 289, జోగా కవాసి- 580, హరిరామ్ మాండవి- 888, సైనికులు రాజు రామ్ కర్తమ్, జైరాం పొడియం, జగదీష్ కవాసి, డ్రైవర్ ధనిరామ్ యాదవ్ చనిపోయారు.
ఘటనా స్థలనికి పోలీస్ ఉన్నతాధికారులు చేరుకున్నారు. నక్సలైట్ల ఆచూకీ కోసం చుట్టుపక్కల ప్రాంతాల్లో పోలీసులు ముమ్మరంగా కూంబింగ్ మొదలుపెట్టారు. భారీ స్థాయిలో పోలీసు బలగాలను ఆ ప్రాంతంలో మోహరించి అడవిని జల్లెడ పడుతున్నారు. గిరిజన పల్లెల్లో జనం వణికిపోతున్నారు.
ఈ మందు పాతర సంఘటన సమాచారం తెలుసుకున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ భాఘేల్‌తో మాట్లాడారు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకున్నారు. అన్నివిధాలా సాయమందిస్తామని హామీ ఇచ్చారు.