Site icon vidhaatha

రాహుల్‌పై కేసు న‌మోదు చేయండి.. డీజీపీకి అస్సాం సీఎం ఆదేశం


విధాత‌: గువాహ‌టిలో ఘ‌ర్ష‌ణలు చోటుచేసుకున్న‌నేప‌థ్యంలో కాంగ్రెస్ మాజీ అధ్య‌క్షుడు రాహుల్‌గాంధీపై కేసు నమోదు చేయాలని అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ డీజీపీని ఆదేశించారు. రాష్ట్ర రాజ‌ధాని గువాహ‌టిలో భారత్ జోడో న్యాయ్ యాత్ర నిర్వ‌హిస్తున్న రాహుల్.. జనాన్ని రెచ్చగొట్టారని శర్మ మంగ‌ళ‌వారం ఆరోపించారు.


ఘర్షణలపై ఇండియన్ యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్ బీవీ చేసిన ట్వీట్‌పై శర్మ స్పందించారు. “ఇవి అస్సామీ సంస్కృతిలో భాగం కాదు. మనది శాంతియుత రాష్ట్రం. ఇలాంటి ‘నక్సలైట్ వ్యూహాలు’ మన సంస్కృతికి పూర్తిగా పరాయివి. జనాలను రెచ్చగొట్టినందుకు, మీ హ్యాండిల్స్‌లో మీరు పోస్ట్ చేసిన ఫుటేజీని సాక్ష్యంగా ఉపయోగించుకున్నందుకు, మీ నాయకుడు రాహుల్ గాంధీపై కేసు నమోదు చేయాలని, నేను అస్సాం డీజీపీని ఆదేశించాను. మీరు మార్గదర్శకాలను ఉల్లంఘించడం వల్ల ఇప్పుడు గువాహ‌టిలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది“. అని పేర్కొన్నారు.


రాహుల్ గాంధీ నేతృత్వంలోని భారత్ జోడో న్యాయ్ యాత్ర మంగళవారం అసోంలోకి ప్రవేశించింది. గువాహ‌టిలో కాంగ్రెస్ కార్యకర్తలు, అస్సాం పోలీసులు మ‌ధ్య తోపులాట చోటుచేసుకున్న‌ది. నగరంలో ట్రాఫిక్ జామ్‌లను నివారించడానికి పోలీసులు ఎక్క‌డిక‌క్క‌డ బారీకేడ్ల‌ను ఏర్పాటుచేశారు.


రాహుల్ గాంధీ బస్సు యాత్ర రాజ‌ధానిలోకి ప్రవేశించిన తర్వాత ఘర్షణలు ప్రారంభమైనట్టు సమాచారం. పోలీసులతో కాంగ్రెస్ కార్యకర్తలు వాగ్వాదానికి దిగి బారికేడ్లను తొలగించేందుకు ప్రయత్నించారు. పార్టీ కార్యకర్తలను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేయాల్సి వచ్చింది. సుమారు 30 నిమిషాల పాటు ఉద్రిక్తత నెలకొన్న‌ది. యాత్ర తరువాత హైవే మార్గంలోనే సాగింది.


రాహుల్ యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి అస్సాం ప్రభుత్వం యాత్రకు అనుమతులపై ఆంక్ష‌లు విధించింది. ఈ క్ర‌మంలో రాహుల్ గాంధీ, అస్సాం సీఎం మధ్య మాటల యుద్ధం కొన‌సాగింది. రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా యాత్రను అడ్డుకుంటున్నదని కాంగ్రెస్ ఆరోపించింది.

Exit mobile version