Site icon vidhaatha

Reorganisation of the constituencies | దక్షిణాదిపై.. పునర్విభజన కత్తి!

Reorganisation of the constituencies

జనాభా నియంత్రణకు చర్యలు తీసుకోవడం.. అందులో సత్ఫలితాలు సాధించడం ఒక రాష్ట్రం సాధించే ప్రగతి సూచిక! కానీ.. మీ వద్ద జనాభా తక్కువ ఉన్నది కాబట్టి మీకు పార్లమెంటరీ నియోజకవర్గాలను పెంచేది లేదంటే? జనాభా నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కోరేది కేంద్ర ప్రభుత్వమే. ఆ కృషిలో సఫలమైన రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు అందించాల్సి ఉన్నా.. పార్లమెంటరీ నియోజకవర్గాల పునర్విభజనలో మాత్రం ఈ విషయంలో మంచి పురోగతి సాధించిన దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోనున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌నే తీసుకుంటే.. జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచితే.. తెలంగాణకు 23, ఆంధ్రకు 30 సీట్లు ఉంటాయి. అదే పాత సీట్ల నిష్పత్తి ప్రకారం పునర్విభజిస్తే.. తెలంగాణకు 27, ఆంధ్రకు 39 స్థానాలు అవుతాయి!

విధాత: కొత్త పార్లమెంటు భవనం ప్రారంభం కొత్త వివాదాన్ని రేకెత్తించింది. పార్లమెంటు సీట్లను పెంచవలసి వస్తే ఏ పద్ధతిని అనుసరించాలన్నదానిపై వాదోపవాదాలు చెలరేగాయి. సాధారణంగా తాజా జనాభా లెక్కల ప్రకారం పెంచదల్చుకున్న సీట్లను ఆయా రాష్ట్రాల మధ్య విభజించవలసి ఉంటుంది. ప్రస్తుతం 1971 జనాభా లెక్కల ప్రాతిపదికగా విభజించిన సీట్లే కొనసాగుతున్నాయి. 2008లో నియోజకవర్గాల పునర్విభజన జరిగినా ఆయా రాష్ట్రాలలో సీట్ల సంఖ్య మాత్రం మారలేదు.

2026 తర్వాత తిరిగి పునర్విభజన చేయవలసి ఉంటుంది. అప్పటికి తాజా జనాభా లెక్కలు ఏవైతే వాటి ప్రాతిపదికన సీట్ల సంఖ్యను విభజించవలసి ఉంటుంది. కొవిడ్‌ కారణంగా 2021 జనాభా లెక్కల సేకరణ జరుగలేదు. ఆ తర్వాత కూడా జనాభా లెక్కల సేకరణను కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ వస్తున్నది. 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత జనాభా లెక్కలను సేకరించే అవకాశం ఉందని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.

ప్రగతి సాధన శాపమా?

అసలు సమస్య ఏమంటే జనాభా ప్రాతిపదికన విభజించడం మొదలు పెడితే ఇంతకాలం జనాభా నియంత్రణ, శిశుమాతా మరణాల నియంత్రణ చేసిన దక్షిణాది రాష్ట్రాలకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఉదాహరణకు కొత్త పార్లమెంటు 888 సభ్యులు కూర్చునేందుకు వీలుగా నిర్మించారు. ప్రస్తుతం ఉన్న 543 స్థానాలను ఏ 850 స్థానాలకో పెంచదల్చుకున్నారు అనుకోండి.

జనాభా ప్రాతిపదికన విభజిస్తే ఉత్తర ప్రదేశ్‌, బిహార్‌ మెజారిటీ స్థానాలను దక్కించుకుంటాయి. తెలంగాణకు కేవలం ఆరు స్థానాలు పెరుగుతాయి. అంటే ఇప్పుడున్న 17 స్థానాలు 23కు పెరుగుతాయి. అదే విధంగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్న 25 స్థానాలు 30కి పెరుగుతాయి. అదే ఉత్తర ప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్న 80 స్థానాలు 121కి పెరుగుతాయి.

ఇలాగైతే ఏ రాష్ట్రానికీ అన్యాయం జరుగదు

గతంలోని సీట్ల కేటాయింపుల నిష్పత్తిలోనే సీట్లను కొత్తగా సీట్లను కేటాయిస్తే ఏ రాష్ట్రానికీ అన్యాయం జరుగదు. ఉదాహరణకు పాత సీట్ల నిష్పత్తి, అంటే లోక్‌సభలో ప్రస్తుతం ఉన్న 543 స్థానాల్లో ఉత్తర ప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్న 80 స్థానాల వాటా ప్రకారం విభజిస్తే ఉత్తరప్రదేశ్‌లో సీట్ల సంఖ్య 119కి పెరుగుతుంది. తెలంగాణలో సీట్ల సంఖ్య 26 లేక 27 స్థానాలకు పెరుగుతుంది. ఆంధ్ర ప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్న 25 స్థానాలు 39కి పెరుగుతాయి.

ప్రాతిపదిక మార్చాలంటే రాజ్యాంగ సవరణతోనే..

ఈ ప్రాతిపదికను మార్చాలంటే రాజ్యాంగ సవరణ చేయవలసి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే రాజ్యాంగ సవరణకు కూడా పెద్దగా సమస్యలు ఉండకపోవచ్చు. లోక్‌సభ స్థానాల సంఖ్య 1000కి పెంచాలని చాలాకాలంగా నిపుణులు సూచిస్తున్నారు. పాత స్థానాల నిష్పత్తి ప్రకారం చేయదల్చుకుంటే జనాభా లెక్కలతో పనిలేదు. మొత్తానికి లోక్‌సభ స్థానాల సంఖ్య పెంచాలన్న ఆలోచన రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారమే సృష్టించింది.

ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల రాజకీయ పక్షాలు, మేధావి వర్గాలు పాత పద్ధతిలో నియోజకవర్గాల విభజనపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. జనాభా ప్రాతిపదికన సీట్ల సంఖ్యను విభజిస్తే ఫెడరల్‌ స్వభావం దెబ్బతింటుందని వారు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ఉత్తర, దక్షిణ ప్రాంతాల మధ్య అధికార అసమానత ఉందని, జనాభా ప్రాతిపదికన విభజిస్తే ఈ అసమానతలు రెట్టింపు అవుతాయని, దేశంలో రాజకీయ సంక్షోభానికి దారితీస్తుందని వారు భావిస్తున్నారు.

Exit mobile version