Site icon vidhaatha

బీహార్ సీఎం క్ష‌మాప‌ణ‌లు… ఎందుకంటే..

పాట్నా: బీహార్ అసెంబ్లీలో మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకుగానూ సీఎం నితీష్ కుమార్ క్షమాపణలు చెప్పారు. జనాభా నియంత్రణపై ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం లేపాయి. దీనితో నితీష్ కుమార్ వెంటనే స్పందించారు. తన వ్యాఖ్యలతో తప్పుడు సందేశం వెళ్లి ఎవరైనా తీవ్ర మనస్థాపానికి గురై ఉంటే క్షమించాలని కోరారు. ఇటీవల బీహార్ లో నిర్వహించిన కులగనణకు సంబంధించిన నివేదికను బీహార్ అసెంబ్లీలో మంగళవారం ప్రవేశపెట్టిన సందర్భంగా చర్చ జరిగింది. ఈ చర్చలో నితీష్ కుమార్ మాట్లాడుతూ.. చదువుకున్న మహిళలు శృంగారంలో తమ భర్తలను నియంత్రించగలరని వ్యాఖ్యానించారు.


‘భర్తల చర్యల వల్ల జననాల రేటు పెరిగింది. అయితే చదువుకున్న మహిళకు భర్తని ఎలా నియంత్రించాలో తెలుసు. అందుకే ఇప్పుడు జననాల రేటు తగ్గుతూ వస్తోంది అన్నారు. దీనిపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. నితీష్ తన వ్యాఖ్యలతో ప్రజాస్వామ్య హుందాతనాన్ని దెబ్బతీశారని విమర్శించింది. అంతేకాదు అసెంబ్లీలో ఇలాంటి సిగ్గుచేటు వ్యాఖ్యలు ఏమాత్రం సరైనది కాదని పేర్కొన్న‌ది. ఆయన మానసిక రుగ్మతతో బాధపడుతున్నట్లు కనబడుతోంద‌ని, ఆయన తక్షణమే తన పదవికి రాజీనామా చేసి వైద్యున్ని సంప్రదించాలని సూచించింది.


నితీష్ వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్ రేఖా శర్మ తీవ్రంగా ఖండించారు. మహిళల హక్కులు, ఎంపిక విషయంలో ఆయన వ్యాఖ్యలు దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయ‌న్నారు. బీహార్ అసెంబ్లీలోనూ నిరసన వ్యక్తం కావ‌డంతో.. ‘నా మాటలు వెనక్కి తీసుకుంటున్నాన‌ని మీడియా ముందు ఇచ్చిన వివరణను అందరూ చూశారు, ఇంకెందుకు అసెంబ్లీలో ఈ అరుపులు? అని నితీష్ కుమార్ విపక్షాలపై తన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్జేడీ మాత్రం నితిశ్‌కు మ‌ద్ద‌తుగా నిలిచింది. ఆయన మాటలను వక్రీకరించకూడదని ఆర్జేడీ నేత‌, ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ అన్నారు. ఇదిలా ఉంటే.. సీఎం వ్యాఖ్యలను నిరసిస్తూ ముజఫర్ పూర్ కోర్టులో లాయర్ అనిల్‌కుమార్ సింగ్ ఫిర్యాదు చేశారు. ఈ కేసు విచారణను కోర్టు ఈ నెల 25కు వాయిదా వేసింది.

Exit mobile version