Dasari Bhumaiah
విధాత బ్యూరో, కరీంనగర్: పోలీస్ శాఖలో సంచలనాలకు మారుపేరుగా నిలిచిన రిటైర్డ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ దాసరి భూమయ్య (Dasari Bhumaiah) ను సోమవారం హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉదయం ఆయన ఇంటికి చేరుకున్న పోలీసులు భూమయ్యను ఓ ప్రముఖ రియల్‌టర్ హత్యనేరం కింద అరెస్ట్ చేస్తున్నట్లు ఆయన భార్యకు సమాచారం ఇచ్చారు.
పోలీసు శాఖలో పదవీ విరమణకు ముందు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఏసీబీ అధికారులు చేసిన సోదాల్లో ఆయన కారులో నగదుతో పట్టు పడగా ఆ మొత్తాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇందుకు సంబంధించి ఆయనపై కేసు నమోదు కాలేదు.
ఇక హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ లో తుపాకుల మాయం విషయంలోనూ పోలీసు ఉన్నతాధికారులు ఆయనకు నోటీసులు ఇచ్చారు. అయితే అవి దొరకడంతో ఆ విషయం అంతటితోనే సద్దుమణిగిపోయింది.
పదవి విరమణ తర్వాత భూమయ్య (Dasari Bhumaiah) కాంగ్రెస్ పార్టీలో చేరి కొంతకాలం క్రియాశీలకంగా పని చేశారు. అనంతరం తీన్మార్ మల్లన్న టీంలో చేరి రాష్ట్ర కన్వీనర్ గా పనిచేస్తున్నారు.
హుజురాబాద్ ఉప ఎన్నికల సమయంలో అధికార పార్టీ నుండి వచ్చిన ఒత్తిళ్ళ మేరకు ఆయన గులాబీ కండువా కప్పుకున్నారు. తీన్మార్ మల్లన్న బిజెపికి మద్దతుగా ఉన్నారన్న కారణంగా కొంతకాలం
మల్లన్న టీం నుండి వైదొలిగారు.
కానిస్టేబుల్ ఒకరు ఇచ్చిన ఫిర్యాదు మేరకే భూమయ్య(Dasari Bhumaiah)ను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఆయనకు నోటీసులు ఇచ్చి వదిలివేస్తారా? అరెస్టు చేసి కోర్టులో హాజరు పరుస్తారా అన్నది తెలియాల్సి ఉంది.