Disqualification Petition Of BRS MLAs: పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ విచారణను సుప్రీం కోర్టు ఏప్రిల్ 2కు వాయిదా వేసింది. మంగళవారం జరిగిన విచారణలో బీఆర్ఎస్ తరఫున వాదనలు ముగిశాయి. స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శి వాదనలను ఏప్రిల్ 2న వింటామంటూ విచారణను సుప్రీం కోర్టు వాయిదా వేసింది. స్పీకర్ తరఫున సోమవారం సాయంత్రం సుప్రీంకోర్టులో అసెంబ్లీ సెక్రటరీ కౌంటర్ దాఖలు చేశారు. పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపునకు సంబంధించి తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ సకాలంలో నిర్ణయం తీసుకోలేదన్న వాదన సరైంది కాదని.. పిటిషనర్లు దురుద్దేశంతో వ్యవహరిస్తున్నారని అందులో పేర్కొన్నారు. స్పీకర్ ను ఆశ్రయించిన 20 రోజులకే బీఆర్ఎస్ వాళ్ళు కోర్టును ఆశ్రయించారని కౌంటర్ లో పేర్కొన్నారు. అనర్హత పిటిషన్లపై చట్టంలో పేర్కొన్న పద్ధతిని స్పీకర్ అనుసరిస్తున్నారని, స్పీకర్ ఉద్దేశ పూర్వకంగా ఆలస్యం చేశారనడానికి ఎలాంటి కారణాలు లేవని అసెంబ్లీ కార్యదర్శి తెలిపారు. ఈ విషయంలో దాఖలైన స్పెషల్ లీవ్ పిటిషన్లలో పస లేదని, వాటిని తిరస్కరించాలని.. పార్టీ ఫిరాయింపులపై వేసిన పిటిషన్లను కొట్టివేయాలని కౌంటర్ లో కోరారు.
మంగళవారం వాదనలు మొదలవ్వగానే.. అసెంబ్లీ కార్యదర్శి దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్ సంగతిని స్పీకర్ తరపున వాదనలు వినిపిస్తున్న సీనియర్ లాయర్ ముకుల్ రోహత్గి ప్రస్తావించారు. ఈ వ్యవహారంలో స్పీకర్ ను ఆదేశించే అధికారం న్యాయస్థానానికి ఉంటుందా? లేదంటే రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించాలా? అని కోరారు. బీఆర్ఎస్ తరఫున వాదించిన అర్యమా సుందరం.. ఫిర్యాదులపై ఏం చేస్తారో.. 4 వారాల్లో షెడ్యూల్ చేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించిందని.. అయినా పార్టీ మారిన వారికి స్పీకర్ నోటీసులు ఇవ్వలేదన్నారు. ధర్మాసనం కొన్ని వ్యాఖ్యలు చేసిన తర్వాతే నోటీసు ఇచ్చారని.. 3 వారాల్లో రిప్లై ఇవ్వాలని.. ఫిబ్రవరి 13న స్పీకర్ నోటీసులు ఇచ్చారని తెలిపారు. ఇప్పటికి 3 వారాలైందని, నోటీసులు ఎటు వెళ్లాయో తెలియదని కోర్టుకు నివేదించారు. తాము ఫిర్యాదు చేసి ఏడాదైనా స్పీకర్ షెడ్యూల్ కూడా చేయలేదని సుందరం వాదించారు. నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకునేలా స్పీకర్ ను ఆదేశించాలని కోర్టును కోరారు. స్పీకర్ ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తున్నారన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ప్రచారం చేశారని తెలిపారు. స్పీకర్ ను ప్రశ్నించడం లేక అడ్డుకోవడం తమ ప్రయత్నం కాదని..ఫిరాయింపుల చట్టాన్ని అమలు చేయాలని మాత్రమే స్పీకర్ ను కోరుతున్నామని కోర్టుకు స్పష్టం చేశారు.
ఈ క్రమంలో స్పందించిన జస్టిస్ గవాయ్.. పార్టీ ఫిరాయింపులకు వార్షికోత్సవం అయిందా? అని వ్యాఖ్యానించారు. అయితే ఇలాంటి వ్యవహారాల్లో గతంలో రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పులు ఉన్నప్పటికీ.. ఎప్పటిలోగా తేల్చాలనే విషయంపైనే స్పష్టత కొరవడిందని వ్యాఖ్యానించారు. అలాంటప్పుడు ఆ తీర్పును కాదని ఎలా ముందుకు వెళ్లగలమని చెప్పింది. ఉన్నత ధర్మాసనాల తీర్పులను ఎలా తిరిగి రాయగలమని ప్రశ్నించింది. ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వడానికి ఇంకా ఎంత కాలం పడుతుందని ధర్మాసనం ప్రశ్నించింది. ఆలస్యం చేసే ఎత్తుగడలు అనుసరించొద్దని సూచించింది. ఎమ్మెల్యేల ఫిరాయింపులపై ఫిర్యాదు వచ్చి ఎంతకాలమైంది? రీజనబుల్ టైం అంటే పదవి కాలం గడువు ముగిసేవరకా? మొదటి ఫిర్యాదు చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎంత టైం గడిచింది? అని ప్రశ్నలు గుప్పించింది. నాలుగు వారాలైనా షెడ్యూల్ ఫిక్స్ చేయలేదా? .. అదృష్టవశాత్తూ.. ఎమ్మెల్యేలు 4 ఏళ్లు ఆగలేదని, మూడు వారాల సమయం విషయంలో మాత్రం స్పీకర్ రీజనబుల్ గా ఉన్నారని వ్యాఖ్యానించింది. తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చిన తీర్పులో డివిజన్ బెంచ్ జోక్యం సరైందో కాదో చూస్తామన్నారు.
కాగా ఎమ్మెల్యేల తరుపున వాదనలు వినిపించేందుకు వారం రోజులు గడువు కావాలని న్యాయవాది ముకుల్ రోహత్గీ అభ్యర్థించారు. కౌంటర్ దాఖలుకు సమయం కోరడంపై ప్రతివాదులపై న్యాయమూర్తి గవాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే బుధవారం వాదనలు వింటామని స్పష్టం చేస్తూ విచారణ వాయిదా వేశారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలె యాదయ్య, సంజయ్, కృష్ణమోహన్, మహిపాల్‌రెడ్డి, ప్రకాష్‌గౌడ్, అరికె పూడి గాంధీలపై అనర్హత వేటుపై స్పీకర్ ను ఆదేశించాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దాఖలు చేసిన రెండు వేర్వేరు పిటిషన్లను కలిపి సుప్రీంకోర్టు విచారించింది. మరోవైపు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుత పిటిషన్లపై వాదనలు ముగిశాక తమ పిటిషన్ విచారించాలని కోరారు. అయితే తాము ఈ వ్యవహారంలో మెరిట్స్ లోకి వెళ్లడం లేదని..ఎమ్మెల్యేలు పార్టీ మారిన వ్యవహారంలో స్పీకర్ కు ఆదేశాలు జారీ చేయవచ్చా లేదా అన్న అంశంపై మాత్రమే పరిశీలన చేస్తున్నామని జస్టిస్ గవాయ్ స్పష్టం చేశారు. ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేశారు..ఎటు వెళ్లారు వంటి అంశాలను చూడటం లేదని పేర్కొన్నారు.