హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని డీకే ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థులను ట్రాప్ చేసేందుకు కేసీఆర్ ప్రయత్నం చేస్తుందని డీకే పేర్కొన్నారు. కేసీఆర్ స్వయంగా సంప్రదించినట్లు తమ పార్టీ అభ్యర్థులు చెప్పారని శివకుమార్ తెలిపారు. గెలిచిన వారిని క్యాంపులకు తరలించే అవసరం రాదు అని స్పష్టం చేశారు. తెలంగాణలో సునాయాసంగా అధికారంలోకి వస్తామని డీకే విశ్వాసం వ్యక్తం చేశారు.
తెలంగాణలోని 119 నియోజకవర్గాలకు నవంబర్ 30న పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ నెల 3వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. ఓట్ల లెక్కింపునకు 49 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం వరకు మెజార్టీ స్థానాల ఫలితాలు వెలువడనున్నాయి. ఇక ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని తేలింది. తామే అధికారంలోకి వస్తున్నామని టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా ధీమా వ్యక్తం చేశారు.