Site icon vidhaatha

Kedarnath | తెరుచుకున్న కేదార్‌నాథ్‌ ఆలయ ద్వారాలు.. మొదలైన దర్శనాలు..!

Kedarnath | కేదార్‌నాథ్‌ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి. మంగళవారం ఉదయం 6.20 గంటలకు ప్రత్యేక పూజల అనంతరం ఆలయ ద్వారాలను తెరిచారు. ఈ సందర్భంగా ఆలయాన్ని 35 క్వింటాళ్ల పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. దాదాపు 8వేల మంది భక్తులు తరలివచ్చారు. బాబా కేదార్‌ పంచముఖి భోగ్‌ విగ్రహం రావల్‌ నివాసం నుంచి సోమవారం బయలుదేరగా.. వేకువ జామున ఆలయానికి చేరుకుంది. ఆ తర్వాత బద్రీనాథ్‌-కేదార్‌నాథ్‌ ఆలయ కమిటీ అధికారుల సమక్షంలో అధికారులు, పూజలు తెరిచారు. ఆర్మీ బ్యాండ్‌, హరహర మహాదేవ్‌ నినాదాలతో ఆలయ పరిసరాలు మార్మోగాయి.

అనంతరం మహాశివుడికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామివారి దర్శనాలకు భక్తులను అనుమతించారు. ఆలయ ద్వారాలు తెరిచి సందర్భంగా ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామి హాజరై, ప్రత్యేక పూజలు చేశారు. అయితే, చార్‌ధామ్‌ యాత్రకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని సీఎం తెలిపారు. భక్తులందరూ సులభంగా దర్శనాలు పొందవచ్చన్న ఆయన.. భక్తులందరి కోరికలు నెరవేర్చాలని ఆకాంక్షించారు. ఈసారి యాత్రకు గతేడాది కంటే ఎక్కువ మంది తరలివచ్చే అవకాశం ఉందన్నారు. ఇదిలా ఉండగా.. చార్‌ధామ్‌ యాత్రలో కీలకమైన గంగోత్రి, యమునోత్రి ఆలయాలు అక్షయ తృతీయ సందర్భంగా తెరిచిన విషయం తెలిసిందే. ఇక బద్రీనాథ్‌ ఆలయ ద్వారాలను భక్తుల కోసం 27న తెరువనున్నారు.

Exit mobile version