Tabletop Red Marking | అటవీ ప్రాంతాల్లో రోడ్లపై తరచూ ప్రమాదాలు జరిగి వన్యప్రాణులు చనిపోతూ ఉంటాయి. అడవిలో ఒక భాగం నుంచి మరో భాగానికి వెళ్లే క్రమంలో రోడ్డు దాటుతుండగా అతివేగంగా వచ్చే వాహనాలు ఢీకొని దుర్మరణం పాలవుతూ ఉంటాయి. ఇటువంటి ప్రాంతాల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకునేలా నేషనల్ హైవేస్ అథార్టీ వినూత్న ప్రయోగం చేస్తున్నది. అటవీ ప్రాంతాల్లో మానవుల, వన్యప్రాణుల రాకపోకలను సమన్వయం చేసేలా కొత్త విధానాన్ని తీసుకుంటున్నది. ఇందు కోసం సెన్సిటివ్ జోన్లలో రోడ్లపై చతురస్రాకారంలో ఎర్రని రంగుతో మార్కింగ్ చేస్తారు. దీనినే ‘టేబుల్–టాప్ రెడ్ మార్కింగ్’ అని పిలుస్తున్నారు. ప్రస్తుతం అన్ని జాతీయ రహదారులపై తెల్లని రంబుల్స్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇవి సుమారు రెండు మూడు మిల్లీమీటర్ల ఎత్తున ఉంటాయి. వాటిపై నుంచి వెళ్లే వాహనాలు.. తప్పనిసరిగా వేగాన్ని తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఇదే తరహా విధానాన్ని మరికాస్త విరివిగా వాడుతూ ఈ రోడ్లను నిర్మిస్తారు.
దుబాయిలోని షేక్ జాయెద్ రోడ్ దీనికి స్ఫూర్తిగా తీసుకున్నారు. భారతదేశంలో ఇటువంటి ప్రయోగం చేపట్టడం ఇదే ప్రథమం. భవిష్యత్తుల్లో అన్ని సున్నితమైన ప్రాంతాల్లో ఎర్రటి చారలు ఉన్న రహదారులు దర్శనమివ్వనున్నాయి. ఈ విధానం తక్కువ ప్రభావం.. ఎక్కువ రక్షణ కల్పిస్తుందని హైవే అథారిటీ వర్గాలు చెబుతున్నాయి.
కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ (MoRTH) ఆధ్వర్యంలో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఈ వినూత్న ప్రణాళికలను రచించింది. వన్యప్రాణులు తిరిగే అటవీ ప్రాంతాల్లో, ప్రమాదకర మలుపులు ఉండే ఘాట్ రోడ్లలో టేబుల్–టాప్ రెడ్ మార్కింగ్‌ను అమలు చేయనున్నారు. ఇప్పటికే మధ్య ప్రదేశ్‌లోని వీరాంగన దుర్గావతి టైగర్ రిజర్వ్ మీదుగా సాగే 11.96 కిలోమీటర్ల రహదారి ప్రాజెక్టులో 2 కిలోమీటర్ల ఘాట్ రోడ్డులో ఈ విధానం అమలు చేశారు. అంతర్జాతీయ పరిశోధనలు, మార్గదర్శకాలను అనుసరించి ఈ రోడ్డులో ఐదు మిల్లీ మీటర్ల మందంతో హాట్ అప్లైడ్ థర్మోప్లాస్టిక్ రెడ్ సర్ఫేస్ లేయర్‌లను ఏర్పాటు చేశారు.
రోడ్లపై ప్రస్ఫుటంగా కనిపించే ఎర్రటి రంగు సర్ఫేస్ లేయర్లు.. తాము వేగాన్ని నియంత్రించాల్సిన, వన్యప్రాణులు తిరిగే ప్రాంతంలోకి వచ్చాయన్న సంకేతాన్ని డ్రైవర్లకు ఇస్తాయి. వీటిపైకి వాహనం రాగానే.. సహజంగానే ఉబ్బెత్తుగా ఉన్న లేయర్లు.. వాహనాన్ని కుదుపుతాయి. దాంతో సహజంగానే డ్రైవర్లు అనివార్యంగా వాహనాలను మెల్లగా నడిపించాల్సి ఉంటుందని ఎన్‌హెచ్‌ఏఐ వర్గాలు చెబుతున్నాయి.
ప్రత్యేకతలు
- వన్యప్రాణుల రాకపోకలకు ఎలాంటి అవాంతరాలు ఉండవు.
- ఈ రహదారులపై డ్రైనేజీలు, పేవ్మెంట్ నిర్మాణలను అనుమతించబోరు.
- సాధారణంగా రహదారులపై ఉండే రంబుల్ స్ట్రిప్స్‌తో పోల్చితే తక్కువ శబ్దం వస్తుంది.
- నిర్వహణ చాలా సులభం.
భవిష్యత్తులో ఏమన్నా మార్పులు చేయాలన్నా పూర్తి స్థాయిలో చేసుకునే పద్ధతిలో ఉంటాయి. ఎర్రటి సర్ఫేస్‌లేయర్లతోపాటు.. రోడ్డకు ఇరువైపులా వైట్ షోల్డర్ లైన్స్ కూడా ఏర్పాటు చేయనున్నారు. తద్వారా వాహనాలు క్రమపద్ధతిలో ముందుకు సాగేందుకు వీలు ఉంటుంది.
మధ్యప్రదేశ్‌లో నిర్మించిన 11.96 కిలోమీటర్ల రహదారిలో వన్యప్రాణుల రాకపోకలు స్వాభావికంగా సాగే ఎన్‌హెచ్‌ఏఐ 25 డెడికేటెడ్ అండర్‌పాస్‌లను ఏర్పాటు చేసింది. అంటే.. అటవీ భూమికి సమాంతరంగానే వన్యప్రాణులు అండర్ పాస్ నుంచి రాకపోకలు సాగించవచ్చు. అదే సమయంలో రహదారి ఇరువైపులా మొత్తం చైన్–లింక్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. దీని వల్ల జంతువులు రోడ్లపైకి వచ్చే అవకాశాలు బాగా తగ్గిపోతాయి. అండర్ పాస్‌ల వైపు జంతువులను మళ్లించేలా వీటి ఏర్పాటు ఉంటుంది. రాత్రిపూట సౌకర్యం కోసం సోలార్ లైట్లు, ఉల్లంఘనలకు పాల్పడినవారిని గుర్తించేందుకు కెమెరాలు కూడా ఈ మార్గంలో అమర్చారు.
Read Also |
Street Dogs Chase Explained | కుక్కలు ఎందుకు వెంటపడుతాయో తెలుసా?
State of Global Air-2025 Report | వాయు కాలుష్యంతో డిమెన్షియా మరణాలు.. తాజా అధ్యయనం హెచ్చరిక
IndiGo crisis Marxist analysis | ఇండిగో సంక్షోభం లేవనెత్తే ప్రశ్నలు, నేర్పే పాఠాలు – ఒక విశ్లేషణ
