Street Dogs Chase Explained | కుక్కలు ఎందుకు వెంటపడుతాయో తెలుసా?

రోడ్డుపై బైక్‌ మీద పోతూ ఉంటే.. సమీపంలోని కుక్కలు వెంటపడతాయి. పెద్దగా మొరుగుతాయి. కారు వెళ్లినా అంతే.. చాలాసార్లు మనుషుల వెంటపడతాయి. ఇలాంటి దృశ్యాలు అందరికీ అత్యంత సామాన్యమైనవే. సాధారణంగా ఎదురుపడుతూ ఉండేవే. అయితే.. ఎందుకిలా జరుగుతుంది?

Street Dogs Chase Explained | రోడ్ల మీద మనుషులు, కార్లు, బైక్‌ల వెంటపడి పెద్దగా మొరుగుతుంటాయి వీధి కుక్కలు. దాంతో భయపడనివారు అరుదు. కానీ.. వీధి కుక్కలు ఇలా వెంటపడి ఎందుకు మొరుగుతుంటాయి? నిజానికి కుక్కలు వెంటపడేది శత్రుత్వంతో కాదు. శునకాల ప్రపంచానికకంటూ కొన్ని స్పెషల్‌ రూల్స్‌ ఉంటాయి. చలో.. మిమ్మల్ని ఆశ్చర్యపర్చే ఆ సంగతులే ఇప్పుడు తెలుసుకుందాం.

కుక్కలు మొరిగినప్పుడు వెలువడే శబ్దం.. మనుషులు అరిచినప్పుడు వచ్చేదానికంటే చాలా శక్తిమంతమైనది. ఆ ప్రాంతం మీదుగా ఎవరు వెళుతున్నారన్న సంగతిని కొంత దూరం నుంచే వాసన పసిగట్టడం ద్వారా కుక్కలు గ్రహిస్తాయి. సాధారణంగా మీ వాహనాల టైర్లకు మీ ప్రాంతాల్లో తిరిగే కుక్కలకు సంబంధించిన వాసన ఉంటుంది. అదే వేరే ప్రాంతాల నుంచి వాహనాలు వచ్చినట్టయితే.. వెంటనే అవి పసిగట్టేస్తాయి. తమ ప్రాంతంలోకి వేరే కుక్క వాసన వచ్చిందని గుర్తిస్తాయి. వెంటనే అలర్ట్‌ అయ్యి, బిగ్గరగా మొరుగుతూ వెంటపడతాయి. దానర్థం వాటి ‘సామ్రాజ్యాన్ని’ అవి రక్షించుకుంటున్నాయన్నమాట.

మీరు చూసే ఉంటారు.. సాధారణంగా శునకాలు కార్ల టైర్ల మీద, గోడల మీద, స్తంభాల మీద మూత్ర విసర్జన చేస్తుంటాయి. ఇదేదో యాదృచ్ఛికం కాదు. వాటికి ప్రత్యేక భాష ఉంటుంది. ఇలా చేయడం ద్వారా వాటి ఉనికిని అక్కడ రిజిస్టర్‌ చేస్తాయి. దీని వెనుక జత కట్టే ఆలోచన, ఇండివిడ్యువల్‌ ఐడెంటిటీ, తమ ఉనికిని చాటుకోవడం వంటి ఉంటాయి. వేరే వాహనం ఆ మార్గంలో వెళుతున్నప్పుడు ఆ టైర్లకు వేరే ప్రాంత కుక్క రిజిస్టర్‌ చేసిన వాసనను లోకల్‌ కుక్కలు పసిగడతాయనే వాదన ఉంది. తద్వారా తమ ప్రాంతంలోకి వేరే కుక్కలు వచ్చాయని గ్రహిస్తాయని, తమ ప్రాంతం తమది కాకుండా పోతుందేమోనని భయపడి కోపంతో కార్ల వెంటపడుతాయని అంటారు. అయితే.. దీనికి కచ్చితమైన నిర్ధారణలు ఏమీ లేవు.

కేవలం వాసనలే కాదు.. ఫీలింగ్స్‌ ఆధారంగా కూడా శునకాలు కొన్ని సందర్భాల్లో వ్యవహరిస్తూ ఉంటాయి. కుక్కలు ఎంత విశ్వాస జీవులో అంత సున్నిత హృదయం కలిగినవి కూడా. ఏదైనా వాహనం తన సహచర శునకాన్ని గాయపర్చినా, లేక రోడ్డు ప్రమాదంలో చంపినా.. సదరు వాహనాన్ని కుక్కలు గుర్తు పెట్టుకుంటాయనే వాదనలు కూడా ఉన్నాయి. అది వాస్తవమా? కాదా? అని ఆలోచించే ముందు.. కుక్కలకు మానవుల కంటే జ్ఞాపక శక్తి చాలా ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వ్యక్తులు, పరిసర ప్రదేశాలు, వస్తువులు, కొన్ని సార్లు ప్రత్యేకమైన ధ్వనులను కూడా అవి గుర్తు పెట్టుకుంటాయి. అయితే.. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గోళ్లతో రక్కడం వంటివి జరిగాయని వార్తల్లో వస్తుంటాయి. కానీ.. నిర్దిష్టంగా అదే వాహనాన్ని గుర్తు పెట్టుకుంటుందని కచ్చితంగా చెప్పలేమని నిపుణులు పేర్కొంటున్నారు.

కదిలే వాహనాన్ని కుక్కలు టార్గెట్‌ చేస్తే?

సాధారణంగా కుక్కలు నిశ్చలంగా ఉన్న వాటి జోలికి పోవు. ఏదైనా వేగంగా కదిలితే తమకు సవాలుగా భావిస్తాయి. వాటికి ఉండే వేట స్వభావం రీత్యా వేగంగా కదిలేవాటిని టార్గెట్‌ చేస్తాయి. అందుకు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లేవారిని ఏమీ చేయవు. కానీ.. అదే వ్యక్తి కుక్కలను చూసి పరుగుపెడితే మాత్రం వెంటపడతాయి. అయితే.. అటువంటి సమయాల్లో కంగారు పడకూడదు. అకస్మాత్తుగా వాహనం వేగం పెంచకూడదు. అటువంటి సమయాల్లో వాహనంపై మీరు బ్యాలెన్స్‌ కోల్పోయి.. ప్రమాదానికి గురయ్యే అవకాశాలు ఉంటాయి. అవకాశాన్ని బట్టి.. మెల్లగా వాహనం వేగం తగ్గించి.. పరిస్థితులకు అనుగుణంగా కొద్ది క్షణాలు వాహనాన్ని నిలిపివేయాలి. కుక్కలు వెంటపడి తరుముతాయి. అదే సందర్భంలో రెచ్చగొడితేనే దాడికి దిగుతాయి. మీ ప్రాంతంలో ఉండే కుక్కలను తగిన జాగ్రత్తలతో మచ్చిక చేసుకుంటే.. మీకు ఎలాంటి సమస్యలు ఉండవు.

ఇవి కూడా చదవండి..

Elon Musk : సంపదలో ఎలాన్ మస్క్‌ సరికొత్త రికార్డు
State of Global Air-2025 Report | వాయు కాలుష్యంతో డిమెన్షియా మరణాలు.. తాజా అధ్యయనం హెచ్చరిక
Giant Python In Drainage : డ్రైనేజీలో భారీ కొండచిలువ..వైరల్ వీడియో

Latest News