టాంజానియా: భారత్‌లో ప్రతిష్ఠాత్మకమైన విద్యాసంస్థలుగా ప్రసిద్ధి చెందిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ (ఐఐటీ)లు విదేశాల్లోనూ సేవలందించనున్నాయి. ఇందులో భాగంగా టాంజానియా దేశంలో తొలి ఐఐటీ (IIT) ఏర్పాటు కానుందని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) గురువారం ప్రకటించింది.
ప్రస్తుతం టాంజానియా (Tanzania) ద్వీపకల్పమైన జంజిబార్ పర్యటనలో ఉన్న ఆ శాఖ మంత్రి జై శంకర్, జంజిబార్ ప్రెసిడెంట్ హుసేన్ అలీ మ్వినీ ఈ మేరకు ఎంవోయూపై సంతకాలు చేశారు.
ఈ ఒప్పందం ప్రకారం జంజిబార్‌లో ఐఐటీ మద్రాస్ క్యాంపస్‌కు అనుబంధంగా ఇక్కడ ఐఐటీ జంజిబార్ ఏర్పాటు కానుంది. ‘విదేశాల్లో మొట్టమొదటి ఐఐటీ క్యాంపస్ జంజిబార్‌లో రానుంది. గ్లోబల్ సౌత్ పురోగమనానికి భారత్ కట్టుబడి ఉందనడానికి ఇది రుజువు’ అని ఈ సందర్భంగా ఎంఈఏ ట్వీట్ చేసింది.
ఈ నిర్ణయం భారత్, టాంజానియా స్నేహంలో మరో ముందడుగు అని వ్యాఖ్యానించింది. గ్లోబల్ సౌత్‌కు, ఆఫ్రికా ప్రజానీకానికి ఇలాంటి నిర్ణయాల వల్ల సంబంధాలు మెరుగుపడతాయని పేర్కొంది. భారత్‌లో మెరుగ్గా రాణిస్తున్న అత్యత్తమ విద్యాసంస్థల క్యాంపస్‌లను విదేశాల్లోనూ ఏర్పాటు చేయడానికి అనుమతిస్తామని విద్యా విధానం (ఎన్ ఈపీ ) – 2020లో కేంద్రప్రభుత్వం వెల్లడించిన విషయం విదితమే