Site icon vidhaatha

Padala Aruna | మాజీ మంత్రి పడాల అరుణ.. జనసేనలో చేరిక

Padala Aruna

విధాత‌: గోదావరి జిల్లాల పర్యటనలో ఇమేజి మాత్రమే పెరిగింది తప్ప పెద్ద నాయకులు, చెప్పుకోదగ్గ క్యాడర్ మాత్రం జనసేనలో చేరలేదు కానీ ఇప్పుడు ఉత్తరాంధ్ర టూర్ మాత్రం పవన్ కు బాగానే గిట్టుబాటు అయ్యేలా ఉంది.

గతంలో గాజువాక నుంచి పోటీ చేసి వైసిపి అభ్యర్థి తిప్పల నాగిరెడ్డి చేతిలో ఓడిపోయిన పవన్ ఇప్పుడు ఉత్తరాంధ్రలో కాస్త గట్టిగా సత్తా చూపాలని భావిస్తున్నారు. ఇప్పటికే పెందుర్తి మాజీ ఎమ్మెల్యే, వైసిపి జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు జనసేనలో చేరారు..

మళ్ళీ పెందుర్తి నుంచి పోటీకి సిద్ధం అవుతున్నారు. అక్కడ ప్రస్తుతం అదీప్ రాజు వైసిపి నుంచి గెలిచి ఎమ్మెల్యేగా ఉన్నారు. మళ్ళీ ఆయనకే టికెట్ దక్కేలా ఉంది. ఇక టిడిపి నుంచి కూడా మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జి టికెట్ కోసం చూస్తున్నారు. మరి అక్కడ పొత్తులో ఎవరు పోటీ చేస్తారన్నది ఇంకా క్లారిటీ లేదు. ఇక విజయనగరం నుంచి గజపతినగరం మాజీ ఎమ్మెల్యే పడాల అరుణ రేపు జనసేనలో చేరేందుకు సిద్ధం అయ్యారు.

కాపు సామాజికవర్గానికి చెందిన అరుణ గతంలో గజపతినగరం నుంచి ఎమ్మెల్యేగా మూడుసార్లు గెలిచారు. చంద్రబాబు జమానాలో మహిళా సంక్షేమశాఖ మంత్రిగా కూడా చేసారు. ఆతరువాత అక్కడ ప్రభ కోల్పోయి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. రెండేళ్ల క్రితం టిడిపికి రాజీనామా చేసిన అరుణ రేపు పవన్ సమక్షంలో జనసేనలో చేరుతున్నారు. ప్రస్తుతం గజపతినగరం ఎమ్మెల్యేగా బొత్స సత్యనారాయణ తమ్ముడు అప్పలనర్సయ్య ఉన్నారు.

టిడిపి నుంచి కూడా కొండపల్లి అప్పలనాయుడు తదితరులు యాక్టివ్ గా ఉన్నారు. ఇక అరుణ ఎన్నికల్లో పోటీ చేస్తారా ? టికెట్ ఇస్తారా ? పొత్తు ఉంటె ఆ నియోజకవర్గం ఎవరి ఖాతాలోకి వెళ్తుంది ? అనేదానిమీద ఇంకా స్పష్టత లేదు.

ఇదిలా ఉండగా పవన్ కు సొంత గోదావరి జిల్లా కన్నా ఉత్తరాంధ్రలో కాస్త ఇమేజి, క్రేజి ఉన్నట్లు ఈ చేరికలు బట్టి తెలుస్తోంది. మరోవైపు పవన్ పర్యటనకు ప్రభుత్వం బోలెడు నిబంధనలు పెడుతోంది. ఉత్తరాంధ్రలో పవన్ ఏమి మాట్లాడతారు ? ఎలాంటి నిర్ణయాలు వెల్లడిస్తారన్నదని మీద ఉత్కంఠ నెలకొంది.

Exit mobile version