Site icon vidhaatha

HIGH COURT | కోర్టు ఆదేశాలను పాటించారా? IIIT హైదరాబాద్ వైస్‌ చాన్స్‌లర్‌, చాన్స్‌లర్‌కు హైకోర్టు నోటీసులు

HIGH COURT |

హైదరాబాద్, విధాత : కోర్టు ఆదేశాలు ఇచ్చినా అమలు చేయనందుకు నేరుగా హాజరై వివరణ ఇవ్వాలని ఐఐఐటీ, హైదరాబాద్‌ వైస్‌ చాన్సిలర్‌, చాన్సిలర్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూలై 14కు వాయిదా వేసింది.

ముంబైకి చెందిన ధైర్య ఓంప్రకాశ్‌ ఝుంఝున్వాలా 2020లో ఐఐఐటీ, హైదరాబాద్‌లో బీటెక్‌ సీటు వచ్చింది. రూ.1,60,000 కట్టి కాలేజీలో చేరారు. అయితే అనంతరం ఐఐటీ, ముంబైలో సీటు రావడంతో అక్కడ చేరారు. తాను కట్టిన ఫీజును తిరిగి ఇవ్వాలని పలుమార్లు కోరినా నిరాకరించడంతో ఐఐఐటీ, హైదరాబాద్‌పై హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం రూ.1,59,000లను 2020 నుంచి 12 శాతం వడ్డీతో కలపి ఇవ్వాలని 2023, ఏప్రిల్‌లో తీర్పునిచ్చింది. అంతేకాకుండా కోర్టు ఖర్చుల కింద మరో రూ.10వేలు ఇవ్వాలని ఆదేశించింది. ఈ చెల్లింపునకు నెల గడువు విధించింది.

గడువు పూర్తయినా కోర్టు ఆదేశాలు అమలు చేయకపోవడంతో ధైర్య ఓంప్రకాశ్‌ హైకోర్టులో ధిక్కార పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై సోమవారం విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ ద్వి సభ్య ధర్మాసనం కేంద్ర ఉన్నత విద్యా శాఖ కార్యదర్శి, ఐఐఐటీ వీసీ, రిజిస్ట్రార్‌కు నోటీసులు జారీ చేసింది. కోర్టు ఆదేశాలు ఎందుకు అమలు చేయలేదో చెప్పాలని ఆదేశించింది.

Exit mobile version