High Court |
హైదరాబాద్, విధాత : ఓ భూ వివాదంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, పోలీసులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. భూ వివాదానికి సంబంధించి ఫెనీస్ట్రేషన్ సిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్‌పై 100 మందితో దాడి చేశారని, కోట్ల రూపాయల విలువైన సామగ్రిని తీసుకువెళ్లారని.. దీనిపై ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేయలేదని అజయ్ అగర్వాల్, సులోచన అగర్వాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి సోమవారం విచారణ చేపట్టారు. పోలీసులకు దాడి విషయంపై ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. పలుమార్లు అడిగాక వారం తర్వాత ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని, పిటిషనర్లకు రక్షణ కల్పించేలా పోలీసులను ఆదేశించాలని కోరారు.
వాదనలు విన్న ధర్మాసనం.. దాడి అంశంపై నివేదిక అందజేయాలని ఇన్‌స్పెక్టర్ ప్రశాంత్, ఎస్‌ఐ మల్లేశ్వర్ ఆదేశించింది. అలాగే ఎమ్మెల్యే గాంధీకి వ్యక్తిగతంగా నోటీసులు పంపాలంటూ పిటిషనర్‌కు సూచిస్తూ.. తదుపరి విచారణను ఆగస్టు 10కి వాయిదా వేసింది.