INDIA Alliance | మహారాష్ట్రలో ఇండియా కూటమి సీట్ల సర్దుబాటు

  • Publish Date - April 9, 2024 / 03:54 PM IST

ఉద్ధవ్‌ సేనకు 21, కాంగ్రెస్‌కు 17, ఎన్సీపీ(శరద్‌) 10

ముంబై: మహారాష్ట్రలో ఇండియా కూటమి (INDIA Alliance) సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చింది. కుదిరిన ఒప్పందం ప్రకారం శివసేన (ఉద్ధవ్‌) 21 సీట్లలో పోటీ చేయనుంది. కాంగ్రెస్ 17, ఎన్సీపీ (శరద్‌పవార్‌) 10 సీట్లలో పోటీ చేస్తాయి. సీట్ల సర్దుబాటులో కీలకంగా మారిన సంగ్లి, భీవండిలపై ఉద్ధవ్‌ సేన, కాంగ్రెస్‌ రాజీకి వచ్చాయి. సంగ్లిలో ఉద్ధవ్‌సేన, భీవండిలో కాంగ్రెస్‌ పోటీ చేస్తాయి. మరోవైపు సంప్రదాయికంగా శివసేనకు పట్టున్న ముంబై నార్త్‌ కాంగ్రెస్‌కు కేటాయించారు.

ముంబైలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో సీట్ల సర్దుబాటు వివరాలను ఉద్ధవ్‌ ఠాక్రే, ఎన్సీపీ (శరద్‌) చీఫ్‌ శరద్‌పవార్‌, మహారాష్ట్ర కాంగ్రెస్‌ చీఫ్‌ నానా పటోల్‌ వెల్లడించారు. సీట్లపై ప్రతి ఒక్కరూ పట్టుబట్టడంలో తప్పు లేదని, అయితే.. గెలిచేవారికి ప్రాధాన్యం ఇవ్వాలని ఈ సందర్భంగా ఉద్ధవ్‌ఠాక్రే అన్నారు. గుడి పాడ్వా పర్వదినం, మరాఠా కొత్త సంవత్సరం సందర్భంగా ఈ ఒప్పందం కుదిరిందని సోషల్‌మీడియా పోస్టులో శివసేన (ఉద్ధవ్‌) తెలిపింది.

‘రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాడేందుకు మేం ప్రతినబూనాం. భవిష్యత్తులో నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడేందుకు సంకల్పించాం’ అని పేర్కొంది. లోక్‌సభ ఎన్నికలకు మహారాష్ట్రలో ఐదు దశల్లో.. ఏప్రిల్‌ 19, 26, మే 7, 13, 20 తేదీల్లో పోలింగ్‌ నిర్వహించనున్నారు. కొన్ని కీలక సీట్లపై మహావికాస్‌ అఘాడీ భాగస్వామ్య పక్షాలు పట్టుదలగా ఉండటంతో సీట్ల సర్దుబాటులో జాప్యం చోటుచేసుకున్నది.

Latest News