హైజాక్‌కు గురైన ఒక భారీ నౌక (Ship Hijack) ను కాపాడటానికి భారత నేవీ (Indian Navy) వెంబడిస్తోంది. ప్రస్తుతం ఆ నౌక సోమాలియా వైపు వెళుతుండటంతో దానికి హైజాక్ చేసింది సోమాలియా పైరేట్స్ (Somalia Pirates) అని భావిస్తున్నారు. ఎం.వీ రూయిన్ అనే ఈ సరకు రవాణా నౌక గురువారం అర్ధరాత్రి ఎమర్జెన్సీ సిగ్నల్స్‌ను పోస్ట్ చేసింది. తాము ఆపదలో ఉన్నామని..నౌకను హైజాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపింది.
ఈ సిగ్నల్ అందుకున్న నేవీ అధికారులు ఒక ఒక యాంటీ పైరసీ ప్యాట్రోల్‌ను ఎంవీ రూయిన్ వైపు పంపారు. దానితో పాటు ఒక హెలికాప్టర్ కూడా బయలుదేరి వెళ్లింది. బందీ కాబడిన నౌకలో మొత్తం 18 మంది క్రూ ఉన్నారని తెలుస్తోంది. ఈ నౌక సరకుతో మాల్టా దీవులకు వెళుతోందని సమాచారం. దాని వద్దకు చేరుకుని.. సిబ్బందిని రక్షించే ప్రయత్నంలో ఉన్నామని నేవీలోని ఒక అధికారి వెల్లడించారు.
ప్రస్తుతం భారత నౌక ఎంవీ రూయిన్‌ను అడ్డగించిందని.. ఆ తర్వాత సమాచారం లేదని ఒక మీడియా సంస్థ పేర్కొంది. నౌక కదలికలను బట్టి చూస్తుంటే దానిని హైజాకర్లు నడుపుతున్నారని అనిపిస్తోందని అధికారులు తెలిపారు. ఈ సముద్ర మార్గంలో ఎవరైనా సాయం అర్థిస్తే చేయందించే తొలి దేశంగా భారత్ ఉంటుంది. అందులో భాగంగానే రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాం. అంతర్జాతీయ భాగస్వామ్య సంస్థలు, ఇతర నేవీ అధికారులతో కలిసి సమస్యను పరిష్కరిస్తాం అని నేవీ ఒక ప్రకటన విడుదల చేసింది.
ఈ ఘటనతో సోమాలియా పైరేట్‌లు చాలా సంవత్సరాల తర్వాత వార్తల్లోకి వచ్చారు. 2017 తర్వాత వారు ఒక నౌకను హైజాక్ చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 2017 తర్వాత వివిధ దేశాలకు చెందిన యాంటీ పైరసీ స్క్వాడ్‌లు విరివిగా ప్యాట్రోలింగ్‌లు చేయడం వల్ల వీరి ఆగడాలు తగ్గాయి. కానీ తాజాగా ఈ ఘటన జరగడంతో మరోసారి చుట్టుపక్కల దేశాలు అప్రమత్తమయ్యాయి. సోమాలియాకు సమీపంలో ప్రయాణించే నౌకలు జాగరూకతతో ఉండాలని వివిధ దేశాలు అడ్వైజరీ జారీ చేశాయి.