Site icon vidhaatha

భార‌తీయ సంత‌తి కుటుంబ హ‌త్య‌ల గుట్టు విప్పిన పోలీసులు


కాలిఫోర్నియా: కాలిఫోర్నియాలో ఇటీవ‌ల భార‌తీయ సంత‌తికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆనంద్ హెన్రీ, అత‌ని భార్య‌, ఇద్ద‌రు పిల్ల‌ల మ‌రణాల వెనుక మిస్ట‌రీని అమెరికా పోలీసులు ఛేదించారు. ఆనంద్ హెన్రీ (37) గ‌తంలో మెటా కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ప‌నిచేశాడు. త‌ర్వాత సొంత‌గా ఏఐ కంపెనీని స్థాపించాడు. హెన్రీ, అత‌ని భార్య అలిస్ బెన్జిగ‌ర్ (36) మృత‌దేహాలు అలామెడా డీ లాస్ ప‌ల్గాస్‌లోని వారి ఇంటి బాత్‌రూమ్‌లో సోమ‌వారం ఉద‌యం క‌నుగొన్న‌ట్టు కాలిఫోర్నియా రాష్ట్ర అధికారులు వెల్ల‌డించారు.


అయితే.. ఈ హ‌త్య‌ల మిస్ట‌రీని పోలీసులు ఛేదించారు. త‌న భార్య‌ను తుపాకితో కాల్చి, హెన్రీ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడ‌ని పేర్కొన్నారు. వారి మృత‌దేహాల వ‌ద్ద 9ఎంఎం హ్యాంగ్ గ‌న్ ప‌డి ఉన్న‌ది. బెన్జిగ‌ర్ ఒంటినిండా తూటా గాయాలు ఉన్నాయ‌ని, హెన్రీ మాత్రం ఒకే తూటా గాయంతో మ‌ర‌ణించాడ‌ని త‌మ ద‌ర్యాప్తులో వెల్ల‌డైంద‌ని పోలీసులు గురువారం ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. నాలుగేళ్ల వ‌య‌సున్న‌ ఇద్ద‌రు క‌వ‌లలు మాత్రం తుపాకీ కాల్పుల్లో చ‌నిపోలేద‌ని పేర్కొన్నారు. వారి మ‌ర‌ణానికి కార‌ణం ఇంకా క‌నుగొనాల్సి ఉన్న‌ద‌ని తెలిపారు.


ఈ న‌లుగురి చావుల‌కు హెన్రీ కార‌ణ‌మ‌ని పోలీసులు తెలిపారు. లింక్‌డిన్ ప్రొఫైల్ ప్ర‌కారం హెన్రీ గ‌తంలో మెటాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ప‌నిచేశాడు. అంతుకు ముందు గూగుల్‌లో ప‌నిచేశాడు. ఈ ఉదంతంపై మెటా నుంచి త‌క్ష‌ణ స్పంద‌న రాలేదు. చ‌నిపోయే స‌మ‌యానికి ఆయ‌న ఏఐ టెక్నాల‌జీపై ప‌నిచేస్తున్నాడు. బెన్జిగ‌ర్ జిల్లో కంపెనీలో డాటా సైంటిస్టుగా ప‌నిచేస్తున్న‌ట్టు లింక్‌డిన్ ప్రొఫైల్ ద్వారా తెలుస్తున్న‌ది. వీరిద్ద‌రిదీ కేర‌ళ రాష్ట్రం. ఇద్ద‌రూ పిట్స్‌బ‌ర్గ్‌లోని కార్నిగి మెల‌న్ యూనివ‌ర్సిటీలో చ‌దువుకున్నారు. ఇంటిలో పాత త‌గాదాలు ఉన్న‌ట్టు ఇప్ప‌టికైతే స‌మాచారం లేద‌ని పోలీసులు తెలిపారు. గ‌తంలో వారి నివాసం పెర‌టిలో ఒక సింహం ఉన్న‌ట్టు ఫిర్యాదు చేయ‌డంతో ఒక‌సారి ఆ ఇంటికి వెళ్లామ‌ని చెప్పారు.


ఈ జంట 2016 డిసెంబ‌ర్‌లో విడాకుల కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్న‌ట్టు కోర్టు ప‌త్రాలు పేర్కొంటున్నాయి. అయితే.. వారు త‌దుప‌రి చ‌ర్య‌ల‌కు ముందుకు వెళ్ల‌లేద‌ని తెలుస్తున్న‌ది. వారంతంలో ఆ కుటుంబాన్ని సంప్ర‌దించేందుకు తెలిసినవారు ప్ర‌య‌త్నించ‌గా వారు అందుబాటులోకి రాక‌పోవ‌డంతో పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఈ హ‌త్య‌లు/ మ‌ర‌ణాలు అమెరికా కాలమానం ప్ర‌కారం శ‌నివారం మ‌ధ్యాహ్నం చోటు చేసుకుని ఉండొచ్చ‌ని భావిస్తున్నారు. అయితే, హ‌త్య‌కు ఉద్దేశాలేమిటో ఇంకా ద‌ర్యాప్తు చేస్తున్నామ‌ని పోలీసులు తెలిపారు.

Exit mobile version